కరువు జిల్లా అయిన కడపజిల్లాలో స్టీల్ ప్లాంట్ స్థాపించే విషయంలో డ్రామాలా డుతూ ప్రజలను మోసం చేయడం మానుకోవాలని స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అధ్యక్షుడు జి. వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.
శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు ఫ్యాక్టరీని అస్పష్టమయిన ప్రకటనలు చేస్తూ తామే ఉక్కు ఫ్యాక్టరీ తెస్తున్నామనే విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ ప్రజల్ని అయోమయంలో పడేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించే విషయంలో మెకాన్ సంస్థ ఇచ్చిన రిపోర్టును కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
తాము ఉక్కు ఫ్యాక్టరీ వ్యతిరేకం కాదంటూనే బీజేపీ, టిడిపి నేతలు ఎందుకు కాలయాపన చేస్తున్నారో చెప్పాలని, వారికి అడ్డొస్తున్న కారణాలను ప్రజలముందుంచాలని ఆయన అన్నారు. ఫ్యాక్టరీ స్థాపన విషయంలోరాజకీయాలాడుతూ కాలయాపన చేస్తూ రాయలసీమ నిరుద్యోగుల జీవితాలతో చేలగాటమాడుతున్నారని ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉక్కు ఫ్యాక్టరీ ని ఎవరు శంకుస్థాపన చేస్తున్నారు,ఎవరు స్థాపిస్తున్నారు,ఎప్పుడు చేస్తున్నారు,ఎంత మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారో గోప్యత లేకుండా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఓట్ల కోసం దిగజారిపోయి టిడిపి బిజెపిలు ప్రజల్ని మభ్య పెడుతూ మోసం చేస్తున్నారని అన్నారు.వీళ్ళు చేస్తున్న మోసాలకు ప్రజలు రాయలసీమ ప్రజలు ఓట్లతో తగిన బుద్ధి చెబుతారని ప్రవీణ్ రెడ్డి హెచ్చరించారు.