హైదరాబాద్ ఐటి రంగంలో దూసుకుపోతున్నదని వార్తలు తెగ చదువుతున్నారు. భారత్ దేశం స్టార్టప్ హబ్ అయిపోయిందని, అన్ని వరల్డ్ ఫేమస్ కంపెనీలు తెలంగాణ రాజధాని వైపు బుల్లెట్ ట్రెయిన్ లా దూసుకువస్తున్నాయని చదువుతున్నాం. ఒక వైపు తెలంగాణ ఏర్పడి నాలుగేళ్లయినా ప్రభుత్వోద్యోగాలు రావడం లేదని నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులంతా ఆవేదన చెందుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ల కోసం, ఇంటర్వ్యూల కోసం, పోస్టింగ్ ల కోసం ఎదురుచూస్తున్నపుడు, హైదరాబాద్ ఐటి ఉద్యోగాలున్నాయని అనుకున్నారు. చాలా మంది ఏవేవో కోర్సులు నేర్చుకుని, స్కిల్స్ సంపాయించుకుని ఐటి ఉద్యోగాలకోసం అటూ ఇటూ తిరుగుతున్నారు.
ఇలాంటపుడే హైదరాబాద్ కు దెబ్బ తగిలింది. పే…ద్ద దెబ్బ తగిలింది. ఈ విషయాన్ని నౌక్రి.కామ్ జాబ్ స్పీక్ వెల్లడించింది. దేశంలో ఉద్యోగాల మీద తయారు చేసిన ఈ కంపెనీ తాజా నివేదిక ప్రకారం హైదరాబాద్ లో ఉద్యోగాలు నియామకాలు దారుణంగా పడిపోయాయి. ఐటి (IT), ఐటి సంబంధ(ITeS)ఉద్యగాలకు సంబంధించి 2017 తో పోలిస్తే, 2018లో ఉద్యగాల నియామకాలు పడిపోయాయి. మరి బాధాకరమేమిటంటే, ముంబయి, కలకత్తాలతో ఉద్యోగాలు పెరిగాయి. హైదరాబాద్ బెంగూళూరులలో పడిపోయయి. 2018 మార్చిలో 4 శాతం ఉద్యోగాలు పడిపోయయి. జాబ్ మార్కెట్ కలకత్తా (5 శాతం), ముంబయి (4) ఢిల్లీ ఎన్ సిఆర్ (3), చెన్నై (1), పుణే (1) లలో పెరిగింది.
హైరింగ్ పెరగకపోయినా పర్వాలేదుగాని, పడిపోవడం తెలంగాణ యువకులకు దుర్వార్త అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక వైపు గ్రూప్స్ ఉద్యోగాల రిక్రూట్ జరగడం లేదు. గ్రూప్ టూ… ప్రాసెస్ పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. వేలాది యువకులు వీటి కోసం కోచింగ్ తీసుకుని, విసిగివేసారి, హైదరబాద్ లో ఉండలేక, సొంతవూర్లకు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. అయితే, ఇంజనీరింగ్ చదవిన వారికి హైదరాబాద్ ఐటి అండగా ఉంటుటుందునుకుంటే ఇపుడు ఈ రంగం పడిపోతున్నది.
చిత్రమేమిటంటే, దేశవ్యాపితంగా ఐటి, ఐటి సంబంధ రంగాలు వన్నె తగ్గుతూ ఉంది. 2018 జనవరిలో ఈ రెండు రంగాల లో హైరింగ్ 2017 జనవరితో పోలిస్తే 6 శాతం పడిపోయింది. మార్చి నాటికి 12 శాతానికి దిగజారింది. అంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా తయారయిందో అర్థమవుతుంది. దాని ప్రభావం హైదరబాద్ మీద ఎక్కువగా ఉండటం మరీ ఆశ్చర్యం. అయితే, బిపివొ రంగం లో మాత్రం ఉద్యోగాలు 11 శాతం పెరిగాయి. ఇతర రంగాల ఉద్యోగాల పెరుగుదల కు సంబంధించి ఆటో రంగంలో 33 శాతం జాబ్స్ పెరిగాయి. తెలుగు రాష్ట్రాలలో ఆటోరంగం బాగా వెనకబడి ఉంది. ఇండస్ట్రియల్ ప్రాడక్స్ట్స్ లో 23 శాతం ఉద్యోగాలు పెరగియి. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు వీకే. నిర్మాణ రంగంలో 20 శాతం పెరిగాయి. బ్యాంకింగ్ లో 5 శాతం, ఇన్స్యూ రెన్స్ లో 6 శాతం, ఫార్మ బయోటెక్ లో 4 శాతం ఉద్యోగాలు పెరిగాయి. అదీ సంగతి.