తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు సమీక్ష పై స్పందించారు. సోమవారం సిఎం కేసిఆర్ ఓటుకు నోటు కేసుపై సమీక్ష జరిపిన నేపథ్యంలో ఆ కేసులో నిందితుడుగా ఉన్న రేవంత్ రెడ్డి మంగళవారం స్పందించారు. ఎసిబి కేసులు, వాటి లోగుట్టును, కేసిఆర్ ఫ్యామిలీ వ్యవహారాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. రేవంత్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సిఎం కేసిఆర్ మీద, ఆయన కుటుంబం మీద కీలకమైన ఆరోపణలు గుప్పించారు. ఆ వివరాలు రేవంత్ మాటల్లోనే చదవండి.
అవినీతి నిరోధక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా 7 గంటలు సమీక్ష నిర్వహించారు అని వార్తలు వస్తున్నాయి. లంచం ఎవరు అడిగినా ఫోన్ చేయండి అని వాటిపైన చర్య తీసుకుంటాం అన్నారు. ఇంకా ఆయన కొడుకు కేటీఆర్ ఒక అడుగు ముందుకేసి చెప్పుతో కొట్టండి లంచం అడిగితే అన్నాడు. తండ్రీకొడుకుల మాటలు ఇట్లా ఉంటే చేతలు ఎట్లున్నయో మీరు చూడండి. తెలంగాణ ప్రభుత్వంలో వేల కోట్ల లో జరుగుతున్న అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు యాత్ర ద్వారా చెబుతుంటే ప్రతి పక్ష నాయకుల పైన పాత కేసులను ముందుకు తెస్తున్నారు. మోడీ ఆదేశాలమేరకు కేసీఆర్ ఏసీబీ తో సమీక్ష చేసాడు.
తెలంగాణలో కేసిఆర్ ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం కోసమే నిర్ణయాలు జరుగుతున్నాయి తప్ప పేద ప్రజలకు ఎలాంటి మేలు జరిగేలా చర్యలు తీసుకోలేదు. మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జీర్ణించుకోలేక మోడీ ఆదేశాల మేరకు ఇక్కడ కేసిఆర్ ఆడుతున్నారు. మోడీ, కేడీ కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే ఎసిబి కేసులో ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. ఓటుకు నోటు కేసుపై పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో రాయించారు. కేసు జరిగిన రోజు కంటే ఎక్కువగా ఎక్కువగా నిన్న, మొన్న ప్రచారం కల్పించారు. అటు మోడీ , కేడీ కలిసి ఆడుతున్న నాటకంలో భాగమే నిన్నటి వ్యవహారం. నేను ఓటుకు నోటు కేసు వివరాలు మాట్లాడను. ఎందుకంటే కోర్టు కండీషన్ పెట్టింది.
అవినీతి నిరోదక శాఖ వ్యవహార శైలిని, దానికి సంబంధించి సిఎం గుట్టును వెల్లడించాల్సిన బాధ్యత నామీద ఉంది. 2016 సంత్సరంలో సరైన సమాచారం లేదని 125 కేసులు ఉపసంహరించింది తెలంగాణ సర్కారు. అవినీతి కేసులలో పట్టుబడిన అధికారులను ఆధారాలు లేవని 125 మంది మీద కేసులను ఉపసంహరించడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1లో ఉంది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసులను ఉపసంహరించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈ ప్రభుత్వం గుర్తింపు పొందింది. అవినీతిపరులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏరకంగా కాపాడుతుందో ఈ కేసుల ఉపసంహరణ నిర్ణయాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
2013 సంవత్సరంలో నిమ్స్ కు సంబంధించి శేషగిరిరావు అనే డాక్టర్ లక్షా 60వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే ఆ కేసును 2017లో కేసిఆర్ విచారణ అవసరం లేదని ఉపసంహరించుకున్నారు. డాక్టర్ శేషగిరిరావు కేసిఆర్ బంధువు. ఇతనికి లంచం ఇచ్చి పట్టించింది సాధారణ వ్యక్తి కాదు.. ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు. కేసిఆర్ బంధువు కాబట్టి అవినీతికి పాల్పడినా, దోచుకున్నా ఏం చేసినా చర్యలు తీసుకోకుండా కేసులు ఉపసంహరించడం దారుణం. కేసిఆర్ బంధువైతే చాలు ఈ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నా కేసులు ఉండవు. ఒకవేళ కేసులున్నా రద్దు చేస్తారు. కేసిఆర్ బంధువు సంజీవరావు అనే ఎసిపి కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నాడని కేసిఆర్ సర్కారే కేసు పెట్టింది. సంజీవరావు ఇంట్లో గుట్టలు గుట్టలుగా డబ్బు, బంగారం దొరికిందని ఆనాడు ప్రచారం జరిగింది. కానీ సంజీవరావు మీద చిటికెలో కేసు కొట్టేసి తిరిగి ఉద్యోగం కల్పించారు. ఇప్పుడు ఆ సంజీవరావు ఉద్యోగం వెలగబెడుతున్నారు. సంజీవరావు కూడా కేసిఆర్ కు దగ్గరి బంధువే. అతడు ఉద్యోగం నిర్వహిస్తున్నాడంటే ముఖ్యమంత్రి శాఖలో జరుగుతున్న అవినీతి తతంగాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఈమధ్య అవినీతి నిరోధక శాఖ పురుషోత్తం రెడ్డి అనే అధికారి మీద కేసులు నమోదు చేసింది. అతడు అవినీతికి పాల్పడ్డాడని మీడియాలో ప్రచారం జరిగింది. పురుషోత్తం రెడ్డే రాష్ట్రాన్ని దోచుకున్నట్లు ప్రచారం సాగింది. కేసిఆర్ బంధువుకు లేఅవుట్ పర్మిషన్ అడిగితే లంచం ఇవ్వాల్సిందే అని ఆయన అన్నడట. మేము చెప్పిన తర్వాత కూడా వాటా అడుగతారా అని చిన్నరాజుకు (కేటిఆర్) కోపమొచ్చిందట. పురుషోత్తం రెడ్డి, ఆయన కుటుంబం మొత్తాన్ని బజారులో నిలబెట్టారు. కసబ్ ఫ్యామిలీ, దావుద్ ఇబ్రహిం కుటుంబం కంటే దారుణంగా వాళ్లను దోషులుగా నిలబెట్టారు. వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడే స్థాయికి తీసుకొచ్చారు.
