అవును. మీరు చదివింది నిజమే. తెలంగాణ ఉద్యమ నేత కోదండరాం బాధపడ్డారు. తెలంగాణ సాధన ఉద్యమంలో అరెస్టులు, కేసులు అయినా బాధపడలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో అర్థరాత్రి తలుపులు బద్ధలు కొట్టి అరెస్టు చేసినా బాధపడలేదు. అమరుల యాత్ర చేస్తానంటే యాత్ర లేదు గీత్ర లేదు అని సర్కారు కన్నెర్రజేసినా బాధపడలేదు. అరెస్టు చేసి గంటకో పోలీసు స్టేషన్ కు తిప్పినా బాధపడలేదు. తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్ తో భుజం కలిపి పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత అంటరానివాడిగా మారినా బాధపడలేదు. సహచర ఉద్యమ నేత కించపరిచేలా మాట్లాడినా బాధపడలేదు. గదరు మాటలతో హింసించినా బాధపడలేదు. మరి ఇప్పుడెందుకు బాధపడ్డారో తెలుసా? చదవండి స్టోరీ.
తెలంగాణ జెఎసి ఛైర్మన్ పదవికి ఇటీవల కోదండరాం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గన్ పార్కు వద్ద గల అమరుల స్థూపం వద్ద జెఎసి కన్వీనర్ రఘుకు అందజేశారు. తెల్లారే తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ జరిపారు. ఆ సభలో కోదండరాం ఆ పార్టీ అధినేతగా ఎన్నికయ్యారు. అయితే గన్ పార్కు వద్ద ఆయన చేసినా రాజీనామాకు ఆదివారం జరిగిన తెలంగాణ జెఎసి సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని జెఎసి నేత రఘు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ జెఎసి ఛైర్మన్ హోదాలో కోదండరాం మాట్లాడారు. ఆయనేమన్నారో చదవండి.
జెఎసిని వీడుతున్నoదుకు చాలా బాధ గా ఉంది.నేను జెఎసి చైర్మన్ పదవి కి రాజీనామా చేశాను. ఇప్పుడు ఆమోదం తెలిపారు. తెలంగాణ రావడంలో జెఎసి పాత్ర మరువలేనిది. జెఎసి కారణంగానే మేము ప్రపంచానికి పరిచయం అయ్యాము. 2009 నుండి ఇప్పటి వరకు నాకు సహకరించినందుకు మీకు కృతజ్ఞతలు. జెఎసి ని పోలిన సంస్థలు దేశంలో ఎక్కడా లేవు. ప్రజా ఉద్యమాలు, నిరంకుశ పాలన కు వ్యతిరేకంగా పోరాటం చేశాము. పాలనలో మార్పు కోసము మేము జన సమితి పార్టీ పెట్టవల్సిన అవసరం ఏర్పడినది.
జెఎసి చేసే పని కి మా వంతు కృషి మేము చేస్తాం. బలమైన ప్రజాస్వామిక నిర్మాణానికి జెఎసి కృషి చేస్తోంది. రాజకీయాలలో మార్పు కోసమే జెఎసి నుండి వైదొలుగుతున్నాను.