పార్లమెంటులో చర్చ సందర్బంగా మిగిలిన రాష్ట్రాలు తమకూ హోదా కావాలని అడిగితే, ఆ పేరుతో పరిశీలిస్తామని కేంద్రం తప్పించుకుంటే…
బిజెపి నాయకత్వంలోని కేంద్రప్రభుత్వంపై టిడిపి, వైసిపి లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడంతో రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. రెండు సందర్భాలలో ప్రభుత్వాలపై అవిశ్వాస తీర్మానాలను ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. 1. అధికార పార్టీ బలంలో మార్పులు వచ్చినపుడు. 2. ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చినపుడు సంఖ్యాబలంతో సంబంధం లేకుండా నిరసన తెలపడం కోసం. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ గ ప్రభుత్వ మెజారిటీ విషయంలో ఎవరికి అనుమానాలు లేవు. ఏపీ లో జరుగుతున్న పరిణామాలతో కేంద్రం పై తీవ్ర నిరసనను తెలపడానికి మాత్రమే అవిశ్వాసం ప్రస్తుతం జరుగుతున్నది. కారణం రాష్ట్ర ప్రయోజనాలే అయినా అవిశ్వాస తీర్మాణం రాష్ట్రప్రజలకు లాభం చేకూరుస్తుందా ? రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహలతో నష్టం తెస్తుందా ? అనేది చర్చించాల్సిన విషయం.
టిడిపి , వైసిపి లు పెడుతున్న అవిశ్వాసానికి హేతుబద్ధత ఉందా ?
టిడిపి, వైసిపి లు బిజెపి ప్రభుత్వంపై పెడుతున్న అవిశ్వాస తీర్మాణానికి హెతుబద్ధత ఉందా అన్నది అసలు ప్రశ్న. అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రతిపక్షం తీవ్ర నిరసనను తెలపడానికి ఎంచుకునే మార్గాలలో అవిశ్వాసం ఒకటి. 2014 విభజన ద్వారా ఏపీ ప్రజలకు కేంద్రం ఇచ్చిన హమీలు రెండు 1. విబజన చట్టం, 2. ఎన్నికల హమీగా ప్రత్యేక హోదా. మొదటిది చట్టం అయితే రెండవది హమీ. ఎన్నికలలో ఇచ్చిన హమీని ఉల్లంఘించినపుడు కూడా అవిశ్వాసం పెట్టవచ్చు. కానీ చట్టం అమలుకానపుడు పెట్టే తీర్మాణానికి ఉన్న విశ్వసనీయత ఎన్నికల హమీపై ఉండదు. అది కూడా జాతీయ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశ పెట్టేటపుడు కచ్చితంగా అది జాతీయ అంశాలను ప్రభావితం చేసేవి గా ఉండాలి. కానీ నేడు ప్రవేశ పెడుతున్న తీర్మాణం ఏపీకి ఎన్నికల హమీగా ఇచ్చిన హోదా కోసం. విభజన చట్టం కూడా ఏపీ ప్రయోజనాలే కావచ్చు కానీ అందులో తెలంగాణ ప్రయోజనాలు కూడా ఉంటాయి. అలా విభజన చట్టం అమలు చేయనందుకు వ్యతిరేకంగా ప్రవేశ పెట్టే తీర్మాణానికి తెలంగాణ సమాజం కూడా మద్దతు ఇస్తుంది. అంతేకాదు పార్లమెంట్ చేసిన తీర్మాణాన్ని ఉల్లంఘించడం తీవ్రమైన నేరం కూడా. ప్రయోజనం ఒక రాష్ట్రానికి సంబందించిన విషయం అయినా తాను చేసిన చట్టాన్ని కేంద్రం ఉల్లంగించడం మూలంగా ఒక రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను నిరాకరించడం ఫెడలర్ విధానానికి తూట్లు పొడవటమే అవుతుంది. అది దేశ సమగ్రతకే ముప్పు అవుతుంది. ఆ కోణంలో అది దేశ సమస్యగా మారుతుంది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం విభజన చట్టం అమలులో వైఫల్యానికి నిరసనగా అవిశ్వాసం అని కాకుండా హోదా ఇవ్వనందుకు నిరసనగా అవిశ్వాసం పెట్టడం అర్థంలేని చర్య.
హోదా పై అవిశ్వాసం పెడితే కేంద్రం తప్పించుకునే అవకాశం…
విభజన చట్టం అమలుపై అవిశ్వాసాన్ని ప్రవేశ పెడితే ఉభయ తెలుగు రాష్ట్రాలకు మాత్రమే ప్రయోజనం కలిగినా అవి మరో రాష్ట్రానికి నష్టం కాదు. కానీ హోదా ఒక అంశాన్ని మాత్రమే ప్రాతిపదికన అవిశ్వాసం జరిగితే మరిన్ని కొత్త సమస్యలు వస్తాయి. నేడు బిజెపి ప్రభుత్వం మీద రాజకీయ కారణంతో చాలా రాజకీయ పార్టీలు టిడిపి, వైసిపి ల తీర్మాణానికి మద్దతు ఇవ్వవచ్చు గానీ తీర్మానంపై చర్చ జరిగితే మాత్రం తీర్మానానికి మద్దతు ఇచ్చిన పార్టీలు అన్ని ఏక మాటతో ఏపీకి హోదా ఇవ్వండి అని అంటాయా అనలేవు ఎందుకంటే ఇప్పటికే బీహర్ లాంటి రాష్ట్రాలు తమకు హోదా కావాలని అసెంభ్లీ తీర్మానాలు చేసి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి హోదా ఇవ్వమని కేంద్రం చెప్పింది కాబట్టి ఏపీ హోదా ఉద్యమానికి మద్దతు ఇవ్వవచ్చుగానీ అదే అంశంపై చర్చ జరిగినపుడు వారి ప్రయోజనాలను కూడా ప్రస్తావించకుండా ఉంటారా అన్నది అసలు ప్రశ్న. ఈ మధ్యనే కేంద్రం ఇప్పటికే హోదా అమలులో ఉన్న రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలను మాత్రమే ఇచ్చింది. పూర్తి స్థాయి హోదా పై చర్చ జరిగినపుడు మాకు హోదానూ కొనసాగించవలసిందే అని మాట్లాడవా ? బీహర్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ లాంటి రాష్ట్రాలు మాకూ కావాలని అడిగితే ? సమీపంలో కర్నాటకలో ఎన్నికలు జరగనున్నందున ఆ రాష్ట్రప్రభుత్వం తమ పక్క రాష్ట్రానికి హోదా ఇస్తే మాకూ ఇమ్మని అడగవా ? నేడు బిజెపి పై రాజకీయ కారణాలతో మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు రేపు ఆ తీర్మాణం చర్చకు వచ్చినపుడు అదే స్పూర్తితో మద్దతు ఇస్దాయనుకోవడం బ్రమే అవుతుంది. పై పెచ్చు ఏపీతో బాటూ మాకు కూడా హోదా కావాలని ఇతర రాష్ట్రాలు అడుగుతున్నాయి కాబట్టి అన్ని పరిసీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తప్పించుకుంటే కాదన గలమా. హోదా పెద్ద సమస్యగా మారుతున్నందున బిజెపి వ్యూహత్మకంగా ఇతర రాష్ట్రాలనుంచి చర్చ సందర్బంగా తమ రాష్ట్రాలకు హోదా కావాలని డిమాండు చేయిస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది.
విభజన చట్టం మీద చర్చ పెడితే హక్కును ఉల్లంగించిన కేంద్రం ముద్దాయి అవుతుంది. విభజన చట్టంలోని అంశాలు అమలు కావడం వలన ఇతర రాష్ట్రాలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.( కడప ఉక్కు, గుంతకల్లుకు రైల్వే జోన్, మన్నవరం పూర్తికావడం, దుగిరాజ పట్నం ఓడరేవు, గాలేరు నగరి, హంద్రీ నీవా, వంశధార కు నిధులు , రాయలసీమకు 12 వేల కోట్లు ప్యాకేజీ, ఉత్తరాంద్రకు 10 వేల కోట్ల ప్యాకేజీ, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం పూర్తి, కోస్తా కారిడార్, హైదరాబాదులోని ఉమ్మడి ఆస్తుల పంపకం) విభజన చట్టం అమలు అయితే గరిష్ట ప్రయోజనాలు ఉంటాయి. కనుక అందరూ సమర్థిస్తారు. అధికార, ప్రతిపక్షం మాత్రం అన్నీ తెలిసికూడా తమ రాజకీయ హోదాకు ఉపయోగపడే ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నాయి తప్ప ప్రజల హోదా మార్చగలిగే విభజన చట్టం అమలు కోసం ప్రయత్నించడం లేదు. మరి విజ్ఞత కలిగిన ప్రజలు పార్టీల ‘ రాజకీయ’ హోదా కోసం బలి అవుతారా ? తమ హోదా కోసం నిలబడతారా….
-యం పురుషోత్తం రెడ్డి
రాయలసీమ మేధావుల పోరం
తిరుపతి. 9490493436