పండగ పూట తెలుగు ప్రజలు ఏం చేస్తరు. కొత్త బట్టలు కట్టుకుని దేవునికి పూజలు, పునస్కారాలు చేస్తరు. బొట్టు పెట్టుకుంటరు. రాజకీయ నేతల హడావిడి అయితే కాసింత ఎక్కువే ఉంటది. పండగ పూట పబ్లిసిటీ కోసం పొలిటికల్ లీడర్లు నానా హంగామా చేస్తరు. కానీ కోదండరాం ఆ హడావిడి ఏమాత్రం లేకుండానే పండగ ముగించారు. ఇంతకూ కోదండరాం ఏ పండగను హడావిడి లేకుండా జరిపారు.? ఎందుకు జరిపారు. వివరాలు చదవండి.
తెలంగాణ జన సమితి అనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరాం. జన సమితి సభ ఆవిర్భావ సభ హైదరాబాద్ లో జరిగింది. జనసమితి పార్టీ ఏర్పాటు విషయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అది తొలి పండగ. తర్వాత రెండో పండగ ఏమంటే? జన సమితి పార్టీ కార్యాలయాన్ని నాంపల్లిలో ఆరంభించారు. విద్యావేత్త చుక్కా రామయ్య చేతుల రిబ్బన్ కట్ చేసి జన సమితి పార్టీ ఆఫీసును ప్రారంభించారు. పార్టీ ఆఫీసు ఏర్పాటు అనేది కూడా తెలంగాణ జన సమితి పార్టీకి పండగ లాంటిదే. ఎందుకంటే అక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలన్నీ మొదలు కానున్నాయి. కోదండరాం జేఏసీ లో పని చేసిన రోజుల్లో సభలు, సమావేశాలు సొంత ఇంట్లో కూడా పెట్టుకున్నారు. కానీ ఇక రాజకీయ పార్టీ కాబట్టి ఇకనుంచి జన సమితి మంచి చెడులన్నీ నాంపల్లిలోని పార్టీ ఆఫీసునుంచే జరుగుతుంటాయి.
ఈ నేపథ్యంలో పండగ లాంటి కార్యక్రమం అయిన పార్టీ ఆఫీసు ఓపెనింగ్ రోజు కోదండరాం సాదాసీదాగా ఉన్నారు. కోదండరాం పూజలు, పునస్కారాలేవీ చేయలేదు. పార్టీలో ఇప్పటికే చేరిన వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, కోరం కనకయ్య, విద్యారణ్య రెడ్డి లాంటి వాళ్లు ఆఫీసు ప్రారంభోత్సవం సంరద్భంగా జరిపిన పూజల్లో పంచెలు, పట్టు వస్త్రాలతో కూడిన హిందూ సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్నారు. వీరు సతీసమేతంగా ఆఫీసులో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ కోదండరాం మాత్రం సాధారణంగా రోజువారిలాగానే పార్టీ ఆఫీసు ఓపెనింగ్ కు హాజరయ్యారు. ఇక కోదండరాం సతీమణి కూడా పూజలు, ప్రార్థనలంటూ ఏమాత్రం హడావిడి చేయలేదు. ఆమె మధ్యాహ్నం తర్వాత పార్టీ ఆఫీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. అనంతరం క్రిస్టియన్ మత పెద్దలు పార్టీ ఆఫీసుకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ కార్యక్రమాల్లో కూడ కోదండరాం పాల్గొనకుండా దూరంగానే ఉన్నారు.
పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవంలో కోదండరాం ఎందుకిలా చేశారు? పార్టీ అధినేత అయి ఉండి కూడా కనీసం పూజా కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేదు? పార్టీ ఆఫీసులో ఒకపక్క పూజలు జరుగుతున్నా ఆయన ఎందుకు పూజ మీద కూసోలేదు? ఆయనకు దేవుడంటే భక్తి శ్రద్ధలు లేవా? దేవుడిపై కోదండరామయ్యకు నమ్మకం అసలే లేదా? కోదండరాం పాల్గొనకపోయినా కనీసం ఆయన సతీమణి అయినా పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు కదా? ఈ ప్రశ్నలు ఇప్పుడు జనాల మనసులో మెదులుతున్నాయి.
