● రాయలసీమ అభివృద్ధికి కీలకమైన మౌలిక వసతుల కల్పన విస్మరించి, కేవలం తమ రాజకీయ లబ్ధికి కృషి చేస్తున్న రాజకీయ పార్టీల వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలియచేయడం.
● వెనుకబడిన ప్రాంతాల అబివృద్దికి ఇచ్చిన హామీలను అమలు చెయ్యడం కోసం నిర్మాణాత్మక పాత్ర వహించాలని రాజకీయ పార్టీలకు వారి భాద్యతలను గుర్తు చెయ్యడం.
● రాజకీయ పార్టీల సంకుచిత వైఖరికి ప్రజలు దూరంగా ఉండేలా, రాయలసీమ హక్కులను కాపాడుకునేలగా ప్రజలను చైతన్య పరచడం.
ఉపోద్ఘాతం:-
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధానిని నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికకు వ్యతిరేకంగా, నిర్మాణానికి అనువుకాని ప్రదేశంలో, నదీ గర్భంలో రాజధాని నిర్మాణానికి తెలుగు దేశం ప్రభుత్వం పూనుకున్నది. విభజన చట్టానికి వ్యతిరేకంగా అత్యంత వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం రాజదాని నిర్మాణం చేపట్టుతున్నా ఎలాంటి అభ్యంతరాలు తెలుపక కేంద్ర ప్రభుత్వం (రాష్ట్ర ప్రభుత్వ మిత్ర పక్షం) రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసింది. శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమలొ రాజధాని నిర్మించవలసి ఉన్నప్పటికీ పాలక, ప్రతిపక్షాలు రెండూ ఆ ప్రస్తావనే చెయ్యకుండా విజయవాడ ప్రాంతంలో రాజధానికి సమ్మతి తెలిపి రాయలసీమకు తీరని ద్రోహం చేసాయి.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పది సంవత్సరాలుగా వాడుకోనటానికి రాష్ట్ర విభజన చట్టం అవకాశం కల్పించినప్పటికీ, ఆర్థిక ప్రాదాన్యత క్రమాన్ని విస్మరించి పాలకుల రాజకీయ లక్ష్యంతో రాజధానిని ఆఘమేఘాల మీద విజయవాడకు మార్చారు. కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలో నిర్మించవలసిన పోలవరం జాతీయ ప్రాజక్టును రాష్ట్ర ప్రభుత్వం, తమ స్వప్రయోజనలకోసం తామే నిర్మించే బాధ్యతను నెత్తిన ఎత్తుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ఒడిదుడుకులకు గురిచేసింది. ఇలాంటి అసంబద్ధ పాలకపక్ష నిర్ణయాల వలన రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పూర్తిచేస్తామన్న గాలేరు – నగరి, హంద్రి – నీవా, వెలిగొండ ప్రాజక్టులను పూర్తి చెయ్యకుండా వ్యవహరిస్తున్న రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాల వైకరిని ప్రశ్నించక జాతీయ కాంగ్రేస్ పార్టీ రాయలసీమకు తీవ్రద్రోహం చేస్తున్నది. ఇక రాయలసీమ ఆర్థిక, సామజిక అంశాలే పట్టని మేధావులతో, సిని కళాకారులతో చెట్టాపట్టాలేసుకొని రాజకీయలబ్ది లబిస్తుందన్న ఊహాలోకంలో విహరిస్తున్న వామపక్షాలు కూడా రాయలసీమకు తీరని ద్రోహమే చేస్తున్నాయి.
