మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతరు శ్రీజ అందరికీ గుర్తుంది కదా? అదేనండీ అప్పట్లో ఆమె వివాహం సంచలనం రేపింది. శిరీష్ భరద్వాజ్ అనే యువకుడిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ పెళ్లి ఇంట్లో చెప్పకుండా జరిగిపోవడం తర్వాత మీడియాలో పెద్ద దుమారం రేగడం తెలిసిందే కదా? ఆ తర్వాత కొంతకాలానికి ఆమెకు సంతానం కూడా కలిగింది. ఏమైందో ఏమో కానీ శిరీష్ భరద్వాజ్ మీద శ్రీజ వరకట్నం కేసుతోపాటు వేధింపుల కేసులు కూడా పెట్టారు. తర్వాత ఇద్దరూ విడిపోయారు.
ఆ తర్వాత శ్రీజ రెండో పెళ్లి చేసుకున్నారు. శిరీష్ తో విడిపోయిన సమయంలో శ్రీజ కు తల్లిదండ్రులు అండగా ఉన్నారు. ఇప్పుడు శ్రీజ చేసిన పనికి అందరూ అభినందించాల్సిందే. ఎందుకంటే? సీనియర్ నటి అల్లరి సుభాషిణి కొన్నాళ్లుగా క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్నారు. తాజాగా సుభాషిణి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండు లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు. బుధవారం సాయంత్రం చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ స్వయంగా సుభాషిణి ఇంటికెళ్లి రెండు లక్షల రూపాయలు అందించారు. సుభాషిని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వాళ్ల ఇంట్లో కొద్దిసేపు గడిపి సుభాషిణితో మాట్లాడారు.
పెళ్లి వివాదం తర్వాత శ్రీజ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. పెళ్లి సమయంలో అన్ని టివిల్లో శ్రీజ పెళ్లి వీడియోలు మారుమోగిపోయాయాయి. తర్వాత విడాకుల సమయంలో శ్రీజ ఒకసారి మీడియా ముందుకు వచ్చారు. కానీ అప్పుడేమీ పెద్దగా హడావిడి లేదు. కేవలం కోర్టుకు హాజరైన సమయంలో కనిపించారు. కానీ ఇప్పుడు శ్రీజ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం గమనార్హం. పెళ్లి సమయంలో ఉన్నట్లుగా కాకుండా శ్రీజ ఇప్పుడు చాలా సన్నబడి కనబడుతున్నారు. చాలా రోజుల తర్వాత చిరు చిన్నకూతురు శ్రీజ ప్రజల్లోకి రావడం చిరు ఫ్యాన్స్ లో చర్చనీయాంశమైంది.