బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎంపికయ్యారు. ఈ మేరకు ఇవాళ కేంద్ర పార్టీ ఉత్తర్వులు వెలువరించింది. బిజెపి నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించారు. అలాగే ఎమ్మెల్సీ సాయి వీర్రాజును రాష్ట్ర ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ కన్వీనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
గత కొంతకాలంగా కన్నా లక్ష్మినారాయణ బిజెపిలో ఉంటూనే ఊగిసలాటలో ఉన్నారు. ఆయన వైసిపి తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. అయితే తర్వాత ఆయన అనారోగ్యం పాలైనట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆరోగ్యం బాగైన తర్వాత వైసిపిలో చేరతారని ప్రచారం సాగింది.
ఇదిలా ఉంటే ఆయన వైసిపిలో చేరేందుకు స్కెచ్ రెడీ చేసుకోగానే బిజెపి అధిష్టానం కొద్దిగా గట్టిగానే ఆయన మీద గరం అయినట్లు వార్తలొచ్చాయి. ఎవరు పార్టీలోకి రమ్మన్నారు? ఎవరు రమ్మంటే వచ్చారు? ఎవరు వెళ్లమంటే వెళ్తున్నారు అని పార్టీ అధిష్టానం క్లాస్ తీసుకున్నట్లు గుసగుసలు వినబడ్డాయి. అంతా మీ ఇష్టమేనా అని పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని లీక్ లు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆరోగ్యం బాగైన తర్వాత కూడా కన్నా లక్ష్మినారాయణ వైసిపి వైపు కన్నెత్తిచూడలేదు. దీంతో ఆయన ఇక బిజెపిలోనే సర్దుకుంటారన్న టాక్ నడిచింది. అంతిమంగా ఆయన బిజెపిలోనే స్థిరపడిపోయారు. పార్టీ కూడా ఆయన మీద పెద్ద బాధ్యతలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.
కులాల సమరంలో బిజెపి తెలివిగానే కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మినారాయణను అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టిందన్న చర్చ సాగుతోంది. ఇక ఈ పరిణామాలు చూస్తే ఆంధ్రాలో రెడ్డీలంతా జగన్ వైపు, కమ్మలంతా టిడిపి వైపు ఇప్పటికే సర్దుకునే పరిస్థితులున్నట్లు చెబుతున్నారు. మరి కాపులు ఇటు పవన్ వైపు వెళ్తారా? లెటెస్ట్ గా బిజెపి అధ్యక్ష పదవి ఇచ్చారు కాబట్టి బిజెపి వైపు వెళ్తారా అన్నది తేలాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ వైపే కాపుల చూపు ఉండొచ్చన్న ఊహాగానాలు వినబడుతున్నాయి.