కొండా దంపతులు కాంగ్రెస్‌ గూటికి వెళ్తున్నారా???

(మానేపల్లి రాంబాబు)

ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. అధికార పక్షం నుంచి ఎమ్మెల్యే కొండా సురేఖ తన సొంత గూటికి వెళ్లేందుకు సమాయత్తమవుతోంది.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమవుతోందనే వార్త ట్రెండింగ్ అవుతున్నది.

నాగం జనార్దన్ రెడ్డి

టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లి ఇటీవలే రాజీనామా చేసిన మహబూబ్ నగర్ జిల్లా నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి, ప్రజాగాయకుడు గద్దర్ కుమారుడు సూర్యం బుధవారం రాహుల్ సమక్షంలో కాంగ్రెసులో చేరనున్నారు.

గద్దర్ కుమారుడు సూర్యం

ఇదే విధంగా సురేఖ కూడా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు దారి సిద్దం చేసుకున్నారనే వార్త ఇపుడు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతూ ఉంది.

అయితే, ఇరువర్గాల నుంచి ధృవీకరణ లేదు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యం, ప్రభావం చూపే నేతలుగా కొండా దంపతులు ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కొనసాగిన హవా వైఎస్ మరణం తరువాత వాళ్లకి కష్టాలు వచ్చాయి. జగన్ తో పొసగలేదు. దానికి తోడు అపుడు తెలంగాణ సెంటిమెంటు.  ఈ పరిణామాల వల్ల  కొండా దంపతులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ రోజు ఆమెకు మంత్రి పదవి అని కెసిఆర్ పబ్లీక్ గా ప్రకటించారు. ఆమె ఎమ్మెల్యే సీటును దక్కించుకున్నారు. భర్త కొండా మురళి కి ఎమ్మెల్సీ కూడా దక్కింది. అయితే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కొండా కు మంత్రి పదవి దక్కలేదు. నిజానికి క్యాబినెట్ లో మహిళలెవరూ లేరు. అయినా సరే, ఆమె అవకాశం ఇవ్వలేదు. ఇది కొండ దంపతులను పీడిస్తూ ఉందని చాలా మంది వారి సన్నిహితులు చెబుతారు. దీనికి ఉప్పు, నిప్పులా ఉండే కొండా, ఎర్రబెల్లి ఒకే “కారు”లో  ప్రయాణించాల్సి వస్తున్నది. ఈ మాత్రం దానికి ‘కారు’ లో ఎంతకాలం వెళ్లాలనే ప్రశ్నలో వారిలో మొదలయిందట.  దీని వల్లే అవకాశం ఉన్నపుడల్లా కాంగ్రెస్ వైపు కొండా దంపతులు నడక అంటూ వార్తలొస్తున్నాయి. వారు ఖండిస్తున్నారు. ఇపుడు తాజాగా నాగం, గద్దర్ కుమారుడు  కాంగ్రెస్ లో చేరుతున్నరని వార్తలు రావడంతో  కొండా దంపతుల వార్త కూడా గుప్పు మంది.

కొండా దంపతులు  కాంగ్రెస్ లోకి వెళ్లాలనుకునేందుకు మరొక కారణాన్ని కూడా చెబుతున్నారు  వారు తమ  కూతురుని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో ఆమెను నిలపెట్టాలని భావిస్తున్నారు. అయితే గులాబీ పార్టీలో ఆమెకు టికెట్ అదనంగా ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. దీనికి తోడు వారు పార్టీ మారుతారనే పుకారు  బాగా ఉంది. కెసిఆర్ కూడా వీటిని నమ్ముతున్నారేమో. ఇటీవల పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  కొండా దంపతులతో చర్చలు జరిపినట్లు వినపడుతూ ఉంది.  వారి  డిమాండ్లకు కాంగ్రెస్  సానుకూలంగా ఉన్నట్లు పార్టీలోకి రీఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు  బాగా ప్రచారమవుతూ వుంది.

ఈ నేపథ్యంలో  కొండా సురేఖ సొంత గూటికి రాహుల్ సమక్షంలో చేరుకుంటుందని రెండు రోజులుగా వినబడుతూ ఉంది. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు కాంగ్రెస్ పెద్దలెవరూ అందుబాటులో లేరు.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్,ప్రధాన అధికార ప్రతినిధి డా. దాసోజు లతో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *