స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అనే పేరుతో ఉన్న ఫేస్ బుక్ గ్రూప్ అడ్మిన్ ప్రశాంత్ ను పోలీసులు విడుదల చేశారు. సోమవారం ఉదయం మఫ్టీలో ఉన్న నార్త్ జోన్ పోలీసులు ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రశాంత్ ను పోలీసులు రాత్రి 11 గంటల వరకు విచారణ జరిపారు. అయితే ప్రశాంత్ అరెస్టుపై తెలంగాణలో పెద్ద దుమారం రేగింది జెంటిల్మెన్ గా పేరున్న ప్రశాంత్ ను ఎందుకు అరెస్టు చేశారబ్బా అని అన్ని పార్టీల వారు ఆరా తీశారు.
అరెస్టును తెలంగాణ జెఎసి ఛైర్మన్, తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ఖండించారు. తక్షణమే ప్రశాంత్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్టుపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. పెన్నుల మీద మన్ను కప్పితే తుపాకులై మొలకెత్తి పాలకులను అంతం చేస్తాయని హెచ్చరించారు.
ప్రశాంత్ అరెస్టుపై సోషల్ మీడియా దుమ్మెత్తిపోసింది. అరెస్టులతో పాలన సాగించడం సాధ్యం కాదని హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో అన్ని వైపుల నుంచి వత్తిడి తీవ్రమైన కారణంగా రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రశాంత్ ను పోలీసులు విడుదల చేశారు. అయితే విచారణలో స్పిరిట్ ఆఫ్ తెలంగాణలో పెడుతున్న పోస్టుల గురించి ఆరా తీసినట్లు ప్రశాంత్ ఫేస్ బుక్ లైవ్ ద్వారా తెలిపారు. ప్రశాంత్ లైవ్ వీడియో పైన ఉంది చూడండి. ప్రశాంత్ ను మళ్లీ కూడా విచారించే చాన్స్ ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.