(సందిళ్ల శ్రీకాంత్ రెడ్డి*)
అవును నిజం రేవంత్ రెడ్డి కి పదవి రాకుండా ఆ నలుగురే అడ్డుకుంటున్నారట. ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయాలు తెలసిన ఎవరైనా ఇదే ముచ్చట చెబుతున్నారు. మరి ఆ నలుగురు కాంగ్రెస్ పార్టీ వారు అని అనుకుంటున్నారా? కాదు వారిలో ఒక్కరు మాత్రమే కాంగ్రెస్. మిగతా ముగ్గురు టిఆర్ఎస్ ఒరలో ఉన్నవారు. వారికి రేవంత్ పదవిని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్లకేం లాభం అనుకుంటున్నారా? చదవండి ఈ ఆర్టికల్.
టీడీపీ లో మంచి గుర్తింపును, గౌరవాన్ని వదులుకొని కేవలం కేసీఆర్ ను గద్దె దింపాలన్న ఏకైక లక్ష్యం తో కాంగ్రెస్ లో చేరారు రేవంత్ రెడ్డి. కానీ ఆయన కాంగ్రెస్ లో చేరిన నాటినుంచి నేటి వరకు అడుగడుగునా అడ్డుపుల్లలే వేస్తున్నారు. రేవంత్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆ పార్టీ ఓటు బ్యాంకు 5 నుంచి 10శాతం పెరిగిందని ఇంటలిజెన్స్ నివేదికలు చెబుతున్నమాట. రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ లో గుర్తింపు ఇచ్చి ప్రజల్లో కి పంపిస్తే 2019 లో కాంగ్రెస్ కు అధికారం ఖాయం అని కూడా నివేదికలు ఇచ్చారు. ఇలాంటప్పుడు ఏ పార్టీ అయిన ఏం చేస్తుంది కలిసి వచ్చిన అవకాశాన్ని వాడుకొని గద్దెనెక్కాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ కాంగ్రెస్ లో దానికి విరుద్ధంగా జరుగుతుంది. అసలు కారణం ఆ నలుగురే. ఆ నలుగురు ఎవరో కాదు తెలంగాణ సిఎం కేసిఆర్, వ్యాపారవేత్త మై హోం రమేశ్వర్ రావు, యశోద హాస్పిటల్ యజమాని సురేందర్ రావు లు. వీళ్లు ముగ్గురు టిఆర్ఎస్ శిబరిం నుంచి అడ్డుపుల్లలు వేస్తున్నారు. వీళ్లు టిఆర్ఎస్ కదా కాంగ్రెస్ లో రేవంత్ కు పదవి రాకుండా ఎలా అడ్డుకుంటున్నారు అనే అనుమానం రావొచ్చు కదా? ఇక్కడే ఎంటర్ ది డ్రాగన్ అన్నట్లు ఆత్మ సీన్ లోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆత్మ అంటే ఎవరో తెలియని వారుండరు. ఆ ఆత్మే కేవీపీ రామచంద్రరావు.ఇది రేవంత్ అభిమానుల్లో బాగా చర్చనీయాంశమయిన సబ్జక్టు.
ఇది నిజమే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో కేసీఆర్ కు పూర్తి స్పష్టత ఉంది. అందుకే అన్ని విధాలుగా ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కేసిఆర్. ఒక పక్క ముగిసి పోతున్న దశలో ఉన్న ఓటుకు నోటు కేసును ఉన్నఫలంగా తిరగదోడుతూ, మరో పక్క కేవీపీ తో ఢీల్లీలో చక్రం తిప్పుతున్నారు కేసిఆర్. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే కేసీఆర్ కుటుంబం, రామేశ్వర్ రావు, సురేందర్ రావు లు చేస్తున్న అక్రమాలకు ఊచలు లెక్కపెట్టడం ఖాయమని రేవంత్ వర్గీయులు అంటున్నారు. ఆ ప్రమాదాన్ని వీళ్ళు ముందే పసిగట్టారని అందుకే తమతో లావాదేవీలు ఉండి, కాంగ్రెస్ పెద్దలతో మంచి సంబంధాలున్న కేవీపీ ని రంగం లోకి దింపారని ఈ వర్గంలో బిగ్గరగా వినపడుతూ ఉంది. ఎలాగైనా రేవంత్ రెడ్డి కి పదవి రాకుండా శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని వారు అంటున్నారు.
