అధికార టిఆర్ఎస్ పార్టీకి పాలమూరులో గట్టి షాక్ తగిలింది. టిఆర్ఎస్ పార్టీకి చెందిన జెడ్పీటిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంఘటన పాలమూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వివరాలిలా ఉన్నాయి.
అచ్చంపేట నియోజకవర్గoలోని బల్మూర్ మండలానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ ధర్మనాయక్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ధర్మా నాయక్ కాంగ్రెస్ లో చేరారు. డికె అరుణ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. ధర్మా నాయక్ తో పాటు ఆయన అనుచరులు 50 మంది టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో డికె అరుణ మాట్లాడుతూ టిఆర్ఎస్ అవలంభిస్తున్న విధానాలతో జనాలు విసిగిపోయారన్నారు. ఆ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు. అందుకే ఆ పార్టీలో ఉండలేక పెద్ద సంఖ్యలో లీడర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు.
స్థానిక మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్రమాలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో గువ్వల బాలరాజును చిత్తు చిత్తుగా ఓడించడం ఖాయమన్నారు.
ఇదిలా ఉంటే.. ధర్మా నాయక్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే జెడ్పీటిసిగా గెలిచారు. కానీ రాజకీయ వత్తిళ్ల కారణంగా టిఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా తిరిగి ఆయన సొంతగూడు కాంగ్రెస్ పార్టీలోకే చేరారు. సొంతగూటికి చేరిన సందర్భంగా ధర్మా నాయక్ ఏమన్నారో పైన వీడియో ఉంది చూడండి.