తెలంగాణలో కుల భవనాల నిర్మాణం కోసం సర్కారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నది. అయితే కొన్నిచోట్ల ఈ భవనాల నిర్మాణం వివాదాలను రగిలిస్తున్నది. తాజాగా వేములవాడలో వెలమ సంక్షేమ భవన్ నిర్మాణం విషయంలో పెద్ద వివాదం చెలరేగింది. స్థానికులు వెలమ సంక్షేమ భవన్ నిర్మాణం చేపట్టరాదంటూ ఆ భవన నిర్మాణానికి ఫౌండేషన్ వేసే సమయంలో అడ్డుకుని నిరసన తెలిపారు. అయితే స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే (వెలమ కులానికి చెందిన వ్యక్తి) ఆందోళన చేసే మహిళలను బెదిరించారు. ష్… అంటూ వారిని భయపెట్టే ప్రయత్నం చేశారు.
భూమిపూజ చేయకుండా అడ్డుకుంటున్న మహిళలను, స్థానికులను పోలీసులు అక్కడినుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కోర్టులో పెండింగ్ లో ఉన్న భూమిలో భూమిపూజ ఎలా చేస్తారని మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ భూమిలో ఏమైనా చేయవచ్చని సూచించారు. దానికి ఎమ్మెల్యే స్థానిక మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంచెమన్న ఓపిక ఉండాలంటూ వారిపై ఫైర్ అయ్యారు.
మొత్తానికి అధికార పార్టీ ఎమ్మెల్యే జబర్దస్తీగా వెలమ భవన్ శంకుస్థాపనకు దిగడం, స్థానికులపై బెదిరింపులకు పాల్పడడం చర్చనీయాంశమైంది. పోలీసుల సహాయంతో ఎట్టకేలకు వెలమ భవన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ రావు జరిపించేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వార్నింగ్ ఇస్తున్న సందర్భంలో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడిపై పైన ఉంది మీరూ చూడండి.