“మన తీరం మన వాటా” బాగుంది, మరి ‘‘మన క్రిష్ణ మన రాయలసీమ’’ ఏమయింది?
తీరానికి సమీపంలో సముద్ర గర్బంలోంచి వెలికితీసే ఖనిజ నిక్షేపాల ఆదాయంలో సంబంధిత రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజాస్వామిక డిమాండును చేసినారు.
కేంద్రంతో రాజకీయంగా సంబంధాలు తెంచుకున్న తర్వాత రాష్ట్ర ప్రజల న్యాయమైన కోర్కెలను ప్రజల ముందు బాబు ఉంచుతున్నారు. ఏ ఉద్దేశంతో ప్రస్తావించినా ఈ అంశాలు సహేతుకమైనవే కనుక బాబు ప్రయత్నాలకు మద్దతు నివ్వాలి.
వివిద రాష్ట్రాల కలయికే ఒక దేశం. అదే విధగా వివిధ ప్రాంతాల కలయిక ఒక రాష్ట్రం. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్దితులను బట్టి ప్రకృతి సంపంద లభిస్తుంది. వివిద ప్రాంతాలలో లభించే సంపద దేశంలోని అన్ని ప్రాంతాలకు అవసరాలను బట్టి ఉపయోగిస్తారు. అయితే, ప్రాథమికంగా ఏ ప్రాంతంలో దొరికే సంపద ప్రయోజనాల తొలి లబ్దిదారు మాత్రం ఆ ప్రాంతానికి చెందిన వారు కావాలి.
సముద్రం దాని చుట్టూ లబించే ఆపార సంపద వెల కట్టలేనిది. ఆంద్రప్రదేశ్ లో సుదీర్గ సముద్ర తీరం ఉంది. అందులోంచి గ్యాస్, ఖనిజాలు, ముడి ఇందనం లాంటి అరుదైన సంపద లబిస్తుంది. కానీ వాటి ద్వారా లభించే ప్రయోజనాల ఫలం మాత్రం రాష్ట్రాలకు ( ప్రజలకు) అందడం లేదు. గోదావరి గ్యాస్ గాని ప్రభుత్వ సంస్ద ఓ యన్ జీ సీ సారధ్యంలో వెలికి తీసి వారి పరిధిలోనే నిర్వహించి ఉంటే నేడు రాష్ట్ర ప్రజలకు 100 రూపాయిలకే గ్యాస్ లభించి ఉండేది. అలాంటిది పాలకుల నిర్వాకం కారణంగా దాని ప్రయోజనాలు రిలయన్స్ పరం అయినాయి. ఆ తర్వాతనే ఆ సంస్ద విపరీత లాభాలను పొందినది. కారణం ఏమైనా సముద్రంలో లభించే ఖనిజాల ఆదాయంలో రాష్ట్రం వాటా ఇవ్వాలని కేంద్రాన్ని బాబు డిమాండు చేయడం సముచితం.
అదే సూత్రం రాయలసీమకు ఎందుకు వర్తించదు?
ప్రకృతి సహజ సంపద జాతి ప్రయోజనాలకు ఉపయోగించాలి కాని తొలి ప్రయోజనం మాత్రం ఆ ప్రాంత ప్రజలకు అందాలి. ఆ సూత్రాన్ని రాయలసీమకు కూడా ఉపయోగించాలి. క్రిష్ణానది మహరాష్ట్రలో పుట్టి కర్నాటకలో ప్రవహించి తెలంగాణ, రాయలసీమ తర్వాత చివరగా హంసలదీవి ( సముద్రంలో కలిసే ప్రాంతం) కి ముందు విజయవాడ దగ్గర ప్రవహిస్తుంది. ఏ సహజ న్యాయ సూత్రాన్ని అమలు చేసినా ఏపీ వాటాగా రాష్ట్రానికి లభించే క్రిష్ణానది నీటిలో తొలి లబ్దిదారులు రాయలసీమ ప్రజలు కావాలి. కానీ ఆచరణలో అందుకు బిన్నంగా 11 వందల టీ యం సీలు సీమ గుండా ప్రవహిస్తున్నా సీమకు త్రాగునీరు కూడా అందివ్వకుండా సింహ బాగం నదికి చివరన ఉండే క్రిష్ణా డెల్టాకు ఇస్తున్నారు. ఇంత వరకు నిర్మించిన నాగార్జున సాగర్, పులిచింతల చివరకు రాయలసీమలో నిర్మించిన శ్రీశైలం కూడా క్రిష్ణా డెల్టా ప్రయోజనాల కోసం ఉద్దేశించారు. కేంద్రాన్ని గట్టిగా సహజ న్యాయం చేయమని నిలదీస్తున్న ముఖ్యమంత్రి అదే సహజన్యాయం రాయలసీమ విషయంలో పాటించాలి. ఇది తన చేతిలో ఉన్నా అమలు చేయడం లేదు, ఎందుకు?
రాయలసీమలో మాత్రమే లభించే ఎర్ర చెందనం ద్వారా వచ్చే ఆదాయం వెనుకబడిన రాయలసీమ కష్టాలను తీర్చడానికి వెచ్చించరెందుకు ? కడపలో లభించే అరుదైన ఖనిజ సంపదను వెలికి తీసే పరిశోధనా కేంద్రం కడపలో స్దాపించరెందుకు? దానికి అనుబందంగా విభజన చట్టం ప్రకారం రావాల్సిన కడప ఉక్కు పరిశ్రమ డిమాండును పక్కన పెట్టి హోదానే నెత్తికెత్తుకున్నారు- కారణం చెప్పగలరా?
నంద్యాలలో ఏర్పాటు చేయాల్సిన వ్యవసాయ విశ్వవిద్యాలం అక్కడ కాకుండా గుంటూరు జిల్లాలో స్దాపించడంలో ఉద్దేశం ఏమిటి? అన్ని విధాల అర్హత ఉన్న గుంతకల్లు రైల్వేజోన్ ను పరిసీలించడానికి కూడా ఇష్టం లేకుండా చట్టానికి బిన్నమైన డిమాండు(విశాఖ రైల్వేజోన్) ఏ సహజ సూత్రాలకు లోబడి చేస్తున్నారు ?
చివరికి రాయలసీమకే తలమానికం అయిన టీ టీ డీ నిదులను కూడా రాయలసీమకు ఉపయోగించకుండా పుష్కరాలలో విజవాడ, రాజమండ్రి ప్రాంతంలో ఎందుకు ఖర్చు చేసినట్లు?
బాబు గారూ, రాయలసీమ ప్రజలకు సమాధానం చెప్పాలి.
-యం. పురుషోత్తం రెడ్డి
రాయలసీమ మేధావుల పోరం
9490493436.