‘జేడీ’ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరనున్నారా. త్వరలోనే ఆయన బీజేపీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా. అంటే అవుననే సమాధానాలు ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో జేడీ లక్ష్మీనారాయణ పేరు తెలియని వారు ఉండరేమో.ఆయన సిబిఐ జాయింట్ డైరెక్టర్ వచ్చి జగన్ అక్రమార్జన కేసులను దర్యాప్తు చేసి జగన్ ను అరెస్టు చేసి సంచలనం సృష్టించారు. ఆ పైనా ఆయన తన పెరెంట్ క్యాడర్ మహారాష్ట్ర కు ఐపిఎస్ అధికారిగా వెళ్లారు. ప్రమోషన్లు పొందారు. అడిషనల్ డిజి గా ఎదిగారు.అయితే, తెలుగువాళ్లకు మాత్రం ఆయన ఇంకా ‘జెడి’ (సిబిఐ జాయింట్ డైరెక్టర్ గానే పరిచయం)
చాలా సంచలనాత్మక కేసులను విచారించిన ఆయన ఎంతోమంది అవినీతి పరులను జైలు ఊసలు లెక్కపెట్టుకునేలా చేశారు. అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు జేడీ. ఫోక్స్ వ్యాగన్, సత్యం కుంభకోణం ,ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, గాలి జనార్థన్ రెడ్డి అక్రమాస్తుల కేసులతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగిపోయింది.
అయితే మహారాష్ట్ర క్యాడర్ ఐపిఎస్ ఆఫీసర్ అయిన లక్ష్మీ నారాయణ 2006 లో డిప్యుటేషన్ పై సిబిఐలో చేరారు. ఆంధ్రప్రదేశ్ కు రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా వచ్చారు. ఆ తరువాత తను సొంత క్యాడర్ మహారాష్ట్రకు ట్రాన్స్ ఫర్ అయిన ఆయన అక్కడ కొన్ని రోజులు పనిచేసి గత కొన్ని రోజుల క్రితం స్వచ్చంధ పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే.
స్వచ్చంధ పదవి విరమణ అనంతరం ఏపీకి వచ్చిన ఆయన జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు.కాగా, పదవీ విరమణ చేసిన జేడీ రాజకీయాల్లోకి అరగ్రేటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. . .ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరతారనేది హాట్ టాపిక్ గా మారింది. ఆయన జనసేన పార్టీలో చేరతారని కొద్ది రోజులు, టీడీపీ లేదా బీజేపీలో చేరతారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన జనసేన పార్టీలో చేరతానంటే తాను ఆహ్వానిస్తానని పవన్ కల్యాణ్ ఇప్పటికే, బీజేపీ, టీడీపీ కూడా జేడీని చేర్చుకునేందుకు సిద్దమవుతున్నాయి.అయితే జేడీ లక్ష్మీనారాయణ మాత్రం ఏ పార్టీలో చేరతాననేది ఇప్పటి వరకు తెలియజేయలేదు. కానీ, రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమని ఆయన చెబుతూ వస్తున్నారు.
ఈ తరుణంలో తాజాగా జేడీ లక్ష్మీనారాయణ హైదరాబాద్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ప్రోద్భలంతోనే ఆయన పదవికి రాజీనామా చేశారని, బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్న సమయంలో ఆయన ఆర్ఎస్ఎస్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏపిసోడ్తో ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. మరి జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.