గుంటూరులో జరిగిన డయేరియా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే బంద్కు పిలుపునిస్తానని, అవసరమైతే దీక్షకు దిగుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
డయేరియాతో బాధపడుతూ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ కల్యాణ్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రభుత్వం తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. చనిపోయిన వారిని తీసుకురాలేం… దీనికి ఎవరు బాధ్యులు? అంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో తాగునీరు ఇచ్చే పరిస్థితి కూడా లేదని, ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది.. అని అన్నారు. మీ ఇంట్లో వాళ్లు చనిపోతే ఇలాగే స్పందిస్తారా? అంటూ ఇక్కడి ప్రజాప్రతినిధులకు సమస్యలు పట్టవా? అన్నారు.
వైసీపీ అసెంబ్లీకి రావాలి…
రానంటే కుదరదు: పవన్
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైసీపీ అసెంబ్లీకి రావాలని, రానంటే కుదరదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు నాకు ఉంది…, నోటికి వచ్చినట్లు మాట్లాడితే నేను బలంగా మాట్లాడాల్సి ఉంటుందని, ప్రత్యేక హోదాపై ఏపార్టీకి క్లారిటీ లేదని పవన్ కల్యాన్ పేర్కొన్నారు.