అడిషనల్ ఎస్పీ అశోక్ కుమార్ ను కూడా అతనికి సహకరించిండని అతడిని కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. బలహీన వర్గాలకు చెందిన అశోక్ కుమార్ మీద కేవలం సహకరించిండు అన్న కోణంలో కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. మీ ఇద్దరు బంధువులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే శేషగిరిరావు, సంజీవరావు మీద కేసులు భేషరతుగా ఉపసంహరించుకున్నారు. కానీ పురుషోత్తం రెడ్డిని, బలహీనవర్గాలకు చెందిన అశోక్ కుమార్ ను ఉద్యోగాల్లోంచి తొలగించి వాళ్లను తలెత్తుకోలేకుండా చేస్తున్నారు.
మీ బంధువులు అయితే, మీకు సంపాదనలో వాటా ఇచ్చేవాళ్లైతే ఏ తప్పు చేసినా పట్టించుకోరా? పాపారావు అనే మీ బంధువుకు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చారు. తీరా ఇప్పుడు ఆ పాపారావు పాపాలు ఎక్కువైనయ్. ఆయన దోచుకుంటున్నాడని మీడియా కోడై కూస్తున్నది. మరి పాపారావు మీద చర్యలు తీసుకునే దమ్ము ఉందా? 125 మంది మీద అవినీతి కేసులను రద్దు చేయడానికి మీ కుటుంబానికి ఎంత సొమ్ము ముట్టిందో చెప్పాలి.
గత ఏడాది ప్లీనరీలో గులాబీ కూలీ చేసుకుని తొవ్వ ఖర్చులు సంపాదించుకోవాలని కేసిఆర్ ఆదేశించిండు. దాన్ని అదునుగా తీసుకుని ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు అందరూ పడి తెలంగాణను దోచుకున్నారు. వందల కోట్ల రూపాయలను తమ తమ శాఖల్లో పడి దోచుకున్నారు. కడియం విద్యాశాఖ, కేటిఆర్ ఐటి శాఖలో, ఈటల సివిల్ సప్లై లో హరీస్ ఇరిగేషన్ లో దోచుకున్నారు. అన్ని శాఖలలో వందల కోట్లు వసూలు చేశారు. నేను ఆధారాలతో సహా ఇక్కడి హైకోర్టులో కేసు వేసిన. విచారణ జరపాలని ఎసిబిని ఆదేశించింది హైకోర్టు. కానీ విచారణ లేదు. తర్వాత ఢిల్లీ హైకోర్టులో కేసు వేశిన. టిఆర్ఎస్ పార్టీని రద్దు చేయండి అని కోర్టులో కేసు వేశిన.
వేముల వీరేశం నల్లగొండ జిల్లాలో ఒక అధికారిని ఒత్తిడి చేసి పని చేయకపోతే 8 లక్షల లంచం ఇస్తానని మాట్లాడిండు. ఈ రికార్డులను పెట్టి ఎసిపి ఎసిబికి ఫిర్యాదు చేశాము. మరి కేసు నమోదు చేసి విచారణ జరపాల్సిన బాధ్యత ఉందా లేదా? మీ ఎమ్మెల్యే మీద ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా?
సిరిసిల్ల ఛైర్ పర్సన్ ఏం చెప్పింది? మాకు 2శాతం లంచ ఇవ్వాల్సిందే అని మీడియా ముందు చెప్పలేదా? కాంట్రాక్టర్లు ఇవ్వాల్సిందే అని చెప్పింది. మీ కొడుకే 2శాతం లంచాలు తీసుకోవాలని చెప్పినట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇచ్చిన స్టేట్ మెంట్ మీద విచారణ చేయాల్సిన బాధ్యత సిఎం మీద లేదా? తర్వాత ఆమెను రాజీనామా చేయించినట్లు డ్రామా చేసి మళ్లీ పోస్టు ఇచ్చారు తప్ప ఆ ఘటనపై విచారణ జరపలేదు. యాక్షన్ లేదు.
మీ కొడుకు తప్పు చేసినా, మీ ఎమ్మెల్యే తప్పు చేసినా కేసులు లేవు. విచారణ లేదు. కానీ రాజకీయ కుట్రలతో ప్రత్యర్థి పార్టీల నేతలపై కేసులు పెట్టాలని చూస్తే ఎవ్వరూ భయపడరు. నీ ఉడత ఊపులకు ఎవ్వడు భయపడరు కేసిఆర్. నీ బతుకేందో ప్రజలకు వివరిస్తాం. నువ్వు అనుకుంటున్నావేమో? తప్పించుకుంటానని. కానీ నువ్వు ఎక్కడి నుంచి తప్పించుకోలేవు కబర్డార్.