రాజకీయ పార్టీల తీరు:
రెండు కళ్ళ సిద్దాంతానికి ప్రతి రూపంగా మారిన ముఖ్య మంత్రి చంద్ర బాబు గారి అధ్వర్యంలో, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం మాత్రమే తన రెండు కళ్ళు అన్న భావనలోనే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది. అమరావతి, పోలవరాలకే ప్రాదాన్యనతను ఇస్తున్న అధికార పక్షం రాయలసీమ అంటే వర్గాలుగా విడిపోయిన వోటర్లు మాత్రమే (మనుషులే లేరు) అన్న భావనలో రాయలసీమ పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కేవలం రాజకీయ లక్ష్యంతో ప్రతిపక్ష, జాతీయ కాంగ్రేస్, బి జె పి, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ అన్యాయాన్ని ప్రశ్నించలేని దీన పరిస్థితికి దిగజారాయి.
నేపథ్యం:
రాయలసీమ వెనుకబాటుతనం రాజకీయ,ఆర్థిక, సామాజిక అంశాలతో ముడి పడి ఉంది. రాయలసీమ ఆర్థిక, సామాజిక ప్రగతి కేవలం అభివృద్ధితోనే సాద్యం అవుతుంది. రాయలసీమ అభివృద్ధి ఈ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనతో ముడి పడి ఉందన్నది నగ్న సత్యం.
రాయలసీమకు కీలకమైన మౌలిక వసతులు, నీటి కేటాయింపులు, అభివృద్ధి వికేంద్ర్రీకరణ లాంటి, చట్టబద్ద అంశాలపై రాయలసీమ ప్రాంత ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు అనేక సందర్భాలలో హామీలు, వాగ్ధానాలు, హక్కులను ఈ ప్రాంతం పొందివున్నది. ఈ ప్రస్థానంలో క్రింద వివరించిన 4 సందర్భాలు అత్యంత కీలకమైనవి.
శ్రీ బాగ్ ఒడంబడిక :
వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి మౌళిక వసతుల కల్పన అత్యంత అవసరం అని నాటి రాయలసీమ పెద్దలు గ్రహించారు. రాయలసీమ అభివృద్ధి చోదకాలుగ (Growth Engines) నీటి పారుదల, అధికార కేంద్రం అని గ్రహించిన పెద్దలు నాడు ఆంధ్ర నాయకులతో శ్రీబాగ్ ఒడంబడిక చేసుకున్న తరువాతనే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో పాలుపంచుకున్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కృష్ణా జలాల పంపిణీ లో రాయలసీమ అవసరాలు తీరిన తరువాతనే మిగిలిన నీరు మాత్రమే మద్యాంధ్ర జిల్లాలకు ఇవ్వ వలసి ఉంది. ఈ ఒడంబడిక ప్రకారం రాయలసీమ వాసులు కోరిక ప్రకారం రాజదాని లేదా హైకోర్టు ను రాయలసీమలో ఏర్పాటు చెయ్యవలసి వున్నది.
అభివృద్ధి వికేంద్రీకరణ ఆవశ్యకతను చాటిన సమైక్యాంధ్ర ఉద్యమం :-
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో రాయలసీమ ప్రజలు, ఆంధ్ర ప్రాంతం ప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమం చేపట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యం అంత అభివృద్ధి కేంద్రీకృతమైన హైదరాబాద్ నగరం చుట్టే జరిగింది. వివిద ప్రభుత్వ కేంద్ర కార్యాలయాలను, సంస్థలను, ఒకే ప్రాంతంలో కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఏర్పాటుతో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. వేర్పాటు ఉద్యమాలకు తావు లేకుండ, సుస్థిర రాష్ట్ర నిర్మాణానికి అభివృద్ధి వికేంద్రీకరణ అత్యంత కీలకమైన అంశంగా అన్ని వర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్ర విభజన చట్టం లో రాయలసీమ అభివృద్ధి అంశాలు:-
సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజకీయ పార్టీలు కేవలం రాజకీయ లబ్దికై మునిగి తేలుతున్న సందర్భంలో, రాయలసీమ అభివృద్ధికి కావలసిన అంశాలను రాష్ట్ర విభజన బిల్లులో చేర్చాలని రాయలసీమ ప్రజా సంఘాలు అనేక ప్రతిపాదనలను, ప్రదర్శనలను, ఉద్యమాలను చేసింది. రాయలసీమ ప్రజా సంఘాల కార్యాచరణ ఫలితంగా రాయలసీమ అభివృద్ధికి కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక రాయితీలతో కూడిన ప్యాకేజీలు, ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్, అనేక జాతీయ స్థాయి సంస్థలు మొదలగు అంశాలను రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. రాజకీయ పార్టీలు క్రియాశీలకంగా వ్యవహరిచి వుంటే ఆంధ్ర రాష్ట్ర విభజన నాటికీ నిర్మాణంలో ఉన్న, రాయలసీమ ప్రాజక్టులకు చట్టబద్ధ నీటి కేటాయింపులకు కీలకమైన, దుమ్మగూడెం టైల్ పాండ్ ప్రాజక్టును కూడా సాదించుకొని ఉండేవారము.
రాయలసీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి శాసన సభలో ప్రకటించిన అంశాలు
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి గారు శాసన సభలో 4.9.2014 కీలకమైన ప్రతిపాధనలను చేసారు. ఈ ప్రతిపాదనలలో కడప స్టీల్ ప్లాంట్, అనంతపురంలో AIMS, సెంట్రల్ యూనివర్సిటీ, చిత్తూరలో ఐ టి హబ్, హైద్రాబాద్ – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, తదితర సంస్థల ఏర్పాటుకై హామి ఇచ్చారు. అదేవిధంగా రాయలసీమ అభివృద్ధికి పట్టుసీమ ద్వారా అదాఅయిన కృష్ణా జలాలను రాయలసీమకు కేటాయించడంతో పాటు, శ్రీశైలం రిజర్వాయర్ లో 100 టి యం సి నీటిని రాయలసీమ అవసరాలకు నిలువ ఉంచుతామని 29.3. 2016 న ప్రకటించారు.
రాజకీయ పార్టీలు నైతిక బాధ్యత:
శ్రీ బాగ్ ఒడంబడిక అమలు, రాష్ట్ర విభజన చట్టం లో పొందుపర్చిన హక్కులు, రాయలసీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి శాసన సభలో ప్రకటించిన హామీలు అమలు మరియు అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం పట్ల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ హక్కులను అమలు పరచడం అధికార పక్షం నైతిక బాధ్యత. ఈ హక్కుల సాధనకై ప్రతిపక్ష పార్టీ, రాష్ట్ర విభజన చేసిన జాతీయ కాంగ్రెస్, అందుకు మద్దతు పలికిన బి జె పి, ఇతర రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక పాత్ర వహించాల్సి ఉంది. వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్దికి ఈ ప్రాంత హక్కుల సాధన దిశగా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టడం కూడా ఆయా రాజకీయ పార్టీల నైతిక భాద్యతే.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధన దిశలో రాయలసీమ నిరసన కార్యక్రమం
రాయలసీమ ఆభివృద్దికి కీలకమైన మౌళిక సమస్యలపట్ల అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రాయలసీమ సామాజిక, ఆర్థిక సమస్యల పరిష్కరానికి కీలకమైన పైన వివరించిన మౌళిక వసతుల కల్పను విస్మరించి కేవలం తమ రాజకీయ లబ్ధికై చేపడుతున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా రాయలసీమ ప్రజా సంఘాలు రాయలసీమ జిల్లా కేంద్రాలలో ఏప్రిల్ 21, 2018 న నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్తున్నాయి. వెనుకబడిన ప్రాంతాల సమానాభివృద్ధికి మౌళిక వసతుల కల్పన సామాజిక బాధ్యత అని రాజకీయ పార్టీలకు గుర్తు చేయడానికి మహాత్ముడు చూపించిన అహింసా ఉద్యమ మార్గంలో మహాత్మా గాంధీ విగ్రహం ముందు చేపడుతున్న కార్యక్రమంలో రాయలసీమ ప్రజా సంఘాలు, ప్రజలు, అభిమానులు పాల్గనవలసిందిగా విజ్ఞప్తి.
-రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక