ప్రయివేటు స్కూల్ బస్సులు గ్రామాల్లోకి వస్తే గాలి తీయండి అంటూ తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం వరంగల్ జిల్లాలో పిలుపునిచ్చారు. దానిపై పెద్ద దుమారం రేగింది. దీంతో తన మాటలపై కడియం వివరణ ఇచ్చారు. ” ప్రభుత్వానికి ప్రైవేట్ విద్య సంస్థల పట్ల ఏ రకమైన వ్యతిరేక భావం లేదు. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా వ్యాప్తికి, విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు పోటీ పడి పని చేస్తున్నాయి” అని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు.
” తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ప్రైవేట్ పాఠశాలల పట్ల ప్రభుత్వం కక్ష్య సాధింపు ధోరణితో వ్యవహరించడం లేదు. 12.05.2018 నాడు రామానుజాపురం గ్రామం, వెంకటాపురం మండలం, భూపాలపల్లి జిల్లాలో జరిగిన రైతు బంధు కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల పరిస్థితి చూసి, గ్రామ ప్రజలు ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి సమిష్టిగా కృషి చేయాలని అభ్యర్థిస్తూ ప్రైవేట్ పాఠశాలల బస్సులు గ్రామంలోకి వస్తే టైర్లలో గాలి తీయమనడం జరిగింది. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిన వ్యాఖ్య కాదు. ప్రైవేట్ పాఠశాలలపై వ్యతిరేకతతో చేసిన వ్యాఖ్య కాదు. ఈ వ్యాఖ్యల పట్ల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ పాఠశాలలు సమర్థవంతంగా నడపడానికి విద్యా శాఖ మంత్రిగా నా పూర్తి సహకారం ఇస్తానని తెలియజేస్తున్నాను” ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివి. ఈ రెండు వ్యవస్థలను కాపాడుకుంటూ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి విద్యా శాఖ మంత్రిగా నేను కృషి చేస్తున్నాను అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.