దక్షిణాది రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కించుకోవటంకోసం బీజేపీ ఒక భారీ కుట్ర పన్నిందంటూ నటుడు శివాజీ బయటపెట్టిన ‘ఆపరేషన్ గరుడ’ వ్యవహారం తుస్సుమంటూ తేలిపోయింది. అతను నిన్న చెప్పిన వివరాల ప్రకారం ఇవాళ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పై చర్చ జరగాలి. ఈ చర్చకోసం బీజేపీ ఆరుగురు ఎంపీలను సిద్ధం చేసిందని, ఆ ఆరుగురు ఎంపీలలో ముగ్గురు ఇంగ్లీష్ లోనూ, ముగ్గురు తెలుగులోనూ మాట్లాడతారని శివాజీ నిన్న చెప్పారు. అతి సూక్ష్మమైన సమాచారంతో సహా జరగబోయేది ఇదేనంటూ బొమ్మ చూపించారు. అయితే ఆయన చెప్పినట్లుగా పార్లమెంట్ లో ఏమీ జరగలేదు. గత మూడురోజులుగా జరుగుతున్నట్లుగానే లోక్ సభ లో గొడవ జరుగుతుండటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. దీనితో శివాజీ నిన్న చెప్పిన రు. 4,800 కోట్ల కుట్రసిద్ధాంతమంతా పిట్టలదొర కథలా మిగిలిపోయింది.
నిన్న ఒక వైట్ బోర్డ్, మార్కర్ పెన్ తో దాదాపు అరగంటసేపు శివాజీ మీడియాకు ఒక పక్కా తెలుగు పొలిటికల్ సినిమా చూపించారు. ఈ స్క్రిప్టు ప్రకారం – ఆ సినిమాలో ఒక హీరో, ఒక మెయిన్ విలన్, ఇద్దరు సైడ్ విలన్లు ఉంటారు. దీనిలో చంద్రబాబు నాయుడు హీరో కాగా, మోడి మెయిన్ విలన్, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి సైడ్ విలన్లు. ఆయన చెప్పిన మొత్తం విషయాన్ని స్థూలంగా చూస్తే – జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికోసం ఎంతకైనా తెగించబోతున్నారని, తెలుగుదేశం పార్టీని బలిపశువును చేసి బీజేపీ ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోబోతోందని సారాంశం. విచిత్రమేమిటంటే, ఇదే స్క్రిప్టును చంద్రబాబు నాయుడు కొద్దిరోజుల క్రితం సాక్షాత్తూ అసెంబ్లీలోనే చదివి వినిపించారు. తనను అణచివేయటానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ, ప్రత్యేకహోదాకోసం పోరాడుతున్న తనపై విమర్శల దాడిచేస్తే తెలుగుజాతిపై దాడిచేయటమేనన్నట్లుగా చెప్పుకొచ్చారు. నిన్న శివాజీ అదే రాగాన్ని మరింత విస్తృతంగా ఆలపించారు. శివాజీ ఈ స్క్రిప్టుద్వారా ఏ రాజకీయపార్టీకి లబ్ది చేకూర్చాలనుకుంటున్నాడో, ఏ నాయకుడిని ఉన్నతస్థాయిలో చూపాలనుకుంటున్నాడో చూస్తే అతని మాటలవెనక ఆంతర్యం అర్థం చేసుకోవటం పెద్ద కష్టమేమీకాదు.
