తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ నేపథ్యంలో కోదండరాం ఒక పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆ పిలుపు చాలామందిని నిరాశకు గురిచేసిందా అన్న చర్చ మొదలైంది. జన సమితి ఆవిర్భావ సభపై వారు ఎంతో ఆశ పెట్టుకున్నట్లు చెబుతున్నారు. మరి కోదండరాం వారిని నిరాశకు గురిచేశారా లేదా తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభ ఈనెల 29న హైదరాబాద్ లో జరగనుంది. ఈ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సర్కారు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేసినా.. హైకోర్టు నుంచి కోదండరాం అండ్ టీం అనుమతులు తెచ్చుకున్నారు.
29న హైదరాబాద్ లో జరగనున్న సభకు వచ్చే వారికి కోదండరాం ఒక పిలుపునిచ్చారు. అదేమంటే? ఊరుకో నాగలి కర్రు తీసుకుని రావాలని పార్టీ నేతలకు, తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా పిలుపు మాత్రం కొంతమందిని నిరాశకు గురిచేసినట్లు చెబుతున్నారు. ఆ ముచ్చటేందంటే? జన సమితి ఆవిర్భావ సభ వేదికపై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నేతలను ఎవరినీ చేర్చుకునే ముచ్చటే లేదని తేల్చి చెప్పారు.
నాయకుల చేరికలు ఉండబోవని చెప్పడంతో ఆవిర్భావ సభనాడే పార్టీలో చేరి మెల్లగా జన సమితిలో సెటిల్ అయిపోయావాలని ఊవ్విళ్లూరుతున్న వారికి ఇప్పుడు గొంతులో వెలక్కాయ పడ్డట్లయిందని చెబుతున్నారు. ఆవిర్భావ సభనాడే పార్టీలో చేరి రానున్న రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోవాలని చాలా మంది ఆశతో ఉన్నారట. వారంతా ఇంకో సందర్భంలో పార్టీలో చేరవచ్చని చెబుతున్నారు.
అయితే అధికార టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొందరు జన సమితిలో చేరతాన్న ప్రచారం గతంలో సాగింది. కానీ కోదండరామే ముందుకొచ్చి ఎవరినీ ఈ సభలో చేర్చుకునే ముచ్చటే లేదని చెప్పడంతో ఇక వారంతా ఇంకో ముహూర్తం చూసుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. మిగతా పార్టీల వారు కూడా చేరేందుకు తయారైనట్లు వార్తలొచ్చాయి. కానీ వారు కూడా ఇక కొంత కాలం పాటు ఆగక తప్పదేమో మరి.