“పూలరంగడు” సినిమా గుర్తుంది కదా. అక్కినేని నాగేశ్వర రావు 1967 బాక్సాఫీస్ హిట్. తమిళ, హిందీ భాషలలో కూడా వచ్చింది. నాగేశ్వరరావు, జమున, శోభన్ బాబు విజయ నిర్మల జంటలుగా నటించిన ఈ సినిమా నాకయితే, ఒక్క పాటతోనే గుర్తుండి పోయింది. ఆ పాటే ‘చిగురులు వేసిన కలలన్నీ, సిగలో పూలుగా మారినవి…’. ఈ పాటని నేను ఎన్ని సార్లు విన్నానో లెక్కేలేదు. బ్యాచ్ లర్ గా బతుకుతున్న రోజుల్లో ఏదో పుస్తకం చదువుతూ ఆర్థ రాత్రి దాకా మేల్కొవడం, ఆపైన కూడా నిద్ర రాకపోతే, చక్కగా బ్లాక్ టీ తాగుతూ ఈ పాట వినడం నాకు అలవాటు. అందునా ఢిల్లీ మిడ్ వింటర్ లో దట్టంగా బయట మంచు కురుస్తున్నపుడు, గదిలో చలిచలిగా గిలివేస్తున్నపుడు బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగుతూ చిగరులు వేసిన కలలన్నీ కూని రాగం తీస్తూ ఈ పాటు వింటూ ఎన్ని రోజులు గడిపానో లెక్కేలేదు. ఆ పాటంటే నాకిష్టం, ఆ పాట సాహిత్యం నాకిష్టం. ఆ పాట సంగీతం నాకిష్టం. అన్నింటికంటే, ఆ పాట పడిన మధురమయిన కెబికెమోహన్ రాజు కంఠం నాకిష్టం. నామట్టుకు ఫూలరంగడు సినిమాఅంటే శోభన్, విజయనిర్మల మీద వచ్చిన ఈ పాటే. ఆ గాయలకు నేను మర్చిపోలేను. రొమాన్స్ పాటలో ప్రవహిస్తూ ఉంటుంది. పాటలోని ప్రతిపాదమూ నన్న తన్మయత్వంలోకి తీసుకెళ్తుంటుంది. ఇది అప్పటి మాటే కాదు, ఇప్పటి మాట కూడా.
అయితే, ఈ రోజు పొద్దునే పేపర్ తిరగేస్తూన్ననపుడు ఒక పేజీలో ఎన్నో పెద్ద పెద్ద వార్తల మధ్య నలిగిపోతూ, ఒక చిన్నవార్త దీనంగా నావైపు చూసింది. ఫోటో కూడా కంటికి కనిపించీ కనిపించనంత చిన్నది. హెడ్ లైన్ లో కృష్ణ మోహన్ రాజు మృతి అని ఉంది. తీరా చదవితే అది కెబికె మోహన్ రాజు మృతి వార్త. హృదయం కళుక్కుమంది. కెబికె మోహన్ రాజు పాట, పూలరంగడు సినిమా తప్ప ఆయన నాకు బొత్తిగా తెలియదు. ఆయన హైదరాబాద్ ఎల్ బి నగర్ ఉంటూ నిన్న చనిపోయారు. ఉండబట్ట లేక వెంటనే నా కిష్టమయిన పాట, ఆయనకు నివాళిగా మళ్లీ విన్నాను. మళ్లీ …మళ్లీ విన్నాను. అదే వాడిపోని పూల పరిమళం… పాట రాసింది డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. గాయకులు, కెబికె, సుశీల.సినారె, సాలూరి రాజేశ్వరరావు కాంబినేషన్ అదిరిపోయింది. కెబికె గాత్రంతో పాటు సినారే కవిత్వం కూడా రాజేశ్వరరావు సంగీతంలో విరబూసి గుబాళించింది. ఇందులో నాకు అత్యంత ఇష్టమయిన పాదం, ‘‘నీటిలో నికలవనుకోరి నింగిడిగిన జాబిలి నీవే.. పరిమళాల తరగలలోనే కరగించిన చెలియవు నీవే..,’’ . ఇది వింటూ హృదయం ఆర్ద్రం కాకుండా వుండటం కష్టం.
ఘంటసాల , ఎస్ పి బాల సుబ్రమణ్యం వంటివారికి కెబికె సమకాలీనులు, ఆకాశవానిలో పనిచేస్తూ చాలా సినిమాల్లో పాడారు. పూలరంగడు తోపాటు, 1960,70 దశకాలలో తాహశీల్దారుగారి అమ్మాయి, సాక్షి, మాభూమి విధి విలాసం, పెళ్లికాని పెళ్లి, పెద్దన్నయ్య వంటి సినిమాలలో పాడారు. చక్కటి , శ్రోతలను గాల్లో తేలియాడించే తెలిక స్వరం ఉన్నా ఆయన మరుగున పడిపోయారు.
ఆకాశవాణి గాయకుడిగా ఆయనకు చాలా మంచిపేరొచ్చింది. ఎపుడో 1957లోనే మర్ఫీ మెట్రో- ఇండియన్ సింగింగ్ కంటెస్ట్, మద్రాసు సౌత్ జోన్ బెస్ట్ సింగర్ అవార్డు వచ్చింది. ఈ పోటీకి న్యాయనిర్ణేత లు ఎవరో తెలుసా, బాలివుడ్ మేటి మ్యూజిక్ డైరెక్టర్లు, నౌషాద్, సి రామచంద్ర, మదన్ మోహన్, అనిల్ బిశ్వాస్. ఆ రోజుల్లొ ఆయన్ని లలిత సంగీత నెలరాజు అని పిలచే వాళ్లు.
ఇదిగో ఇదే ఆయన మరణ వార్త.
పూలరంగడు పాట ఇదే.
-లక్ష్మణ్ విజయ్