దేశంలోనే ఎక్కడా లేని రీతిలో మేము పథకాలు తెస్తున్నామని తెలంగాణ సర్కారు గొప్పలు చెబుతున్నది. కానీ దేశంలోనే ఎక్కడా లేని రీతిలో తెలంగాణలో సిఎం కేసిఆర్ సొంత నియోజకవర్గంలో హాస్టల్ చిన్నారులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.
దేశంలోనే సన్నబియ్యం భోజనం పెడుతున్నాం. ఈ ఘనత సాధించిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని అసెంబ్లీలో, బయటా సిఎం కేసిఆర్ మొదలుకొని మంత్రివర్గం, గులాబీ నేతలంతా చెబుతున్నారు. అయితే తాజాగా సిఎం సొంత నియోజకవర్గం గజ్వెల్ లోని కొండపాక మండలంలో మర్పడగ గ్రామ హైస్కూల్ విద్యార్థులు మధ్యాహ్న భోజనం సరిగా లేదని రోడ్డు ఎక్కి నిరసన తెలిపారు. రోడ్డుమీదే భోజనాలు చేసి ఆందోళనకు దిగారు. గత వారం రోజులుగా నీళ్ళ చారు, పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
మధ్యాహ్నం సన్నబియ్యం అని చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో కనీసం పర్యవేక్షణ లేకపోవడంతో ఇలా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. అది కూడా సిఎం నియోజకవర్గంలోనే ఇలా జరిగిందంటే మిగతా ఏరియాల్లో పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చని జనాలు చర్చించుకుంటున్నారు.