ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్, జనసేన బీజేపీ నేతృత్వంలో నడుస్తుంది అంటున్నారు.అసలు అమిత్ షా కి ఎదురెళ్ళింది పవన్ కళ్యాణా మీరా?? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది ఒక సామాన్యుడైన పవన్ కళ్యాణా మీరా… ఇది పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి చంద్రబాబు నాయుడి మీద ప్రయోగించిన ప్రశ్నాస్త్రం.
కర్నాకట ఎన్నికల తర్వాత పవన్ లో కొంత మార్పు వచ్చినట్లు కనపడుతూ ఉంది. అదే విధంగా ప్రజల్లో కూడా ఆయన మీద ఉన్న పాత అభిప్రాయం మారినట్లు అది పాజిటివ్ గా తయారయినట్లు ఉత్తరాంధ్రలో ఆయన సభలకు వస్తున్న జనం చూస్తే అర్థమవుతుంది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ , బిజెపి కాకుండా, మూడోశక్తి గా ఉన్న జనతా దళ్ (ఎస్) ఏకంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే పరిస్థితి వచ్చింది.ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటవుతూ ఉంది. దీనివల్ల పవన్ 2019 ఎన్నికల తర్వాత తన పాత్ర కీలకం కాబోతున్నది, అందువల్ల సినిమాటిక్ గా కాకుండా రాజకీయనాయకుడిగా మారాలని నిర్ణయించుకున్నారా? అదే 2019 ఎన్నికల్లో పవన్ రోల్ కీలకంగా ఉంటుందని కర్నాటక తర్వాత ప్రజలుభావించిన ఆయన వైపు చూస్తున్నారా? ఉత్తరాంధ్ర యాత్ర మొదలుపెట్టేదాకా ఆయన్నిచాలా మంది సీరియస్ గా తీసుకోలేదు. అయితే, పలాసా వంటి ప్రాంతాలలో జనం వచ్చిన తీరు చూస్తే పవన్ పవర్ ఫుల్ అవుతున్నాడనిపిస్తుంది. బాగా పాతుకు పోయిన రాజకీయ పార్టీ కాదు జనసేన. తెలుగుదేశం, వైసిపిలకు జనాన్ని సమీకిరించేందుకు కావలసిన యంత్రాంగం ఉంది. జనసేన కు పార్టీ యంత్రాంగమే లేదు. తరలించే శక్తి యుక్తులు ఉన్నాయనుకోలేం. (ఉన్నాయంటే, ఆ రెండు పార్టీలకు సమాన ప్రత్యర్థిఅనుకోవాలి.) ఇలాంటి శైశవ పార్టీ ప్రజలను ఇంత పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నదా? ఆలోచించాల్సిందే. పవన్ టిడిపి, వైసిపి లకు తత్తర పుట్టిస్తాడా?
అధికార టిడిపినే కాదు, ప్రతిపక్ష పార్టీ మీద కూడా ఆయన నిప్పులు చెరుగుతున్నారు. అంటే, మూడో శక్తిగా ఎదిగి ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయించుకోవడంలో టిడిపి విఫలమయితే, అధికార పార్టీని అప్రమత్తం చేయడంలో ప్రతిపక్ష వైసిపి కూడా విఫలమయిందని ఆయన చెబుతున్నారు. ఈ రెండు పార్టీలను దుయ్యబట్టి ఆయన తటస్థులను సమీకరించే వ్యవూం పన్నినట్లు అర్థమవుతున్నది.