శనివారం సాయంత్రం సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద ఆర్టీసీ బస్సును రెండు లారీలు, క్వాలీస్ ఢీకొట్టాయి. ఒకేసారి నాలుగు వాహనాలు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో 10మంది మృతిచెందారు. 20మందికిపైగా గాయపడ్డారు.
గాయపడ్డవారిని గజ్వేల్, హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదం అలుముకుంది. గాయపడినవారు పెద్దసంఖ్యలో ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు…
రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ సమీపంలో ఈ భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ, క్వాలీస్ వెనుక నుంచి ఢీకొట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ప్రమాదం గురించి తెలియడంతో అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు…
ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం కావడంతో అధికారులకు పైనుంచి వెంటనే ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. మృతులను వెంటనే గుర్తించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మెరుగైన వైద్యం కోసం సమీపంలోని పెద్ద ఆస్పత్రులకు తరలించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు అందాయి…
మృతులకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో ఒక యువ జర్నలిస్టు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంతో రాజీవ్ రహదారిపై నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది…