పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన అసత్యాలు, అవాస్తవాలన్నింటినీ బయటపెట్టబోతున్నానని కొన్నిరోజులుగా చెబుతూ వస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఎట్టకేలకు ఇవాళ ఆ పనిని విజయవంతంగా నిర్వర్తించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక వెబ్ సైట్ల నుంచి, అధికారిక సమావేశాల మినిట్స్ నుంచి పకడ్బందీ సమాచారం సేకరించి, మీడియాకు ఆ కాపీలను పంచి చంద్రబాబు పరస్పర విరుద్ధంగా ఎలా మాట్లాడుతున్నారో నిరూపించారు.
1. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం – పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం భుజానికెత్తుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బాధ్యతను తాము కావాలని తీసుకోలేదని, కేంద్రప్రభుత్వం సూచనమేరకే తీసుకున్నామని కొన్నిరోజులుగా చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ఇది పూర్తిగా పచ్చి అబద్ధమని తేలింది. ప్రాజెక్టును తామైతేనే త్వరగా చేయగలమని రాష్ట్రప్రభుత్వం కోరిందని, ఆ అభ్యర్ధనను నీతి ఆయోగ్ పరిశీలనకు పంపామని, వేగంగా చేస్తానన్నారుకాబట్టి వారికి ఇవ్వటమే మేలని నీతి ఆయోగ్ సిఫార్స్ చేయటంతో రాష్ట్రప్రభుత్వానికి ఇస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పంపిన లేఖ(సెప్టెంబర్ 30వ తేదీ, 2016) కాపీని ఉండవల్లి మీడియాసాక్షిగా బయటపెట్టారు. ఈ లేఖను అరుణ్ జైట్లీ ఇటీవల ప్రత్యేకహోదాపై మాట్లాడిన ప్రెస్ మీట్ లో కూడా చదివినట్లు ఉండవల్లి గుర్తుచేశారు. ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం నిర్మించాల్సిఉండగా, తామే కడతామంటూ చంద్రబాబు పట్టుపట్టి దానిని సాధించటం వెనక ఆంతర్యమేమిటో అందరూ తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చని అన్నారు.
2. నవయుగ కంపెనీకి పనులు అప్పగించటం – రాష్ట్రప్రభుత్వం ఈ కాంట్రాక్టును నవయుగ కంపెనీకి ఇచ్చింది. ఆ కంపెనీకి ఇవ్వటానికి కారణంపై మాట్లాడుతూ, వారు నష్టానికి సిద్ధపడే ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని, కేవలం పేరు ప్రతిష్ఠలకోసమే ఈ పనిని చేస్తున్నారని, పాతరేట్లకే పనిచేయటానికే వచ్చారని చంద్రబాబునాయుడు గతంలో చెప్పారు. అయితే నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ దానికి విరుద్ధంగా మాట్లాడారు. నవయుగకు కాంట్రాక్టును ఇచ్చింది సంబంధింత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అని అన్నారు. నవయుగ కంపెనీకి నిర్మాణ బాధ్యతను తాము అప్పగించలేదని, వారికి గడ్కరీయే కాంట్రాక్టును కేటాయించారని చెప్పుకొచ్చారు. దీనికితోడు, నవయుగవారు 2013-14 రేట్ల ప్రకారం చేయవలసి ఉండగా 2017-18 రేట్ల ప్రకారం చేయటానికి(అంచనాల పెంపుకు) రాష్ట్రప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని, ఇది దారుణమని ఉండవల్లి అన్నారు.
ఇవే కాదని, ప్రత్యేకహోదాపైకూడా చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలాడుతున్నారని ఉండవల్లి ఆరోపించారు. గతంలో హోదా అవసరంలేదు అని నిండుసభలోనే చెప్పిన ముఖ్యమంత్రి, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకహోదాకోసం పోరాడుతున్న తనపై అవినీతి ఆరోపణలు చేస్తే ఆంధ్రులకు అన్యాయం చేసినట్లేనని అనటం దారుణమని ఉండవల్లి చెప్పారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని, ఉంటే, పార్లమెంటులో గొడవ చేస్తున్న ఇతరపార్టీల అధినేతలతో మాట్లాడి వారి ఆందోళనను విరమింపజేసేవారని అన్నారు.
ఇటీవల చంద్రబాబు కొన్ని ఇంటర్వ్యూలలోకూడా అబద్ధాలు చెప్పారని ఉండవల్లి చెప్పారు. తాను ఇందిరాగాంధినే ఎన్నికల్లో ఎదిరించి నిలిచానని చంద్రబాబు చెబుతున్నారని, కానీ టీడీపీ ఇందిరాగాంధిని ఎదుర్కొన్నది 1983 ఎన్నికల సమయంలోనని, ఆ సమయంలో బాబు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడని, ఆ విషయాన్ని ఆయన ఇప్పుడు మర్చిపోయినట్లున్నారని అన్నారు. ఇటీవల మరో ఇంటర్వ్యూలో 1978లో రాజశేఖరరెడ్డికి తానే టికెట్ ఇప్పించానని చెప్పారని, అయితే అసలు ఆ సమయంలో చంద్రబాబు ఇందిరాకాంగ్రెస్ లో ఉంటే, రాజశేఖరరెడ్డి రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారని, ఇందిరాకాంగ్రెస్ లో ఉండి రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న వైఎస్ కు టిక్కెట్ ఇప్పించటమేమిటో అర్థం కావటంలేదని ఉండవల్లి ఎద్దేవా చేశారు. అద్వానీ, కరుణానిధి, ములాయం, శరద్ పవార్ వంటి ఎందరో సీనియర్ నాయకులుండగా దేశంలోకెల్లా తానే సీనియర్ రాజకీయనేతనని బాబు చెప్పుకుంటున్నారని గుర్తుచేశారు. చంద్రబాబుకు చిత్తభ్రమ ఏర్పడినట్లుగా ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
(శ్రవణ్ బాబు సీనియర్ జర్నలిస్టు. ఫోన్ నెం.9948293346)