పార్టీ నేతలు చెబుతున్న వివరాల ప్రకారం కోదండరాం కు దేవుడు, విశ్వాసాల మీద పెద్దగా నమ్మకం లేదట. ఆయన దేవుడిని నమ్మరు. తల్లిదండ్రులు పెట్టిన పేరులో మాత్రమే దేవుడున్నాడు తప్ప ఆయన మనసులో మాత్రం దేవుడికి స్థానం లేదని చెబుతున్నారు. కంప్లీట్ నాస్తికుడుగా కోదండరాం ఇప్పటి వరకు వ్యవహరించారు. అందుకే రాజకీయ పార్టీ పెట్టినా పూజా కార్యక్రమాలకు ఆయన దూరంగానే ఉన్నారని అంటున్నారు. విద్యార్థి దశ నుంచే కోదండరాం లెఫ్ట్ భావజాలం కలిగి ఉన్నారు. విద్యార్థి సంఘంలో పనిచేసినా, తర్వాత ప్రొఫెసర్ గా అయిన తర్వాత కూడా లెఫ్ట పంథా మాత్రం వీడలేదు. అతే పంథాలో నడిచారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన ఎక్కడా పూజలు, పునస్కారాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ జెఎన్ యూలో చదివే రోజుల్లోనే ఆయన లెఫ్ట్ భావజాలంతో పనిచేశారు. అప్పటినుంచి అదే పంథాలో నడుస్తున్నారు. తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేసినా అదే వ్యవహారిక తీరుతో ఉన్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ వ్యవహారిక తీరుకు కోదండరాం వ్యవహారిక తీరుకు కంప్లీట్ వ్యతిరేకంగా ఉంటుందని చెబుతున్నారు. కేసిఆర్ కు వాస్తు, యాగాల పట్ల అపారమైన విశ్వాసాలు కలిగి ఉన్నారు. కోదండరాం వాటిని అస్సలు నమ్మరు. కేసిఆర్ లక్కీ నెంబరు ను నమ్ముతారు. ఏ పనిచేసినా లక్కీ నెంబరు ప్రకారం చేస్తారు. చండీయాగం లాంటి అనే యాగాలు చేశారు కేసిఆర్. కేసిఆర్ ఏదైనా శుభకార్యం మొదలుపెడితే మొదట ఆయన చేతికి దట్టీ కట్టాల్సిందే. దట్టీ కట్టించుకున్న తర్వాతే ఆయన సభలు, సమావేశాల లాంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ కోదండరాం మాత్రం ఇప్పటి వరకు వాస్తు గురించి కానీ, విశ్వాసాల మీద కానీ ఏమాత్రం నమ్మకం లేదని చెబుతారు. అందుకే పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం రోజున కనీసం పూజా కార్యక్రమంలో కూడా పాల్గొనకుండా పక్కన చుక్కా రామయ్యతో మాట్లాడుకుంటూ గడిపారు కోదండరాం.
అనంతరం పార్టీ ఆఫీసులో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురికి సభ్యత్వాలు అందజేశారు. మరి ప్రతి పనికి వాస్తు, సంఖ్యాశాస్త్రం ప్రకారమే నడుచుకునే కేసిఆర్ జీవితంలో సక్కెస్ అయ్యారు. తెలంగాణ సాధించారు.. సిఎం అయ్యారు. మరి ఆయనకు కంప్లీట్ వ్యతిరేక వైఖరితో ఉన్న కోదండరాం తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోశించారు అంతవరకు అక్కడ సక్సెస్ అయ్యారు. వాస్తు లాంటి విశ్వాసాలకు దూరంగా ఉన్న కోందండరాం మరి జన సమితి పార్టీని అధికారంలోకి తీసుకురాగలరా? ఆయన సిఎం కాగలడా? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.
వ్యక్తిగతంగా నేను దూరం : కోదండరాం
తాను ముందునుంచీ వ్యక్తిగతంగా పూజలు, ప్రార్థనలకు దూరంగా ఉన్నట్లు కోదండరాం చెప్పారు. పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవంలో అన్ని రకాల పూజలు, ప్రార్థనలు జరిగాయన్నారు. కానీ తన వరకు తాను వ్యక్తిగతంగా వాటిలో పాల్గొనలేదని తెలిపారు.