ప్రతిపక్ష పార్టీలు తలపెట్టిన ఏప్రిల్ పదహారో తేదీ బంద్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంత హ్యాపీ గా లేరు.
బందెందుకు అని ప్రశ్నించారు. బంద్ జరిపి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. బంద్ జరపాలనుకుంటే తనకంత పెద్ద పని కాదని, తాను పిలుపు ఇస్తే రాష్ట్రంలో ఒక్కకేంద్ర ప్రభుత్వం వాహనం కూడా తిరగదని అన్నారు.
అయితే, పోయిన నెలలో ఇదే ప్రత్యేక హోదా సమస్య మీద వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారు. హింసకు పూనుకోకుండా బంద్ జరపాలన్నారు. టిడిపి పెద్ద ఎత్తున బంద్ లో పాల్గొంది. పోలీసులకు సహకరించి, బంద్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చూశారు. అయితే, ఏప్రిల్ పదహారు బంద్ పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇపుడాయన అలాంటి బంద్ నే తప్పుబడుతున్నారు.
అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ దీక్ష చేయాలనుకోవడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ప్రధాని దీక్షకు పూనుకోవడం ఎపుడైనా విన్నామా అని నివ్వెర పోయారు. వెలగపూడిలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారో చూడండి:
‘‘బంద్ లకు పిలుపునిచ్చి ఏం చేయాలనుకుంటున్నారు. ప్రజలు మనకంటే ఎక్కువ చైతన్యవంతులు అయ్యారు. బంద్ లు చేస్తే, ప్రజలు ఇబ్బంది పడతారనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తు పెట్టుకోవాలి. మనం చేసే నిరసనలు అభివృద్ధికి ఆటంకం లేకుండా చేసుకోవాలి. నేను ఒక్క పిలుపునిస్తే రాష్ట్రంలో ఒక్క కేంద్ర ప్రభుత్వ వాహనం కూడా తిరగదు.
‘‘ఎవరి కోసం బీజేపీ వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు.ప్రధాని అనే వ్యక్తి దీక్ష చేయడం ఎక్కడైన చూసామా?. అన్నిటికి రాజకీయమే సమాధానం చెప్తుంది. రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో బంద్ లు చేసే వారికి పూర్తీ సహకారం అందిస్తాం. వైసీపీ వాళ్లు ఏపీ భవన్ వద్ద దీక్ష చేస్తా అంటే ,అనుమతి ఇచ్చాము.’’
ఇక తన ప్రయత్నాల గురించి చెబుతూ …
‘‘మళ్ళీ మల్లీ ఢిల్లీ వెళ్తాను.రాష్ట్ర హక్కుల సాదించుకుంనేత వరకు ఢిల్లీ వెళ్తూనే ఉంటా. జాతియ పార్టీ నాయకులను కలుస్తూనే ఉంటా. బ్రిటిష్ వారికి ,బీజేపీ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదు. గతంలో బీజేపీ ని వ్యతిరేకించాలంటే భయపడే వారు. ఇపుడు అన్ని పార్టీలు ఎన్ డిఎ నుంచి బయటకు వస్తున్నాయి.’’