మల్లన్న సాగర్ బాధితులకు టిఆర్ఎస్ సర్కారు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నదా? మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు భూములివ్వకుండా పోరుబాట సాగిస్తున్న రైతులపై మరోరకంగా టిఆర్ఎస్ సర్కారు పగ తీర్చుకుంటున్నదా? అసలు మల్లన్న సాగర్ బాధిత గ్రామంలో ఏం జరుగుతున్నది. బాధితులకు సర్కారు కొత్త దెబ్బ ఏంటి? వివరాల కోసం చదవండి స్టోరీ.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు కు భూములు ఇవ్వకుండా వేములఘాట్ అనే గ్రామంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. 123 జిఓ ప్రకారం కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం కింద అయితేనే భూములిస్తామని ఈ గ్రామ రైతులు ఇంకా పోరుబాట సాగిస్తున్నారు. వారి ఆందోళనలు గత 700 రోజులుగా కొనసాగుతున్నాయి. రైతులు నిరాహారదీక్షకు కూర్చున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఎలాగైనా మల్లన్న సాగర్ రైతుల మీద కక్ష తీర్చుకునేందుకు మరో ఎత్తుగడ వేసింది. ఇప్పటికే ఆ ఎత్తుగడ కూడా అమలు చేసింది. అదేమంటే? తెలంగాణ అంతటా పండగ వాతావరణంలో చెక్కుల పంపిణీ చేపట్టింది టిఆర్ఎస్ సర్కారు. యావత్ ప్రభుత్వ యంత్రాంగమంతా చెక్కుల పంపిణీ పనిలోనే నిమగ్నమైంది. ప్రజా ప్రతినిధులు కూడా అదే పనిలో ఉన్నారు. కానీ మల్లన్న సాగర్ బాధిత గ్రామాల్లో మాత్రం చెక్కుల పంపిణీ నిలిపివేసింది తెలంగాణ సర్కారు. తమకు చెక్కులు ఎందుకు ఇస్తలేరని గ్రామస్తులు అడిగినా స్పందించడంలేదు. భూములివ్వకుండా ఆందోళన చేస్తున్న కారణంగానే చెక్కుల పంపిణీ నిలిపివేసినట్లు అధికారుల నుంచి సమాచారం అందుతున్నది. దీంతో బంగారు తెలంగాణలో మాకు స్థానం లేదా అని రైతులు నిట్టూరుస్తున్నారు.
సిద్ధిపేట జిల్లాలోని తొటు మండలంలో కొమరవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టును తెలంగాణ సర్కారు 51 టిఎంసిలతో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దీనికి 14 గ్రామాల్లో సుమారు 11వేల ఎకరాల భూమిని సర్కారు సేకరించింది. ఇక మిగిలింది కేవలం వేములఘాట్ గ్రామం మాత్రమే. ఇక్కడి రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారమైతేనే భూములిస్తామని తెగేసి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 123 జిఓ ప్రకారం భూములిచ్చేందుకు ససేమిరా అంటున్నారు. వేములఘాట్ రైతులు తీవ్రమైన పోరాటమే చేస్తున్నారు. వీరు 715 రోజులుగా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. దీక్షలు, ధర్నాలతో సర్కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఏకంగా మంత్రి, ముఖ్యమంత్రి కోరినా వాళ్లు ససేమిరా అన్నారు. సామ దాన భేద దండోపాయాలు చేసినా రైతులు లొంగలేదు.
ఈ నేపథ్యంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో కేవలం ఒక్క వేములఘాట్ రైతులు మాత్రమే సర్కారుకు ఎదురుతిరగడంతో తాజాగా మరో ఆయుధం వారిపై సర్కారు ప్రయోగించింది. ఈ గ్రామ పరిధిలో 3510 ఎకరాల భూమి ఉంది. అయితే ప్రాజెక్టు కోసం ఈ గ్రామంలో 995 ఎకరాల భూమిని సేకరించాలని సర్కారు నిర్ణయించింది. ఈ గ్రామంలో 400 మందికి పైగా రైతులు సొంత పట్టా పాసు పుస్తకాలు కలిగి ఉన్నారు. వారందరూ ఏకతాటిపై ఉండడంతో సర్కారు వారిని ఏమీ చేయలేకపోతున్నది.
అందుకే ఏలాగైనా వారిని దారిలోకి తెచ్చుకునేందుకే వారికి రైతు బంధు పథకాన్ని అమలు చేయరాదని సర్కారు నిర్ణయించిందని రైతులు చెబుతున్నారు. తక్షణమే ప్రభుత్వం పగ సాధించకుండా తమకు సైతం రైతుబంధు చెక్కులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే దీనిపై కోర్టు మెట్లెక్కేందుకు మల్లన్న బాధితులు సిద్ధమవుతున్నారు. రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నామంటూ దేశమంతా కోట్లకు కోట్లు వెదజల్లి పత్రికా ప్రకటనలు జారీ చేస్తున్న సర్కారు మల్లన్న సాగర్ రైతుల మీద మాత్రం పగ సాధించుడేం బాగాలేదని రైతు సంఘాల నేతలు అంటున్నారు.
సర్కారు వాదన ఇది :
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు సేకరిస్తున్న నేపథ్యంలో కేవలం వేములఘాట్ గ్రామ ప్రజలు మాత్రమే నిరాకరిస్తున్నారు. వారికి రైతు బంధు చెక్కులు ఇస్తే వారు వ్యవసాయం చేయడానికి సర్కారే అనుమతించినట్లు అవుతుంది కదా? అని మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూసేకరణ అధికారి ఒకరు తెలిపారు. వారు వ్యవసాయం చేయడానికి వీలు లేదని సర్కారే చెబుతూ మరోవైపు.. ప్రభుత్వమే చెక్కులు ఇచ్చి వారిని ఎలా ప్రోత్సహిస్తారని ఆయన ప్రశ్నించారు. కానీ భూసేకరణ విషయంలో రైతులు ఇవాళ కాకపోయినా రేపైనా రైతులు ఒప్పుకోకపోతారా అని ఆయన అంటున్నారు.
మొత్తానికి ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనన్న చర్చ సాగుతోంది.