రాయలసీమ లో హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఉద్యమం అనంతపురం జిల్లాలో ఊపందుకుంటూ ఉంది. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ విమోచన సమితి మరియు రాయలసీమ ప్రజా సమితి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనంతపురం పాత ఊరు పద్మావతి ఫంక్షన్ హాల్లో సమావేశం జరిగింది.
ఈ సంధర్భంగా రాయలసీమ విమోచన సమితి కన్వీనర్ రాజ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తొలినుంచి రాయలసీమ కు పాలకులెవరైనా అన్యాయమే చేస్తున్నారని విమర్శించారు.
శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని అన్నారు. రాయలసీమ కు 400 టీఎంసీల నికరాజలాలు ఇవ్వాలని ఈ విషయం కబుర్లు చెప్పి కాలయాపన చేస్తే వూరుకునేది లేదని ఆయన హెచ్చరిక చేశారు.
గుంతకల్ రైల్వేజోన్ ఏర్పాటుచేయాలని, ఇపుడు జిల్లాలో నిర్మాణమవుతున్న కియా మోటర్స్ లో జిల్లా వాసులకే ఉద్యోగాలు ఇవ్వాలని అపుడే జిల్లాకు ప్రయోజనమని ఆయన అన్నారు.
ఎయిమ్స్ హాస్పిటల్ ,సెంట్రల్ యూనివర్సిటీ లను విభజన చట్టం హామీ ప్రకారం అనంతపురం లొనే ఏర్పాటు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం రాజశేఖర్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్వీఎస్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి,రాయలసీమ ప్రజా సమితి అధ్యక్షుడు కెఎం ఎల్ నరసింహులు,వికలాంగుల సంక్షేమ సంగం అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్డి,భార్గవ్ ,మురళి కృష్ణ,కేదార్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.