కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు టెన్షన్ మొదలయింది. బిజెపి బలప్రదర్శనకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాల్సిందే ననింది.
సమయం కావాలన్న అటార్నీ జనరల్(ఎజి) విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
దీనితో ఉత్కంఠ రెకెత్తించిన కర్ణాటక రాజకీయ నాటకానికి రేపటితో తెరపడనుంది.
ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్-జేడీఎస్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది.
ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలంటే రేపే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భద్రతా కారణాల రీత్యా ఎమ్మెల్యేలు హాజరుకాని పక్షంలో డీజీపీకి తాము ఆదేశాలిస్తామని పేర్కొంది. శాసనసభలో ఎవరు బలాన్ని నిరూపించుకుంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్‌పై ఈ ఉదయం 10.30గంటలకు విచారణ ప్రారంభమయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ యడ్యూరప్ప గవర్నర్‌ను కోరిన లేఖలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో భాజపా తరఫున వాదిస్తున్న ముకుల్ రోహత్గి ఆ లేఖలను కోర్టుకు అందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ తమకు ఉందని, బలపరీక్షలో దీన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రోహత్గి తెలిపారు. కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేల నుంచి తమకు మద్దతు వస్తుందని, ఇంతకంటే ఏం చెప్పలేమన్నారు.
గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం తేలాలంటే రేపే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. కోర్టు నిర్ణయానికి కాంగ్రెస్-జేడీఎస్ సైతం అంగీకరించాయి. ‘ గవర్నర్ ఎవర్ని పిలిచారు అన్నదాన్ని పక్కనబెడితే బలపరీక్షే దీనికి పరిష్కారం. శాసనసభలోనే బలాబలాలు తేలాలి. బలపరీక్ష రేపే నిర్వహించాలి’ అని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ సందర్భంగా ఏజీ రోహత్గి బలపరీక్ష తమకు కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు.
అయితే ఇందుకు కోర్టు నిరాకరించింది. తాము ఎవరికీ సమయం ఇవ్వాలనుకోవడం లేదని… ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారమే బలపరీక్ష నిర్వహించాలని తేల్చిచెప్పింది.