రాజమండ్రి మినీ మహానాడులో తాను తిరుపతి ఏడుకొండలవాడి గురించి మాట్లాడుతూ వెంకన్న చౌదరి అని నోరుజారానని దానికి క్షమాపణలు కోరుతున్నానని రాజమండ్రి టిడిపి ఎంపి మాగంటి మురళీమోహన్ అన్నారు.
ఈ మధ్య నాటి రాజులను, దేవలతను కూడా కొన్ని కులాల వాళ్ల సొంతం చేసుకుంటున్నారు. ఈ ఒరవడిలో మురళీ మోహన్, ప్రస్తుతం చెలరేగుతున్న టిటిడి స్కామ్ ల వివాదం మధ్య వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి అని పిలిచారు. అయితే, ఇది నోరు జారడం తప్ప దురుద్దేశంతో పిలిచింది కాదని అన్నారు. ఆయన వివరణ ఇది.
అప్పటివరకూ వేదికపై బుచ్చయ్య చౌదరితో మాట్లాడుతున్న తాను, వెంటనే ప్రసంగానికి పిలవడంతో సభలో మాట్లాడుతూ వెంకన్న చౌదరి అనడం జరిగిందే తప్ప ఉద్దేశ పూర్వకంగా వచ్చింది కాదని ఆవేదన చెందారు.
ఏడుకొండల వాడంటే తనకు ఎంతో భక్తిప్రపత్తులు ఉన్నాయంటూ నోరుజారి అన్నమాటకు సోషల్ మీడియాలో,ఇతర ఛానళ్లలో దుష్ప్రచారం చేయడం పట్ల వాపోయారు.స్వాామివారితో పాటుగా భక్తులు అందరికీ క్షమాపణలు చెబుతున్నానంటూ తనకు అన్నికులాలు సమానమేనని,కుల దురభిమానం లేదని తెలిపారు.ఏడుకొండలవాడికి కులం ఆపాదించే తెలివితక్కువ వాడిని కానంటూ,పొరపాటున వచ్చిన మాటకు పెద్దమనసుతో క్షమించాలని కోరారు.ఈరోజు ఉదయమే ఏడుకొండలవాడి పూజ సందర్భంగా దీనిపై స్వామివారిని మన్నింపు వేడుకొన్నట్లుగా పేర్కొన్నారు.