ఇక్కడ శివాజీ నేపథ్యం గురించి, అతని రాజకీయ ప్రాధాన్యతలు, ఆసక్తుల గురించి ఒక్కసారి చెప్పుకోవాలి. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన శివాజీ చౌదరి జెమిని టీవీలో వీడియో ఎడిటర్ గా చేస్తుండేవారు. ఒక పాటల ప్రోగ్రామ్ కు ఒకరోజున యాంకర్ రాకపోవటంతో నిర్వాహకులు మాటకారి అయిన శివాజీనే యాంకర్ ను చేశారు. అక్కడనుంచి సినిమారంగంలోకి ప్రవేశించారు. హీరో స్నేహితుడి వేషాలతోబాటు సీగ్రేడ్ హీరో వేషాలుకూడా వేస్తుండేవారు. అయితే గత కొన్నేళ్ళుగా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఒక టివి చానెల్ సిఇవొ తో సాన్నిహిత్యం కలిగిఉన్న శివాజీ, ఆయన సలహానో, సొంత ఆలోచనో తెలియదుగానీ అర్జెంటుగా ఒక అగ్రనేతగా అవతరించాలని నిర్ణయించుకున్నారు. దానికి ప్రత్యేకహోదా అనే మార్గాన్ని ఎంచుకున్నారు. విచిత్రమేమిటంటే ఈయన ఎవరినైతే నిన్న విలన్ గా చూపాలనుకుని ప్రయత్నించాడో ఆ పవన్ కళ్యాణ్ లాగానే ఈయనకూడా పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తుంటాడు. అయితే ఎందుకోగానీ, పవన్ కళ్యాణ్ అంటే ఈయనకు పడదు. ఒంటికాలిమీద లేచి మండిపడుతుంటాడు. పేరు ఎత్తకుండా తీవ్రవిమర్శలు, ఆరోపణలు చేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ కంటే తానే పెద్ద ఉద్యమనేతనని రుజువుచేసుకోటానికి ప్రయత్నిస్తుంటారు. జగన్ పై కూడా పేరు ఎత్తకుండా తీవ్ర విమర్శలు చేస్తుంటాడు. ఈయనకు స్వయంప్రకటిత మేథావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ జోడీ. ప్రత్యేకహోదా అనే సమస్య విషయంలో తామిద్దరం మాత్రమే ఛాంపియన్లం అని బిల్డప్ ఇవ్వటానికి ప్రయత్నిస్తుంటారు. ప్రత్యేకహోదాపై అనేసార్లు మాటమార్చిన తెలుగుదేశంపార్టీని వీరిద్దరూ ఇంతవరకు ఒక్కసారికూడా పల్లెత్తు మాట అనకపోవటం విశేషం. పైగా ఎక్కడైనా చంద్రబాబునాయుడు ప్రస్తావన వస్తే ఆయనను ఆకాశానికెత్తుతూ ఉంటారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఏ అవకతవకలపైగానీ, ఏ అవినీతి ఆరోపణలపైగానీ మాటమాత్రం మాట్లాడరు, పైగా పవన్ కళ్యాణ్ ఇటీవల టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం దేశద్రోహం అనే స్థాయిలో దుయ్యబట్టారు. దీనిని బట్టి ఈయన ఎవరికి అనుకూలంగా ఈ స్క్రిప్టును రూపొందించారో తెలుసుకోవచ్చు.
మరోవైపు శివాజీ పేర్కొన్న కుట్రపై ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఆపరేషన్ గరుడ పెద్ద కాశీమజిలీ కథ అని ఇవాళ పూర్తిగా తేలిపోయిందని అన్నారు. దానిలో చెప్పినవన్నీ గండికోట రహస్యం, జ్వాలాద్వీప రహస్యం వంటి పాత జానపద చిత్రాలలోనే జరుగుతాయని, వాస్తవ ప్రపంచంలో జరగవని చెప్పారు. దీనిగురించి ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరంలేదని, లైట్ గా తీసుకోవాలని సూచించారు. దీనిని కేవలం జానపదచిత్రంలాగా తీసుకుని ఆనందించాలని కోరారు.
కొసమెరుపు: ఈయన గతంలో ప్రత్యేకహోదాపై విశాఖపట్నంలో ఒక సదస్సు నిర్వహిస్తే అక్కడ జరిగిన ఒక ప్రహసనాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు ఏ పార్టీపై ఈయన తీవ్ర ఆరోపణలు చేశారో, ఆ బీజేపీని ఆ సదస్సులో కొందరు విమర్శించగా, వారికి, శివాజీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనితో అక్కడనుంచి శివాజీ పలాయనం చిత్తగించిన వైనాన్నిఇక్కడ మీరే చూడండి.
(శ్రవణ్ బాబు, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్, ఫోన్ నెం.9948293346)