కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు ఈనెల 6వతేదీ.. బుధవారం. అయితే సాంప్రదాయం ప్రకారం ఎంపిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ సిఎం కేసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఉత్తరం రాస్తుంటారు.
సిఎం అయినప్పటి నుంచీ ఈ సాంప్రదాయాన్ని కేసిఆర్ పాటిస్తూ ఉన్నారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఇద్దరి పుట్టినరోజు ఒకేరోజు కావడంతో వారిద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉత్తరం రాయడంతోపాటు ఇద్దరికీ బొకేలు పంపించారు.
అంతేకాదు టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి, ప్రతి సందర్భంలో తెలంగాణ సర్కారుపై తీవ్రమైన పద్ధతుల్లో విమర్శల వర్షం కురిపిస్తున్న రేవంత్ రెడ్డికి సైతం సిఎం కేసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉత్తరం పంపించారు.
ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేసిఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో దానిపై కోమటిరెడ్డి స్పందించారు. తనను ఎమ్మెల్యేగా గుర్తించి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. అదే చేత్తో తనను ఎమ్మెల్యేగా గుర్తిస్తే ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు కూడా కల్పించవచ్చు కదా అని కోమటిరెడ్డి తనదైన శైలిలో చురక వేశారు.
ఎమ్మెల్యేగా గుర్తించి శుభాకాంక్షలు చెప్పినట్లే.. మిగతా ప్రొటోకాల్ అంశాలను ఎందుకు పట్టించుకోవడంలేదని చురకలు అంటించారు.