తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన మాటలపై సొంత పార్టీలో సీనియర్లు మండిపడుతున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి రేవంత్ తీరును ఎండగట్టారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకాలంలో ఎక్కడున్నాడని ప్రశ్నించారు. సమైక్యవాది చంద్రబాబు దగ్గర ఉన్న వ్యక్తి రేవంత్ అన్నారు. నిన్నమొన్న పార్టీలోకి వచ్చి అప్పుడే సిఎం అయిపోతానని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక మరో సీనియర్ నేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ తీరును ఎండగట్టారు.
రేవంత్ వ్యాఖ్యలపై అమెరికా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో స్పందించారు. రేవంత్ మాటలను ఖండించారు. గాంధీభవన్ లో దీక్ష చేయాలని రేవంత్ రెడ్డి సూచించినట్లు చెప్పుకోవడంలో నిజం లేదన్నారు. తమ సభ్యత్వాలు రద్దయిన తర్వాత తాను, సంపత్ కుమార్ ఇద్దరం కలిసే దీక్ష చేయాలని ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తమ దీక్షకు రేవంత్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను అవమానించేలా రేవంత్ మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ ను బంగారం చేస్తానని రేవంత్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ బంగారం చేసేదేమైనా ఉంటే టిడిపి నే బంగారం చేస్తే సరిపోయేది కదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తక్షణమే తన కామెంట్స్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తాను ఎన్నో ఏళ్లుగా ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసి ఇంతటి స్థాయికి వచ్చానని గుర్తు చేశారు. తెలంగాణ సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిరవధిక నిరహారదీక్ష చేశానన్నారు. నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం దీక్షలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. జమానాలోనే దీక్షలు చేసిన చరిత్ర ఉన్న తనకు సభ్యత్వ రద్దు తర్వాత దీక్ష చేయాలని రేవంత్ సూచించినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.