తెలంగాణ లో కేసిఆర్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నాల్లో ఉన్న రేవంత్ రెడ్డికి, ఆయన అభిమానులకు ఇది తీపి కబురే. ఇంతకాలం రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు ఆశగా ఎదురుచూస్తున్న పదవి త్వరలోనే రేవంత్ కు దక్కనుంది. ఆయన కోరిన పదవికి కాంగ్రెస్ అధిష్టానం లైన్ క్లియర్ చేసిందని వార్తలొస్తున్నాయి. మరి ఇంతకూ రేవంత్ కోరిన పదవేంటి? అధిష్టానం ఎలా లైన్ క్లియర్ చేసింది తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని, కేసిఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ముందునుంచీ పనిచేస్తున్నారు. రేవంత్ రాజకీయ జీవితం టిఆర్ఎస్ లోనే ఆరంభించారు. కానీ ఆయనకు ఇప్పుడు టిఆర్ఎస్ అంటే బద్ధ శత్రువు. టిఆర్ఎస్ తో ముఖ్యంగా కేసిఆర్ తో ఎంతగా శత్రుత్వం ఉందంటే.. ఏకంగా తన కూతురు పెళ్లికి కూడా పిలవనంత ఉంది. అయితే ఎలాగైనా 2019లో టిఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా రేవంత్ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన టిడిపిలో ఉంటే టిఆర్ఎస్ ను గద్దె దించలేమన్న తలంపుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అయితే టిడిపిలో మాదిరిగానే రేవంత్ ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా వ్యవహారం సాగలేదు. కొన్ని సందర్భాల్లో తన అజెండా మీద పార్టీని నడిపే ప్రయత్నం చేశారు రేవంత్. కానీ కాంగ్రెస్ లో పాతుకుపోయిన సీనియర్లు రేవంత్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నారు. మరికొందరు నేతలు అధికార పార్టీతో టచ్ లో ఉండి రేవంత్ కు పదవి రాకుండా అడ్డుపుల్లలు వేస్తున్నట్లు రేవంత్ శిబిరం ఆరోపిస్తోంది. దీంతో రేవంత్ పార్టీలో చేరి చాలారోజులైనా ఆయన పదవికి అడ్డుకట్ట పడుతూనే ఉన్నది. ఈ విషయాన్ని బహిరంగంగా రేవంత్ వెల్లడించడంతో అధిష్టానంలో కదలిక వచ్చింది. రేవంత్ కోరినట్లే తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి పదవిని ఆయనకు కట్టబెట్టడం ఖాయంగా చెబుతున్నారు. ఇప్పటికే ఆర్డర్ మీద రాహుల్ గాంధీ సంతకం చేశారని చెబుతున్నారు. బుధవారం నాడు ఈ ఆర్డర్ వెలువరించే అవకాశాలున్నట్లు ఢిల్లీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
నిజానికి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఎప్పడో వర్కింగ్ ప్రసిడెంట్ పదవిని ఆఫర్ చేసింది. ఇప్పటికే తెలంగాణలో మల్లు బట్టి విక్రమార్క వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్నారు. అయితే వర్కింగ్ ప్రసిడెంట్ గా అయితే రాష్ట్రమంతా తిరగడం సాధ్యం కాదన్న భావనలో రేవంత్ ఉన్నారు. అందుకే ఆ పదవిని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక దాంతోపాటు ప్రచార సహాయ కార్యదర్శి పదవిని కూడా ఇస్తామని అధిష్టానం సూచించినా రేవంత్ అంగీకరించలేదు. దీంతో కొద్దిగా ఆలస్యమైనా రేవంత్ కోరినట్లే కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి పదవి రేవంత్ కు మరో రెండు రోజుల్లోనే అనౌన్స్ చేయనున్నట్లు ఆయన సన్నిహితుడు ఒకరు ధృవీకరించారు. ఇక అంతేకాకుండా రేవంత్ తోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కూడా త్వరలోనే పదవులు దక్కుతాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే రేవంత్ తో పార్టీలో చేరిన ములుగు సీతక్కకు జాతీయ స్థాయిలో పదవి దక్కింది.
మొత్తానికి రేవంత్ కు పదవి వస్తే రాష్ట్రమంతా పర్యటించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆయన ఆశించిన పదవి దక్కకపోవడంతో ఒకింత అలకపాన్పు ఎక్కారన్న చర్చ కూడా ఉంది. చదరంగంలో మంత్రి పాత్ర కావాలి తప్ప గుర్రం, ఏనుగు, రాజు, సిపాయి పాత్రలు నాకెందుకు అని రేవంత్ తన సన్నిహితుల వద్ద మాట్లాడుతూ ఉండేవాడట. తాను ఆశించినట్లే మంత్రి పాత్ర దక్కింది. ఇక రేవంత్ మంత్రి పాత్రలో ఎటైనా వెళ్లే వెసులుబాటు దక్కనుంది అని రేవంత్ సన్నిహితులు చర్చించుకుంటున్నారు.