వైసిపి అధినేత జగన్ అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. అట్లాంటి, ఇట్లాంటి షాక్ కాదు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. టిడిపి కంచుకోటలో నిలబడి తొడగొట్టి సవాల్ చేశారు. జగన్ ఇచ్చిన షాక్ తో అధికార టిడిపి ఇరకాటంలో పడింది. పూర్తి వివరాల కోసం చదవండి.
ఆంధ్రాలో ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో జగన్ నడిచారు. ఈ సందర్భంగా వైసిపి అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు జిల్లాగా మారుస్తామని ప్రకటించారు. జిల్లా పేరు మార్చడమే కాదు జిల్లాను, నిమ్మకూరు ఊరును బాగుపరుస్తామని హామీ ఇచ్చారు.
ఈ ప్రకటన ఆంధ్రా రాజకీయవర్గాలను షేక్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంది. అయినా ఆ పార్టీకి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ఆలోచన ఇంతవరకూ రాలేదు. కనీసం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. మరి వైఎస్ జగన్ చేసిన ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీలో కలవరం రేపడం ఖాయమంటున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని జగన్ ప్రతి సందర్భంలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. వైఎస్ బతికి ఉన్నన్ని రోజులూ ఈ ప్రకటన చేయని రోజంటూ లేదు. అందుకే ఎన్టీఆర్ ను కేవలం ఓట్లకోసమే చంద్రబాబు వాడుకుంటున్నారని, ఆయనుకు ఏనాడూ గౌరవం ఇవ్వలేదని వైసిపి చెబుతోంది. ఇక ఎన్టీఆర్ రెండో సతీమణి లక్ష్మీపార్వతి కూడా వైసిపి గూటికి చేరిన విషయం తెలిసిందే.
తాజాగా జగన్ చేసిన ప్రకటన సరికొత్త చర్చను లేవనెత్తింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసిపి అంటే రెడ్ల పార్టీ, టిడిపి అంటే కమ్మ పార్టీ అన్న ముద్ర ఉంది. కానీ కమ్మలంతా టిడిపి తో కలిసి లేకుండా చేయడం కోసం వైసిపి ఈ స్టెప్ తీసుకుందా అన్న చర్చ ఉంది. ఎందుకంటే కమ్మల్లో ఎన్టీఆర్ అభిమానులంతా టిడిపి పక్షాన లేరనే చెప్పాలి. ఈ నేపథ్యంలో చంద్రబాబును వ్యతిరేకించే కమ్మలందరినీ జగన్ బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు టిడిపి నేతలు అంచనా వేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ను అభిమానిస్తూ.. చంద్రబాబుకు వ్యతిరేకులుగా ఉన్న కమ్మ కులస్థులందరినీ ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రకటన చేసి ఉండొచ్చని చెబుతున్నారు.
మొత్తానికి చంద్రబాబుకు రాని ఆలోచన జగన్ చేయడం మాత్రం అధికార తెలుగుదేశం పార్టీకి షాకింగ్ న్యూస్ గానే చెబుతున్నారు.