2019 ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. పార్టీలన్నీ ప్రణాళికలు రూపొందించుకుని ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పార్టీల మధ్య మాటల యుద్దం కూడా తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటినుంచే ఒకరిపై ఒకరు విమర్శలు,ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఎన్నికల వేడిని ఇప్పుడే పుట్టిస్తున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ అభివృద్ది కార్యక్రమాలతోపాటు బిజెపి వైఫల్యాలు, ఎపికి చేసిన అన్యాయాలను ఎండగడుతూ ఎన్నికలకు సర్వసన్నద్దమవుతుండగా, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ముందే మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్న కార్యక్రమాలను వైఎస్ జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
మరోవైపు గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి తరపున ప్రచారం చేసి విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన జనసేనాని ఎన్నికల వ్యూహకర్తగా వాసు దేవ్‌ని నియమించుకున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్‌పై టీడీపీ విమర్శల దాడి మొదలుపెట్టింది. పవన్ కల్యాణ్ వెనుక బీజేపీ ఉందని,వాళ్ల ఆదేశాల ప్రకారమే తమపై విమర్శలు చేస్తున్నారనే విషయాన్ని అధికార పార్టీ ప్రస్తావిస్తుంది. అందుకే పవన్ కల్యాణ్ దీక్షల పేరుతో నాటకాలు ఆడుతున్నారంటోంది టీడీపీ.
కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పవన్ కల్యాణ్ . అదే విధంగా చంద్రబాబు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో రిసార్ట్ లో నిన్న సాయంత్రం నిరాహార దిక్షకు దిగారు జనసేనాని. నిన్న సాయంత్రం 5 గంటలకు మొదలైన ఆయన నిరాహర దీక్ష ఈ రోజు సాయంత్రం వరకు జరగనుంది. అయితే పవన్ దీక్షపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. పవన్ వెనుక బీజేపీ డైరెక్షన్ ఉందంటున్నారు. బీజేపీ ఆదేశాలను పవన్ పాటిస్తున్నారని, ఆ మేరకే తమపై విమర్శలు చేస్తూ దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటున్నారు అధికార పార్టీ నేతలు. మరి నిజంగా పవన్ వెనుక బీజేపీ ఉందా అనే అనుమానం ఏపీ రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతుంది.
కానీ తన వెనుక బీజేపీ లేదని, ఎవరి కిందో తాను పనిచేయాల్సిన అవసరం లేదని కొద్ది రోజుల క్రితం జరిగిన బహిరంగ సభలో పవన్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా పవన్ వెనుక నిజంగానే బిజెపి డైరెక్షన్ ఉంటే బిజెపికి బద్ధ శత్రువులైన వామపక్షాలు ఎందుకు పవన్ దీక్షకు మద్దతిస్తాయని పవన్ అభిమానులు, జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. బిజెపి గుట్టును ఆమాత్రం వామపక్షాలు పసిగట్టలేవా అని వారు ప్రశ్నలు సంధిస్తున్నారు. అధికార టిడిపి పవన్ దీక్షకు క్రెడిబులిటీ లేకుండా చేసేందుకే ఇలాంటి విమర్శలకు దిగుతోందన్న చర్చ కూడా ఉంది.