కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ అయిపోయిండు. ఆయన మాజీ అయిపోయిండు అనే కంటే ఆయనను తెలంగాణ సర్కారు బలవంతంగా, కుట్రపూరితంగా మాజీని చేసేసిందని కాంగ్రెస్ చెబుతున్నమాట. ప్రస్తుతం కోమటిరెడ్డి మాజీ అయిపోయిండని అసెంబ్లీ కూడా సర్టిఫికెట్ ఇచ్చేసింది. కానీ మాజీనా కాదా అన్న కేసు మాత్రం కోర్టులో నడుస్తోంది. సర్కారు మాజీ అని ప్రకటించేసింది కూడా. గెజిట్ కూడా జారీ చేసింది.
మంగళవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ నుంచి నల్లగొండకు బయలుదేరిండు. కోమటిరెడ్డికి గన్ మెన్లు తొలగించిన తర్వాత తొలిసారి ఆయన నల్లగొండ వెళ్లారు. టిఎస్ 09ఇఎస్ 7777 కారులో వెళ్తుండగా మార్గ మధ్యలో చౌటుప్పల్ పంతంగి వద్ద ఉన్న టోల్ గేట్ వద్దకు చేరగానే కారు ఆపాలంటూ డ్రైవర్ ను కోమటిరెడ్డి ఆదేశించారు. గతంలో అయితే ఆయన ఎమ్మెల్యే హోదాలో ఆ టోల్ గేట్ వద్ద ఫీజు చెల్లించకుండానే రయ్ మని వెళ్లిపోయేవాడు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు, ఎంపిలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులు,ఇతర రాజ్యాంగ హోదాలో ఉన్నవారికి టోల్ గేట్ వద్ద చార్జీ వసూలు చేయరు.
టోల్ గేట్ వద్ద జరిగింది ఇది
టోల్ గేట్ వద్ద కోమటిరెడ్డి కారు ఆపగానే టోల్ ప్లాజా సిబ్బంది అక్కడికి వచ్చారు. సర్ మీరు వెళ్లిపోండి.. టోల్ చార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు అని సూచించారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు కూడా టోల్ గేట్ వద్ద ఆపి ఛార్జ్ వసూలు చేయడంలేదు అని సూచించారు. కానీ కోమటిరెడ్ది వారి మాటలతో అంగీకరించలేదు. తెలంగాణ సర్కారు తన తప్పు లేకపోయినా బలవంతంగా సభ్యత్వం రద్దు చేసింది… అంతేకాదు గన్ మెన్లు కూడా తొలగించింది. కాబట్టి నేను టోల్ గేట్ వద్ద కామన్ మ్యాన్ మాదిరిగానే టోల్ గేట్ రుసుము పే చేసి ఇక్కడినుంచి వెళ్తాను అంటూ చెప్పారు. తెలంగాణ సర్కారు దుర్మార్గాలను, ఒంటెద్దు పోకడలను ప్రజలందరికీ తెలియజేయడం కోసమే తాను కామన్ మ్యాన్ లాగ టోల్ చార్జీ చెల్లిస్తానని చెప్పడంతో అక్కడున్న సిబ్బంది టోల్ ఛార్జీ తీసుకున్నారు. అనంతరం ఆయన నల్లగొండ వెళ్ళిపోయారు.
కోమటిరెడ్డి సహచరుడు టోల్ ఛార్జీ చెల్లించే వీడియో పైన ఉంది చూడొచ్చు.