కేసిఆర్ కు ఢిల్లీలో ప్రధాని మోడీ బిగ్ షాక్

తెలంగాణ సిఎం కేసిఆర్ కు ఢిల్లీలో ఊహించని షాక్ తగిలింది. నాలుగురోజుల ఢిల్లీ పర్యటనను కేసిఆర్ 24 గంటల్లోనే ముగించుకోవడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఒక్కరోజులోనే కేసిఆర్ ఢిల్లీ నుంచి తిరుగుపయనమయ్యారు. వివరాలివీ.

ఆదివారం ప్రగతిభవన్ లో కేబినెట్ సమావేశం జరిపారు కేసిఆర్. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చ జరిగింది. అందులో ముఖ్యమైనవి కొత్త జోనల్ విధానం, మల్టీ జోన్లకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అయితే కొత్త జోనల్ విధానంపై కేంద్రం ఆమోద ముద్ర వేయించుకునే క్రమంలో ప్రధానితో భేటీ అయ్యేందుకు ఆదివారం కేబినెట్ సమావేశం అనంతరం కేసిఆర్ ఢిల్లీకి పయనమయ్యారు. ప్రత్యేక విమానంలో కేసిఆర్ ఢిల్లీకి వెళ్లారు. అయితే కేసిఆర్ నాలుగు రోజులపాటు ఢిల్లీలో ఉంటారని, ప్రధాని నరేంద్ర మోడీని కలిసి కొత్త జోన్ల ఏర్పాటు విషయంలో రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం విన్నవిస్తారని ప్రచారం సాగింది.

అంతేకాకుండా ఫెడరల్ ఫ్రంట్ విషయంలో పలువురు ఇతర రాష్ట్రాల పార్టీ నేతలతోనూ కేసిఆర్ సమావేశమవుతారని పార్టీ నేతలు చెప్పుకున్నారు. కానీ అదేమీ లేకుండానే కేవలం 24 గంటల్లోనే కేసిఆర్ తిరుగుముఖం పట్టారు. అయితే కేసిఆర్ కు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ రాకపోవడంతో కేసిఆర్ వెనుదిరిగినట్లు చెబుతున్నారు. ఇది ఒకరకంగా కేసిఆర్ కు అవమానంగా తెలంగాణవాదుల్లో చర్చ నడుస్తోంది.

అయితే కేసిఆర్ ముందస్తుగా ప్రధాని అపాయింట్ మెంట్ తీసుకోకుండానే కేసిఆర్ ఢిల్లీకి వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే తమకు ఈజీగా ప్రధాని అపాయింట్ మెంట్ దొరుకుతుందన్న భావనతో కేసిఆర్ అక్కడకు వెళ్లారని, కానీ అక్కడ సీన్ రివర్స్ అయినట్లు చెబుతున్నారు. ప్రధాని అపాయింట్ మెంట్ రాకపోవడంతో క్షణం ఆలస్యం చేయకుండా కేసిఆర్ హైదరాబాద్ బాట పట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

అయితే కేసిఆర్ సోమవారం మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త జోన్ల ప్రతిపాదనలు రాజ్ నాథ్ సింగ్ కు కేసిఆర్ అందజేశారు. అనంతరం మరో కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాం తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈలోగా ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వలేదని సమాచారం రావడంతో కేసిఆర్ హైదరాబాద్ కు తిరుగుపయనమయ్యారు.

మొత్తానికి ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేసిఆర్ కు అపాయింట్ మెంట్ ఎందుకు ఇవ్వలేదబ్బా అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *