తెలంగాణ సర్కారుపై టిఆర్ఎస్ పార్టీకి చెందిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి. శ్రీనివాస్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. పాలమూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమన్నారు. అనుకున్నంత స్పీడ్ గా ఉద్యోగాల భర్తీ జరగడంలేదని ఆయన ఒప్పుకున్నారు. నిరుద్యోగుల ఆవేదనతో తాను ఏకీభవిస్తున్నానని ప్రకటించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల్లో అసంతృస్తి ఉన్నమాట వాస్తవమేనన్నారు. అనుకున్న స్థాయిలో రిక్రూట్ మెంట్ జరగడంలేదు కదా? అని ఆయన ప్రశ్నించారు.
తాను సిఎం కేసిఆర్ తో మాట్లాడి లక్షా 25వేల ఉద్యోగాలు ఈ ఏడాదిలోనే భర్తీ చేసేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. మీకోసమే మేము కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, అలాంటప్పుడు విద్యార్థులను నిర్లక్ష్యం చేసే ప్రసక్తే లేదన్నారు.
టిఆర్ఎస్ ప్లీనరీ కార్యక్రమాన్ని పండుగలా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నవేళ టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చేసిన ఈ కామెంట్స్ టిఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. శ్రీనివాస్ గౌడ్ ఆవేదనతో ఈ కామెంట్స్ చేశారా? లేక వేరే కోణంలో ఈ కామెంట్స్ చేశారా అన్న చర్చలు ఊపందుకున్నాయి.
శ్రీనివాస్ గౌడ్ తాజాగా మాట్లాడిన వీడియో రాజ్ న్యూస్ లో ప్రసారమైంది. ఇదే రాజ్ న్యూస్ లో గతంలో ఉద్యమ నేతగా ఉన్న కేసిఆర్ మాట్లాడిన వీడియో ప్రసారమైంది. ఈ రెండు వీడియోలను జత చేసి నిరుద్యోగులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ దుమ్ము రేపుతున్నారు.
మొత్తానికి నిరుద్యోగుల్లో ఉన్న తీవ్రమైన అసంతృప్తిని ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే బయటపెట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.