వారు ముగ్గురు బంగారు దొంగలు. బంగారు తెలంగాణ కోసం టిఆర్ఎస్ పనిచేస్తుంటే వారు మాత్రం బంగారం కొట్టేయడం కోసం పనిచేశారు. తలా ఇంత బంగారం జేబులో వేసుకున్నారు. బంగారు వ్యాపారిని బెదిరించి అతడి వద్ద నుంచి మంచిగనే డబ్బులు, బంగారం గుంజిర్రు. ఈ ముచ్చట ఆనోటా, ఈనోటా తెలిసింది. జనాల్లో రచ్చ అయింది. ముందుగా పోలీసులు అధికార పార్టీ లీడర్లు కాబట్టి వాళ్లను సేఫ్ చేద్దామనుకున్నరు. కానీ జనాలకు ఎరుక కాంగానే పోలీసులు వారి వద్ద నుంచి బంగారం కక్కించిర్రు. వ్యాపారి దగ్గర నుంచి దోచిన డబ్బులు కూడా కక్కించిర్రు. ఇది బాగానే ఉంది కానీ అసలు ముచ్చట ఇక్కడ మొదలైంది. ఆ ముగ్గురు బంగారు దొంగలపై టిఆర్ఎస్ పార్టీ వేటు వేసింది. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వారితో టిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి, కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ తుల ఉమ ఈమేరకు పత్రికా ప్రకటన వెలువరించారు.
అసలు ముచ్చటేందో కింద చదవండి.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు పట్టణంలో బంగారం దోపిడీ కేసులో ముగ్గురు టిఆర్ఎస్ నేతలు ఇరుక్కుని కేసులపాలయ్యారు. వారు ముగ్గురు కూడా సాదా సీద లీడర్లు కాదు అందులో ఆర్మూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త కూడా ఒక నిందితుడుగా ఉన్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన భూపాల్ మున్నా అనే వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తూ ఆర్మూర్ లో నివసిస్తున్నాడు. అయితే అతడు ఇటీవల బంగారు ఆభరణాలు చేపించి ఇస్తానంటూ ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని సేకరించాడు. కానీ కొద్ది కాలం తర్వాత బంగారు ఆభరణాలు చేయించి ఇవ్వకుండా రాత్రికి రాత్రే జంప్ అయ్యిండు. దాదాపు 3 కిలోల బంగారాన్ని తీసుకుని భూపాల్ పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇంతవరకు బాగానే ఉంది కానీ.. అసలు కథ ఇక్కడే మొదలైంది. భూపాల్ బంగారంతో పారిపోతున్న సమయంలో ఆర్మూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త సంజయ్ సింగ్ బబ్లూ, జంబి హనుమాన్ ఆలయ కమిటీ ఛైర్మన్, టిఆర్ఎస్ నాయకుడు సుంకరి రంగన్న, ఆర్మూరు పట్టణంలోని 11వ వార్డు కౌన్సిలర్ భర్త పింజ వినోద్ లు భూపాల్ ను బెదిరించి అతడి వద్ద నుంచి కొంత బంగారం, కొంత నగదును కొట్టేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో విచారణ చేపట్టారు. దీంతో వారి వద్ద దొంగ బంగారం ఉన్నముచ్చట వాస్తవమేనని అంగీకరించారని పోలీసులు చెబుతున్నారు. భూపాల్ వద్ద తీసుకున్న దొంగ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నేతల నుంచి 617 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 11 వార్డు కౌన్సిలర్ భర్త పింజ వినోద్ నుంచి 104 గ్రాములు, సుంకరి రంగన్న నుంచి 208 గ్రాములు, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ భర్త నుంచి 305 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 23 న తేదీన బంగారు నగలు తయారుదారుడు బెంగాల్ కు చెందిన భూపాల్ అనే 3 కిలోల బంగారం తో పరారీ అయిన విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపడితే టిఆర్ఎస్ నేతలు కూడా ఇరుక్కుపోయారు. ముగ్గురు టిఆర్ఎస్ నేతల మీద ఆర్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి అధికార పార్టీ పెద్ద తలకాయలు ఇందులో నిందితులుగా ఉన్నారు కాబట్టి ప్రపంచం మెచ్చిన ఫెండ్లీ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతారా? లేక నయీం కేసులాగే నీరుగారుస్తారా అన్నది ఇప్పుడు తెలంగాణ జనాల్లో నడుస్తున్న హాట్ టాపిక్.
సస్పెన్షన్ పై అనుమానాలు
ముగ్గురు ఆర్మూరు టిఆర్ఎస్ లీడర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయంపై జనాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో సిరిసిల్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ సామల పావని అవినీతి గుట్టు రట్టు చేశారు. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, ఛైర్మన్లు ఎలా పర్సెంటేజీలు తీసుకుంటున్నారో ఆమె మీడియా ముందు పూసగుచ్చినట్లు చెప్పారు. మంత్రి కేటిఆర్ ఆదేశం మేరకే తాము పర్సెంజీలు తీసుకుంటున్నామని వివరించారు. దీంతో టిఆర్ఎస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఆమె వ్యాఖ్యలు తెలంగాణ అంతటా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయ్యాయి. దీంతో ఆమెను మున్సిపల్ చైర్ పర్సన్ పదవి నుంచి తప్పించారు. ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అంతవరకు బాగానే ఉన్నా.. నెల తిరగకముందే మల్లా ఆమెను తిరిగి ఛైర్ పర్సన్ కుర్చీలో కూర్చోబెట్టారు. దీనిపై పెద్ద వివాదమే రేగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్మూరు సస్పెన్షన్ కూడా సిరిసిల్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ సస్పెన్షన్ మాదిరిగానే ఉంటదా? లేక నిజమైన సస్పెన్షనేనా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.