- అఖిలపక్షం ప్రజల ప్రయోజనాల కోసమా ? టిడిపి ప్రయోజనాల కోసమా ?
- రాష్ట్రం అంటే అమరావతి మాత్రమే కాదు,రాయలసీమ కూడా !
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అఖిలపక్షం నిర్వహించనున్నారు. ఈ అఖిలపక్షానికి రాజకీయ పార్టీలతో బాటు కొన్ని సంస్థలను కూడా పిలుస్తున్నట్లు ప్రకటించారు. ఎవరిని పిలిచినారు, పిలిచిన వారిలో వచ్చేది ఎందరు అన్నది మరి కొంత సమయం తర్వాత తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం అని ప్రజల నిధులతో సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి అందులో రాయలసీమ కూడా ఒకటి ఉందని మరిచారా ? తన ప్రాధాన్యతలో లేదు కాబట్టి రాయలసీమ సంస్థలను పిలవలేదు అనుకోవాలా ? అంతే కాదు, తప్పదు కాబట్టి రాజకీయ పార్టీలను పిలిచినా కొన్ని సంస్థలను అంటే హోదా ముసుగులో బాబు ప్రయోజనాలు, అమరావతి ప్రయోజనాల కోసం పనిచేసే వారిని పిలవడంలో మాత్రం బాబు మార్కు రాజకీయం అర్థం అవుతుంది.
రాజకీయ ప్రయోజనాల కోసమా ? రాష్ట్రం కోసమా ?
రాష్ట్రప్రయోజనాల కోసం పని చేస్తూ అందులో భాగంగా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తే తప్పులేదు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం ప్రయోజనాలు అనడం మాత్రం అంగీకారం కాదు. నేడు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు అలానే ఉంది. ఇంత కాలం కేంద్రంతో సావాసం చేసి నేడు అకస్మాత్తుగా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. తాను కేంద్రాన్ని బలపరిచిన రోజు అందరూ బలపరచాలి. తాను వ్యతిరేకించిన రోజు అందరూ వ్యతిరేకించాలి. ఇదీ బాబు దృష్టిలో ప్రజల ప్రయోజనాలు. కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయం గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఒకే రకంగా ఉంది. ప్రారంభంలో ఒక రకంగా ఇపుడు మరో రకంగా లేదు. మరి బాబు మాత్రం నాడు కేంద్రంతో సావాసం చేయాలి అనుకున్నారు కాబట్టి వారు బాగానే చేస్తున్నారు అన్నారు. నేడు వారితో రాజకీయంగా దూరం కావాలి అనుకున్నారు కాబట్టి వారు చేస్తున్నవన్నీ బాగాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బాబు రాజకీయ ప్రయోజనాలే రాష్ట్రప్రయోజనాలు.
కడప ఉక్కుకోసం పోరాడుతున్నఉక్కుసాధన సమితి ప్రవీణ్ కుమార్ రెడ్డిని, కమ్యూనిస్టు రవిశంకర్ రెడ్డి నీటి హక్కలు కోసం పోరాడుతున్న బొజ్జా ధశరథ రామిరెడ్డిని అఖిల పక్ష సమావేశానికి ఎందుకు పిలవలేదు.
ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి మాత్రమేనా ? అందులో రాయలసీమకు స్థానం లేదా ?
ఆంధ్రప్రదేశ్ అంటే 13 జిల్లాలు. కానీ బాబు దృష్టిలో నాలుగు జిల్లాలు మాత్రమే. మరీ ముఖ్యంగా రాయలసీమకు అందులో స్థానం లేదు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా వారి పాలనా విధానాలు కూడా అలానే ఉన్నాయి. చివరకు కేంద్రం రాష్ట్రంకు చేయాల్సిన సాయాన్ని అడగడంలో కూడా వివక్ష. విభజన చట్టంలో 13 జిల్లాల ప్రయోజనాలు ఉన్నాయి. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ, కడప ఉక్కు, గుంతకల్లుకు రైల్వేజోన్, నెల్లూరు జిల్లాలో ఓడరేవు లాంటి అంశాలు ఉన్నాయి. అమరావతి రాజధాని, పోలవరం హక్కుగా ఉంటే ప్రత్యేక హోదా రాజకీయ హమీగా ఉంది. కానీ ముఖ్యంమంత్రి మాత్రం తన పోరాటాన్ని అమరావతికి సాయం, పోలవరం, హమీగా ఉన్న హోదా చుట్టే చేస్తున్నారు. మర్యాద కోసం లేదా వారి అంతర్గత అజండాల సాధన కోసం రాయలసీమ విషయాలు మాట్లాడుతారు. నిజానికి పోలవరం , రాజధాని విషయాలు ఒక రూపానికి వచ్చినాయి కానీ రాయలసీమ, ఉత్తరాంద్ర, నెల్లూరు జిల్లా విషయాలు అసలు కొలిక్కి రాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయాలపై దృష్టి పెట్టకపోవడం వివక్షలో బాగమే.
అఖిపక్షం నిర్వహణలోనూ వివక్ష, రాజకీయమేనా ?
ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి ప్రజల నిధలతో నిర్వహించే అఖిలపక్షం కూడా రాజకీయ ప్రయోజనాలతో బాటూ సీమ పట్ల వివక్ష కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అఖిలపక్షం వేయమని గడిచిన నాలుగు సంవత్సరాలుగా పార్టీలు, సంస్థలు అడుగుతున్నాయి. కానీ ఆ వూసే ఎత్తని ముఖ్యమంత్రి నేడు అఖిలపక్షం అనడం రాజకీయం కాక మరేమౌతుంది. అంతే కాదు ఆ సమావేశానికి ప్రతి రాజకీయ పార్టీనీ పిలవడం తప్పదు కాబట్టి అందరినీ పిలిచినారు. కానీ సంస్థల పేరుతో పిలిచిన వారిని పరిశీలిస్దే మాత్రం కచ్చితంగా తమకు అనుకూలంగా ఉన్నవారిని మాత్రమే పిలిచినారు అనిపిస్తుంది. పత్రికల ద్వారా అందుతున్న సమాచారం మేరకు తనకు అనుకూలంగా వ్యవహరించే చలసాని, శివాజి, అశోక్ బాబు లాంటి వారిని పిలిచినట్లు అర్థం అవుతున్నది. అదే సందర్భంలో నాడూ నేడు సమైక్యాంధ్ర కోసం, హోదా కోసం మాట్లాడుతున్న జన చైతన్య వేదిక లాంటి సంస్థలను కనీసం పట్టించుకోలేదు. రాష్ట్రం కోసం మాట్లాడుతున్న ఐ వై ఆర్ లాంటి వారిని కూడా పిలవలేదు. వారు రాజకీయంగా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తుండవచ్చు కానీ నిర్వహిస్తున్నది ప్రజల నిధలతో, ముఖ్యమంత్రి హోదాలో అన్న విషయం మరవకూడదు.
విభజన చట్టం అమలు కోసం, రాయలసీమ ప్రయోజనాల కోసం అనునిత్యం పని చేస్తున్న రాయలసీమ ఉద్యమ సంస్థలను మాత్రం కనీసం పట్టించు కోకపోవడం అన్యాయం. పోనీ పిలిచిన వారు గొప్ప పోరాటాలు చేసిన వారా? చలసాని, శివాజి లు పార్టీలు పిలిచిన చోట కనిపిస్తారు. నిత్యం కనిపించేది మాత్రం అమరావతి ఆధిపత్య మీడియాలో మాత్రమే. కానీ రాయలసీమలో విభజన చట్టంలో బాగంగా ఉన్న కడప ఉక్కు కోసం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రవిశంకర్ రెడ్డి నాయకత్వంలో 234 రోజులుగా నిరవదిక ఆందోళన చేస్తున్నారు. అదే విషయంగా కడప ఉక్కు సాదన సమిత పేరుతో ప్రవీణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అనేక పోరాటాలు నడిపినారు ఈ రెండు ఆందోళనలలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. విబజన చట్టంలో హక్కుగా ఉన్న నిటి ప్రాజెక్టుల కోసం కర్నూలు కేంద్రంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి బొజ్జా ధశరదరామి రెడ్డి నాయకత్వంలో అనేక ఆందోళనలు జరిగాయి, జరుతూనే ఉన్నాయి. గరిష్టంగా 25 వేల మంది రైతులు పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఇక విద్యార్ది సంఘాలు గుంతకల్లు రైల్వే జోన్ కోసం, విభజన చట్టం అమలు కోసం, లాయర్లు హైకోర్టు కోసం అను నిత్యం పోరాడుతూనే ఉన్నారు. వేల సంఖ్యలో ప్రజలు విద్యార్దులు పాల్గొన్నారు. జస్టీస్ లక్ష్మణ రెడ్డి , హనుమంత రెడ్డి లాంటి వారు కూడా ముఖ్యమంత్రి గారికి కనపడక పోవడం వారు రాయలసీమ వారు కావడమే. రాయలసీమ షోషల్ మీడియా, విద్యావంతుల వేదిక, రాయలసీమ మేధావుల పోరం లాంటి అనేక సంస్దలు ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు అనునిత్యం చేస్తూనే ఉన్నాయి. ప్రజలతో జరుగుతున్న పోరాటాలు ముఖ్యమంత్రి గారికి కనపడ లేదా ? ఇష్టం లేదా ? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. రాయలసీమ వారిని పిలిచితే బహుశా వారు కేంద్రం చేయాల్సిన విషయాలతో బాటూ కేంద్ర ప్రభుత్వం సీమకు ఇచ్చిన నిదులను ఎందుకు ఖర్చు చేయడం లేదు అని అడుగుతారన్న భయభావం కావచ్చు. రైల్వే జోన్ లాంటి విషయంలో చట్టం ఏమి చెపుతున్నది మీరు చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నిస్తారని ఆందోళన కావచ్చు. లేదా వివక్ష కావచ్చు. ఏ కారణం చేత పిలవక పోయినా ప్రభుత్వ వైఖరి మాత్రం అభ్యంతరకం. వివక్షతో కూడిన రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటం నేటి సీమ ప్రజల కర్తవ్యం.
-యం. పురుషోత్తంరెడ్డి
రాయలసీమ మేధావుల పోరం
తిరుపతి. 9490493436