కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త రకమైన చర్చ నడుస్తోంది. పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను, ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డిని పోలుస్తూ కార్యకర్తల్లో చర్చ నడుస్తోంది. రేవంత్ అలా ఉంటే? కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ఇలా ఎందుకున్నారబ్బా అని వారి చర్చల్లో నానుతున్న ప్రశ్నలు. మరి పూర్తి వివరాలు చదవండి.
అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారన్న కారణంగా కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలు రద్దు చేసింది అసెంబ్లీ. కానీ ఈ రద్దు చెల్లదంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే అసెంబ్లీ సభ్యత్వాలు రద్దైన నేపథ్యంలో కోమటిరెడ్డికి, సంపత్ కు సెక్యూరిటీ తొలగించింది తెలంగాణ సర్కారు. కోర్టు వీరిద్దరి సభ్యత్వాలు పునరుద్ధరించాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ విషయంలో తెలంగాణ సర్కారు కానీ, తెలంగాణ అసెంబ్లీ కానీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనబడడంలేదు. తమ సభ్యత్వాల రద్దు విషయంలో వీరిద్దరూ శక్తివంచన లేకుండా పోరాటం చేసి తెలంగాణ సర్కారును ఇరకాటంలోకి నెట్టేశారు. అయితే పలు సందర్భాల్లో వీరు సొంత పార్టీపై కూడా అసంతృప్తిని వెల్లగక్కారు. తమ సభ్యత్వాల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవడంలేదని, పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తెలంగాణ సర్కారును ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు వీరిద్దరూ.
కానీ ఇటీవల వీరు చేస్తున్న డిమాండ్ పట్ల కాంగ్రెస్ కార్యకర్తల్లో చర్చ మొదలైంది. అదేమంటే? పదే పదే తమకు గన్ మెన్లు కల్పించాలని, తమకు సెక్యూరిటీ ఇవ్వాలని వీరు కోరుతున్నారు. తాజాగా డిజిపి మహేందర్ రెడ్డిని కలిసి తమకు గన్ మెన్లను నియమించాలని విన్నవించారు. అంతేకాదు మొన్నటికి మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సిఎం కేసిఆర్ అందరు ఎమ్మెల్యేల మాదిరిగానే శుభాకాంక్షలతో కూడిన లేఖ రాశారు. ఆ లేఖ పై స్పందించిన కోమటిరెడ్డి తనను ఎమ్మెల్యేగా గుర్తించినందుకు ధన్యవాదాలు చెబుతూనే చురకలు వేశారు. అదే చేత్తో తమకు సెక్యూరిటీ కూడా కల్పించాలని, ప్రొటోకాల్ కల్పించాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా సెక్యూరిటీ కోసం వీరు గట్టి పోరాటమే చేస్తున్నారు.
ఇక వీరి పరిస్థితి ఇలా ఉంటే రేవంత్ వైఖరి వీరికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. రేవంత్ రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో తనకు కేటాయించిన గన్ మెన్లను వాపస్ పంపించారు. తాను టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూనే శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానని చెప్పుకున్నారు. అయితే ఆ రాజీనామా విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఎపి సిఎం, టిడిపి అధినేత చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ దాన్ని స్పీకర్ కు పంపాలని సూచించారు. అయితే రేవంత్ రాజీనామా చేశారా? లేదా అన్నది తేల్చడం కష్టమే. రేవంత్ రాజీనామా చేయకుండా డ్రామాలు చేస్తున్నారంటూ అధికార టిఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు కూడా. కానీ టిడిపికి గుడ్ బై చెప్పిన తర్వాత తాను మాజీ ఎమ్మెల్యేగానే రేవంత్ వ్యవహరిస్తున్నారు. కొడంగల్ లో మాత్రం అధికారిక కార్యక్రమాల్లో మంత్రుల కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లో మాజీ గా నడుచుకుంటున్నారు. మొన్నటికి మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా రేవంత్ ఓటు వేయలేదు. ఎందుకంటే తాను రాజీనామా చేశాను కాబట్టి ఓటు వేయను అని చెప్పుకున్నారు. అంతేకాదు రాజీనామా చేసిన తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్తున్నా కూడా హౌస్ లోకి వెళ్లడంలేదు.
ఇదంతా ఒక విషయమైతే రేవంత్ మాత్రం గన్ మెన్లను వాపస్ పంపించివేశారు. తిరిగి తనకు గన్ మెన్లు కేటాయించాలని ఏనాడూ అడగలేదు. మరి సమకాలీన రాజకీయాల్లో మాజీ మంత్రిగా పనిచేసి అనేకసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే గన్ మెన్ల కోసం ఎందుకు ఆరాటపడుతున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. తెలంగాణలో మాస్ ఇమేజ్ ఉన్న నాయకుల్లో కోమటిరెడ్డి టాప్ లో ఉంటారు. మరి అలాంటి నాయకుడు సెక్యూరిటీ కోసం ఎందుకు పదే పదే సర్కారుపై వత్తిడి చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరు సంపాదించుకున్న మరో నేత సంపత్ కుమార్ కూడా సెక్యూరిటీ కోసం సర్కారుపై వత్తిడి తీసుకురావడం చర్చనీయాంశమైంది. వీరిద్దరూ టిఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం కంటే సెక్యూరిటీ కోసం, గన్ మెన్ల కోసం ఎక్కువ దృష్టి పెట్టారన్న అనుమానాలు కలుగుతున్నాయని ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఒక సీనియర్ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి గన్ మెన్లను వ్యూహాత్మకంగానే వాపస్ పంపించారన్న చర్చ ఉంది. అదేమంటే? గన్ మెన్లు అనేవాళ్లు తమ రక్షణ కంటే ఎక్కువగా సర్కారుకు వేగులుగా పనిచేస్తారన్న ఉద్దేశం రేవంత్ కు ఉందని చెబుతున్నారు. చిన్న కదలికను కూడా ఇంటెలిజెన్స్ కు గన్ మెన్లు అందజేస్తారని, తద్వారా తమ కదలికలను సర్కారు పసిగడుతుందన్నది రేవంత్ అభిప్రాయం గా చెబుతున్నారు. అందుకోసమే రేవంత్ గన్ మెన్లు వాపస్ పంపించి ఉంటారన్న చర్చ కూడా ఉంది.
మొత్తానికి రేవంత్ గన్ మెన్లను వాపస్ పంపిస్తే కోమటిరెడ్డి, సంపత్ గన్ మెన్లను కేటాయించాలంటూ డిజిపికి వినతిపత్రం ఇవ్వడం మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చను లేవనెత్తిందని చెబుతున్నారు.