పొలిటికల్ స్టార్ రేవంత్ రెడ్డి వచ్చాడు ఇక మాకు తిరుగులేదు అనుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఒక పక్క ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరోపక్క నాయకత్వం నిస్తేజం లో ఉంది. ఇంకా అధినాయకత్వం ఎందుకు రేవంత్ ను ఉపయోగించుకోవడం లేదు అని సామాన్య కార్యకర్తలు సైతం ఆలోచనలో పడ్డారు. ఇక కాంగ్రెస్ లో ఉన్న ఒకరిద్దరు పెద్ద సీనియర్లు సైతం రేవంత్ రెడ్డి తమకు ఎక్కడ అడ్డుపడుతాడో అని వీళ్లు కూడా ఆ నలుగురికే తెర వెనుక సహకరిస్తున్నారని చాలా మందిలో అనుమానాలున్నాయి.
రేవంత్ సన్నిహితులు చెబుతున్న మాట ఏమంటే ?
‘‘ఇప్పుడు కాంగ్రెస్ అధికారం లోకి వచ్చినా రేవంత్ రెడ్డి సీఎం కాలేడు. కాడు. ఆయన కంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు కదా? వాళ్ళకే అవకాశం ఉంటది. కానీ ఒకవేళ పార్టీ ఓడిపోతే మాత్రం పదవుల మీద ఆశతో ఉన్న సీనియర్లు మాత్రం ఇక తెరమరుగుకావాల్సిందే. ఎందుకంటే వారి వయస్సు అయిపోతుంది కాబట్టి. రేవంత్ రెడ్డి కి ఇంకా చాలా వయస్సు ఉంది.. 2024 లో తాను ముందు ఉంది పార్టీని నడిపించ వచ్చు. ఇప్పుడు గెలిస్తే సీనియర్లకు లాభం. అదే సమయంలో ఓడిపోతే వాళ్ళకే నష్టం. కానీ కేసీఆర్ నిరంకుశ పాలన ఇంకా 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు భరించలేరు. ఎవరు సీఎం అయినా పర్వాలేదు టిఆర్ఎస్ ను ఓడించాలన్నదే రేవత్ మెయన్ టార్గెట్.’’
‘‘మీలో ఎవరైనా సీఎం అవ్వండి నాకేమీ ప్రాబ్లమ్ లేదు. నాకు ఇప్పడు సీఎం అవ్వాలన్న కోరిక కూడా లేదు.. నాకు వయస్సు ఉంది కొట్లాడే ఓపిక ఉంది, కానీ ఇప్పుడు నన్ను ప్రజల్లోకి వెళ్ళనివ్వండి ప్రజాకంటక, కుటుంబ పాలన సాగిస్తున్న టిఆర్ఎస్ ను ఓడిద్దాం’’ అని రేవంత్ రెడ్డి కొందరు కాంగ్రెస్ పెద్ద సీనియర్లకు స్వయంగా చెప్పిన మాటలు.
అయినా కొందరు సీనియర్ నేతలు మాత్రం ఆ నలుగురి మాటలు విని రేవంత్ జనంలోకి వెళ్లకుండా ఆటంకం కల్గిస్తున్నారని రేవంత్ వర్గంలో అశాంతి మొదలయింది.
చేజేతులారా పార్టీని నిర్వీర్యం చేస్తూ టైమ్ పాస్ పనులు చేస్తున్నారట. టిఆర్ఎస్ ను ఓడించాలన్నా గెలిపించాలన్నా.. అది కాంగ్రెస్ చేతిలోనే ఉందని ఈమధ్య ఒక రాజకీయ విశ్లేషకుడు చెప్పారు. ఇప్పుడనిపిస్తున్నది కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఆ మాట 100 శాతం నిజమేనని.
(రచయిత : సందిళ్ల శ్రీకాంత్ రెడ్డి. జర్నలిస్టు, సెల్ నెం. 9640717123. ఈ అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం.)