2014లో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం జరిగిన ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైకాపాలు రాష్ట్రం పుట్టి మునుగుతున్నా ఇప్పటికీ రాజకీయ స్వార్థంతోనే వ్యవహరిస్తున్నాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సరేసరి.. అడ్రస్సే లేని ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు ప్రాంతీయ పార్టీలను అడ్డం పెట్టుకుని కొద్దో గొప్పో ఎంపీ సీట్లు దక్కించుకోవాలని తాపత్రయపడుతున్నది. ఈ నేపథ్యంలోనే మిత్రపక్షం టీడీపీతో రానున్న ఎన్నికలలో పొత్తు, సీట్ల కేటాయింపులో బేరసారాలు కుదరక వైకాపా, జనసేన పార్టీల వెంటబడుతున్నది. మొత్తంగా ఈ పార్టీలన్నీ ఆం.ప్ర. ప్రయోజనాలను తమ స్వార్థానికి కాలరాస్తున్నాయనేది వాస్తవం. ఆం.ప్ర. ప్రత్యేక హోదా కేంద్రబిందువుగా రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నాయి. ఇక సీపీఐ, సీపీఎం వంటి వామపక్ష పార్టీలది విచిత్రమైన పరిస్థితి. రాష్ట్రం, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి వున్నా ఆయా పార్టీల సిద్ధాంతాలు, రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు ప్రజలలో విశ్వాసం నింపలేకపోతున్నాయి. అందువల్ల చట్టసభలలోకి అడుగు పెట్టే స్థాయిలో ఓట్లు సాధించలేకపోతున్నాయి.
దేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్లపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జనరంజక పాలన అందించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు అనుగుణంగా 23 జిల్లాల రాష్ట్రాన్ని విభజన చేయడం ద్వారా రాజకీయంగా తీవ్రంగా నష్టపోయింది. ఐదుకోట్ల మంది ఆంధ్రులు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా ఇవ్వని రీతిలో 2014 లో జరిగిన పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో ఓడించటం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి పకడ్బందీగా చట్టం తీసుకువచ్చింది. రాష్ట్ర సర్వతోముఖాళివృద్ధికి ఇంకా అనేక ప్రయోజనాలు కల్పించింది. కానీ ఇదంతా ఎన్నికలకు ముందు జరగడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పలేదు. కనీసం విభజన జరిగిన తర్వాత మరో ఏడాది అధికారంలో వుండే విధంగా జాగ్రత్తపడితే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు విభజనకు అంగీకరించినప్పటికీ నక్క జిత్తులు ప్రదర్శించిన బీజేపీ, తెదేపా, వైకాపాలు విభజన పాపం కాంగ్రెస్ పార్టీదేనని దుష్ప్రచారం చేసి ఎన్నికలలో లబ్ధి పొందాయి. వైఎస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతో కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ వైకాపాకు బదిలీ అయ్యాయి. చంద్రబాబుకు అనుభవం ఉంది.. ఉద్ధరిస్తారన్న ఊహతో, ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన హామీలను విశ్వసించిన ఓటర్లు రాష్ట్రంలో తెదేపా వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత అటు కేంద్రంలో, ఇటు అసెంబ్లీలో మంత్రిపదవులను తీసుకోవడం ద్వారా బీజేపీ-టీడీపీలు అధికార మత్తులో మునిగిపోయాయి. నాలుగేళ్లు గడిచాయి… ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలుపై చిలక పలుకులే తప్ప ఆచరణలో చేసిందేమీ లేదు. ఈ విషయంలో రెండు పార్టీలు దోషులే. హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామని బీజేపీ చెబితే.. దానికి తెదేపా సై అంది. రాష్ట్రం అన్యాయమైపోతోందని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు నెత్తీ నోరు కొట్టుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు. పైగా ఉద్యమించిన వారిపై అక్రమ కేసులు బనాయించారు. జైళ్లలో పెట్టించారు.
అభిప్రాయం
ఇక పాలనాపరంగా జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. ఇక మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున విభజనకు ముందు నక్క జిత్తులతో ప్రజలను నయవంచనకు గురిచేసిన పార్టీలే హోదా రాగాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు, రానున్న ఎన్నికలలో లబ్ధి పొందేలా ప్రజలను వంచించేందుకు అవిశ్వాస డ్రామాలకు తెర లేపాయి. ఒకరు అసెంబ్లీ నుంచి, మరొకరు పాదయాత్ర ద్వారా ప్రజలను వంచించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక పక్క లోక్‌సభలో అవిశ్వాసానికి నోటీసు ఇచ్చి, మరోపక్క తెరవెనుక దగాకోరు బీజేపీతో రాజీ, లాలూచీ మంతనాలు జరుపుతున్నారు. ఎన్నికల వరకే వీరి తాపత్రయం ఆ తరువాత వీరి పాత్రలు అమాంతం మారిపోవడం తథ్యం. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రపద్రేశ్ పట్ల మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకున్నది. అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఆం.ప్ర.కు మోడీ సర్కారు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు సిద్ధమైంది. గడచిన నాలుగేళ్లలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ హక్కులు, విభజన చట్టం అమలుపై పార్లమెంటులో, వెలుపలా చిత్తశుద్ధితో పోరాడుతూ వచ్చింది. పార్లమెంటులో తెదేపా, వైకాపా ఎంపీలు దిష్టి బొమ్మలుగా మారితే రాజ్యసభలో డా.కేవీపీ రామచంద్రరావు ఒంటరి పోరాటం చేశారు. హోదాపై కుంటిసాకులు చెబుతున్న మోడీ సర్కారు మెడలు వంచడానికి ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టి ఆం.ప్ర.కు బీజేపీ చేస్తున్న అన్యాయంపై జాతీయ స్థాయిలో చైతన్యం తీసుకువచ్చిన సంగతి మరువరాదు.
దేశంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, నిత్యావసర ధరల తగ్గింపు, అవినీతి అంతం, నల్ల ధనం వెలికితీత, రైతుల ఆదాయం రెట్టింపు, ఆం.ప్ర.కు ఢిల్లీని మించిన రాజధాని నిర్మాణం, విభజన చట్టం పకడ్బందీగా అమలు వంటి ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కడంతోపాటు పెద్దనోట్ల రద్దు, అడ్డగోలుగా జిఎస్టి అమలు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపు ద్వారా ప్రజలపై పెను భారాలు మోపిన, ఉపాధి కల్పించకపోగా ఉన్న ఉపాధిని ఊడగొట్టిన మోడీ సర్కారు పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబుకుతున్నది. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న వేలాది కోట్ల రూపాయల బ్యాంకు కుంభకోణాలు ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. ప్రజల పొదుపు సొమ్మును అంబానీలు, ఆదానీల వంటి కార్పొరేట్లకు దోచిపెట్టడమే ధ్యేయంగా మోడీ సర్కారు పనిచేస్తున్నది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారికి మోడీ సర్కారు గులాం గిరీ చేస్తున్నది. దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం మోడీ, అమిత్ షా ద్వయం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించడం, తమను వ్యతిరేకిస్తున్న రచయితలను మట్టు బెట్టిస్తున్న తీరు చూసి యావత్తు దేశం కలవరపాటుకు గురవుతున్నది. దేశానికి వెన్నెముకగా వున్న వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడింది.. లక్షల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దుందుడుకు విదేశాంగ విధానం ద్వారం శాంతి కాముకంగా వున్న భారతదేశానికి అపకీర్తి మూటగట్టడం జరిగింది. యుద్ధ విమానాల కొనుగోలులో సైతం అవినీతి చోటుచేసుకున్నది. అవినీతిపరులకు అప్పాయింట్ మెంట్ ఇచ్చి గంటల తరబడి చర్చలు సాగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆం.ప్ర.కు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంటులో నోరు మెదిపిన పాపాన పోలేదు. ఈ విధంగా చెబుతూ వుంటే మోడీ సర్కారు వైఫల్యాలు అన్నీ ఇన్నీ కావు.. దేశంలో అన్ని వర్గాల ప్రజలు మోడీ సర్కారుపై వ్యతిరేకతతో వున్నారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ వైపే చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా మోడీ మాయలను అర్థం చేసుకున్న ప్రజానీకం 2019లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఒకటి రెండు రాష్ట్రాలలో మినహా కాంగ్రెస్ పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్లో సైతం కాంగ్రెస్ పార్టీపై సానుభూతి వున్నది.
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆం.ప్ర.కు ప్రత్యేక హోదా లభిస్తుంది. విభజన చట్టం అమలవుతుంది. పోలవరం సహా ఇతర ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతుంది. ఈమేరకు ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలలో సైతం తీర్మానించడం కూడా జరిగింది.
మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రానికి బీజేపీ-టీడీపీ కలిసి చేసిన అన్యాయం, ప్రతిపక్ష వైకాపా, నిన్న గాక మొన్న కళ్లు తెరిచి పిల్లి మొగ్గలేస్తున్న జనసేన వైఖరుల గురించి ఇప్పుడు ప్రజలలో ఎవరూ ఊహించని రీతిలో స్పష్టమైన అవగాహన ఉన్నది. ఆయా పార్టీలకు గుణపాఠాలు నేర్పడానికి వారు సిద్ధంగానే వున్నారని నేను విశ్వసిస్తున్నా.
ఆం.ప్ర.కు ప్రత్యేక హోదా ఇవ్వడం సహా విభజనచట్టం అమలు చేయకుండా నాటకాలాడుతున్న మోడీ సర్కారు, ఈ విషయమే గాక పాలనా పరంగా దేశాన్ని భ్రష్టు పట్టించిన తన అసమర్థత ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకుండా పారిపోతున్నది. సభలో తీవ్ర గందరగోళం వున్నప్పటికీ ఆర్థిక బిల్లు సహా అనేక బిల్లులను ఆమోదింపచేసిన వారు అవిశ్వాసంపై చర్చకు సభ ఆర్డర్‌లో వుండాలని కుంటి సాకులు చెబుతున్నారు. తమకు లొంగిపోయిన టిఆర్‌ఎస్, ఎఐఎడిఎంకె వంటి పార్టీలను కమలనాథులు సభలో గందరగోళం సృష్టించడానికి వాడుకుంటున్నారు.
చివరకు మోడీ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల ముందు ఆం.ప్ర.కు ప్రత్యేక హోదా ప్రకటించినా, రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీతో జట్టు కట్టినా హోదా అమలు చేస్తుందన్న నమ్మకం మాత్రం లేదు. ఆం.ప్ర.కు న్యాయం చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది.
– కొలనుకొండ శివాజీ
ఏఐసీసీ సభ్యులు, ఏపీసీసీ అధికార ప్రతినిధి
ఫోన్ : 9866200463