కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యవహారశైలిపై నియోకవర్గ టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రవర్తనపై స్థానిక నేతలు కోపంతో రగిలిపోతున్నట్లు చర్చ జరుగుతోంది. తాజాగా మానకోండూర్ మండలంలోని ఈదుల గట్టేపేల్లి ఎంపీటీసీ రాయికంటి సుమలత తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే రసమయి ప్రవర్తనకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీకి ఆమె రాజీనామా చేయడం టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రసమయి బాలకిషన్ పేరు అందరికీ సుపరిచితమే. తెలంగాణ ఉద్యమంలో ఆయన తెలంగాణ యాస, భాషలో పాటలు పాడి తనకంటూ ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నారు. కళాకారుడిగా ఉద్యమం సమయంలో తెలంగాణవ్యాప్తంగా తిరిగి తన పాటలతో ప్రజలను ఆకట్టుకున్నారాయన. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఆయన పాడిన పాటలు ఉద్యమానికి మరింత ఊపు తెచ్చాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ బహిరంగ సభ జరిగినా రసమయి బాలకిషన్ పాటలే వినిపిస్తూ ఉండేవి. అలా తెలంగాణ ఉద్యమ పాటలతో ప్రజలకు దగ్గరైన ఆయన 2014 ఎన్నికలకు ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ టీఆర్ఎస్ తరపున మానకొండూరు ఎమ్మెల్యే సీటు కేటాయించడంతో గత ఎన్నికల్లో విజయం సాధించారు.
మానకొండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 46 వేల పైచిలుకు మోజార్టీతో భారీ విజయం సాధించారు రసమయి బాలకిషన్. అయితే ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోని కిందిస్థాయి నేతలను కలుపుకొని వెళ్లడంతో ఆయన వైఫల్యం చెందారనే వార్తలు గత కొద్ది రోజుగా వినిపిస్తున్నాయి. అలాగే రసమయి పై అనేక రకాల ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలోనే స్థానిక ఎంపీటీసీ సుమలత టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఆమె రాజీనామా చేయడానికి కారణాలు ఏంటనేదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసలు ముచ్చటేమంటే? రసమయి దత్తత తీసుకున్న గ్రామానికి చెందిన ఎంపిటీసే ఇప్పుడు రాజీనామా చేశారు.