నెల్లూరు రూరల్ వైసిసి ఎమ్మెుల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని బెట్టింగ్ కేసు వదిలేటట్లు లేదు. ఈ వివాదంలో ఆయనను అంత ఈజీగా పోలీసులు వదిలేటట్లు లేరు.
గతంలోఒక సారి ఆయనను అరెస్టు చేస్తారని వదంతులు రాగానే ఆందోళన చెపట్టారు. ఇపుడు మళ్లీ ఆయన మీద చర్యలు తీసుకోబోతుతన్నారని,ఏకంగా డిజిపి నుంచేఆదేశాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. ఎసిబి విచారణకు ఆదేశించారని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి తన వైఖరిని వెల్లడించారు.
కక్షతోనే తనపై బెట్టింగ్ కేసులు పెట్టి వేధిస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లా ఎస్పీ రామకృష్ణపై ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగానే ఏసీబీ విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశారని అన్నారు. బెట్టింగ్ వ్యవహారంపై తాను గతంలో చేసిన ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోని అధికారులు చార్జి షీట్ లో తన పేరుని ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. తాను పోలీసులతో లాలూచీ పడ్డానని అంటున్న అధికారులు, ఆపోలీసుల పేర్లను ఎందుకు బహిర్గతం చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. అక్రమ కేసులకు తాను భయపడబోనని, ప్రజాపోరాటం చేస్తానని కూడా ఆయన హెచ్చరించారు. తప్పు చేయలేదు కాబట్టే తాను ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానని అన్నారు.తొందర్లో జిల్లా ఎస్పీని కలుస్తానని చెప్పారు.