(విజయ్ లక్ష్మణ్)
కర్నాటక ఎన్నికల్లో 104 స్థానాలు గెలచుకుని బిజెపి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన మాట నిజమే కాని, బిజెపి గెలవలేకపోయింది. ఎన్నికల్లో గెలవడమంటే, నేరు గాని, ముందే కుదుర్చుకున్న వప్పందం ప్రకారం ఇతర పార్టీలతో కలసి కాని ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థితిలో ఉండాలి. కాని బిజెపి అలాంటి తీర్పు రాలేదు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిన మాట నిజమే కాని, బిజెపి గెలిచిందా?
ఇపుడు ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు బిజెపి 8 ఓట్లు కావాలి. ఎలా వస్తాయి. కొనాలి. అంటే అర్థమేమిటి? కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎందుకు బిజెపి కి 112 సీట్లు ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ ను ప్రజలు ఓడించారు. కాని ప్రధాని మోదీ అంతటి వాడు వచ్చి రేయింబగలు ప్రచారం చేసి, కాంగ్రెస్ ను నానాతిట్టు తిట్టి, విమర్శలు చేసిన తన శక్తి నంతా కూడదీసుకుని అచరి గీపెట్టి చేసినా బిజెపికి 112 సీట్లు రాలేదు. కారణం. ఎవరు? ఫలితాలు చూస్తే తెలుగువాళ్లే అనాలనిపిస్తుంది. కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత బిజెపి అభిమానంగా మారకుండా తెలుగువాళ్లు అడ్డుకున్నారని తెలుగు వోట్లు భారీగా ఉన్న అనేక నియోజకవర్గాలలో బిజెపి చతికిల పడింది. అక్కడి ఓట్లు కాంగ్రెస్ కయినా పడ్డాయి లేదా జెడిఎస్ దండుకుంది ఆ వోట్లను. బిజెపిని మాత్రం తిరస్కరించారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ వ్యతిరేకత ఉందని స్పష్టమవుతున్నా, బిజెపికి లాభం చేకూరకపోవడంలోని రహస్యం… రహస్యం ఏమీ లేదు. తెలుగువాళ్ల కోపం స్పష్టంగా కనిపిస్తూ నే ఉంది. ఉదాహరణకు తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే బాగేపల్లి ప్రాంతంలో సినీనటుడు సాయికుమార్ నాలుగో స్థానంలో పడిపోయాడు. కాంగ్రెస్ గెలిచింది. తెలుగువారు ఎక్కువగా ఉండే కోలార్, చిక్కబళ్లా పూర్, బళ్లారి, రాయచూరు జిల్లాల్లో కాంగ్రెస్ బలంగా బయటపడింది. బళ్లారి పట్టణంలో గాలి బ్రదర్స్ దే హవా అయినా, బళ్లారి రూరల్, కంప్లిలలో కాంగ్రెస్ గెలిచ్చింది. వాళ్ల హవా బళ్లారి పట్టణానికే పరిమితమయిది. హైదరాబాద్-కర్నాటక రీజియన్ అంటే ఒకప్పటి నైజాం భూభాగంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలుంటే, కాంగ్రెస్ కు 21 స్థానాలొచ్చాయి. మొత్తంగా తెలుగువారు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు దాదాపు నలభై ఉంటే అందులో కాంగ్రెస్ కు 32, జెడిఎస్ కు 9, బిజెపికి అయిదు వచ్చాయి.
దీనికి కారణం, ఒక వైపు చంద్రబాబు నాయుడు మోదీని హోదా విషయంలో ‘మిత్ర ద్రోహి’ గాచిత్రీకరించి, బిజెపిని ఓడించాలని పిలుపునీయడం, మరొక వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జెడిఎస్ కు మద్దతునీయాలని తెలంగాణ తెలుగువారిని కోరడం. దీనితో బాగా పుంజుకోవలసిన బిజెపి చచ్చి చెడి 104 దగ్గిరే అగిపోయింది. తెలుగువాళ్లు అడ్డుకొనకపోతే, బిజెపి 111 దాటేది.
అయితే, ఆంధ్ర బిజెపి నాయకులు మాత్రం ఇది బిజెపి ఘనవిజయంగా చెప్పుకుంటున్నారు. కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చంద్రబాబు ను తీవ్రంగా విమర్శంచారు.‘భారతీయ జనతా పార్టీని ఓడించడానికి చంద్రబాబు చాలా కుయుక్తులు పన్నాడు. అయినా సరే, కన్నడ ప్రజలు, తెలుగువారు చంద్రబాబుకు బుద్ధిచెప్పారు,’ అని వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అన్నీ కష్టాలే. కర్నాకట కాంగ్రెస్ ఓటమి టిడిపి ఓటమిగా యే అని ఆయన అభివర్ణించారు.ఇక తెలంగాణ బిజెపి నాయకలు దత్తాత్రేయ, పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా రానున్నది బిజెపి ప్రభుత్వమే నని, కెసిఆర్ ఎత్తులు కర్నాటకలో పారలేదని అంటున్నారు. బిజెపి సొంతంగా ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నది, ఇపుడు క్యాంపు రాజకీయాలకు ఎందుక పూనుకోవలసి వచ్చింది … బిజెపి నాయకులు చెప్పగలరా?