జనసేన గుంటూరు ఆవిర్భావ సభతో ఒక విషయం మాత్రం స్పష్టమయింది. ఏపీలో 2019లో జరుగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ముక్కోణపుపోటీ జరగబోతోంది. జనసేన పూర్తిస్థాయి రాజకీయపార్టీగా ఆవిర్భవించినట్లు పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓటువేయాలని కోరారు. ఇప్పటివరకు కొన్ని కులాలే అధికారాన్ని అనుభవించాయని, ఇలా అది కొనసాగబోదని అన్నారు. దళితులు, మైనారిటీలను కలుపుకుని అణగారిన వర్గాలతో అధికారాన్ని చేజిక్కించుకుంటామని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడితే చేయబోయే పనులను కూడా ప్రస్తావించారు.
దీనితో ఏపీలో ఇప్పుడు ఐదు ప్రధాన పార్టీలు ఉన్నట్లయింది. వీటిలో కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే, అడ్డగోలుగా విభజన చేశారనే ఆవేదనతో ఆంధ్రులు ఆ పార్టీని పాతాళానికి తొక్కేసిన సంగతి తెలిసిందే. వాళ్ళు ఎంతచేసినా ఆ పార్టీ ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి కనపడటంలేదు కాబట్టి ఆ పార్టీ ఉన్నా లేనట్లే. ఇక బీజేపీకి ఏపీలో పెద్ద ఓట్ బ్యాంక్ అయితే ఏమీలేదు. దానికితోడు ప్రత్యేకహోదా హామీని ఇచ్చి నమ్మకద్రోహం చేసినందుకు ఆంధ్రులు ఆ పార్టీపై కూడా రగిలిపోతున్నారు. కాబట్టి ఆ పార్టీ ప్రభావంకూడా పెద్దగా ఉండదు. ఇక బరిలో మిగిలింది టీడీపీ, వైసీపీ… తాజాగా వచ్చి చేరిన జనసేన.
టీడీపీ, వైసీపీలకు బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలకు ఓట్లశాతంలో తేడా కేవలం ఒక్కటి మాత్రమే. టీడీపీకి కమ్మసామాజికవర్గంతోబాటు బీసీలు ప్రధానమైన ఓట్ బ్యాంక్. అయితే గత ఎన్నికల్లో పవన్ పుణ్యమా అని కాపుల ఓట్లు గంపగుత్తగా టీడీపీకి పడ్డాయి. దానితో ఆ పార్టీ విజయాన్ని చేజిక్కుంచుకోగలిగింది. అయితే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత గణనీయంగా ఉంది. క్షేత్రస్థాయిలో అవినీతి బాగా పెరిగిపోవటంకూడా టీడీపీకి మరో మైనస్ పాయింట్. రాజధాని ఎంపికలో, భూసేకరణలో భారీస్థాయి అవినీతి జరిగిందన్న ఆరోపణ బలంగా ప్రచారంలో ఉంది.
ఇక వైసీపీకి రెడ్డి సామాజికవర్గంతోబాటు ఎస్సీ మాల సామాజికవర్గం ఓట్లు పెట్టనికోటగా ఉంటాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుందికాబట్టి మైనారిటీ ఓట్లుకూడా వైసీపీకే సహజంగా పడ్డాయి. అయితే ఈసారి వైసీపీ కమలనాథులతో పొత్తుకోసం తహతహలాడుతోందికాబట్టి మైనారిటీలు దూరమయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. వైసీపీకి జగన్ వ్యవహారశైలి, అవినీతి కేసులు పెద్ద బలహీనతలని చెప్పాలి. ఆ కేసుల దృష్ట్యా జగన్ బీజేపీపట్ల గోడమీద పిల్లివాటం ప్రదర్శించటం అందరికీ స్పష్టంగానే తెలుస్తోంది. దానికి తోడు ఆయన వ్యవహారశైలివల్ల పలువురు నమ్మకస్తులే పార్టీని వీడి బయటకెళ్ళిపోయారు. అనేక కీలకవిషయాలలో జగన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుని సెల్ఫ్ గోల్ చేసుకోవటంకూడా అందరికీ విదితమే.
ఇక జనసేనకు సంప్రదాయ కాపు ఓట్ బ్యాంకుతోబాటు యువత మద్దతుకూడా గణనీయంగానే ఉంటుందని ఇవాళ్టి సభద్వారా తెలుస్తోంది. సభకు ఎక్కడా డబ్బు ఖర్చుపెట్టకుండానే జనం స్వచ్ఛందంగా అంత సంఖ్యలో హాజరయ్యారంటే యువతలో అతనికున్న ఆదరణను తేలిగ్గా తీసిపారెయ్యలేము. కానీ, సంస్థాగత నిర్మాణం లేకపోవటం, అనుభవలేమి, ద్వితీయశ్రేణి నాయకత్వలేమి ఆ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్స్. దానికితోడు పవన్ కు నిలకడ, స్పష్టత ఉండవన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పార్ట్ టైమ్ పాలిటిక్స్ మాత్రమే అతను నడుపుతున్నారు. ఇవాళ్టి సభలోకూడా ఆయన టీడీపీని ఎండగట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్పితే తమ పార్టీ విధివిధానాలనుగానీ, కమిటీలనుగానీ ప్రకటించకపోవటం గమనార్హం. ఆగస్ట్ 15న పార్టీ మ్యానిఫెస్టో ప్రకటిస్తానన్నారుగానీ, సంస్థాగత నిర్మాణం గురించిగానీ, కమిటీల గురించిగానీ ప్రస్తావించలేదు. ప్రజారాజ్యం అనుభవందృష్ట్యా కమిటీలను వేయటానికి భయపడుతున్నాడని అంటున్నారు. మరి ఇలా భయపడేవాడు ఆ రెండు ప్రధానపార్టీలను ఎలా ఎదిరించగలడనేది ప్రస్తుతానికైతే చిక్కుప్రశ్నగానే ఉంది.
ఎన్నికల్లో డబ్బులు తీసుకోవాలని, ఓట్లు మాత్రం జనసేనకు వేయాలని పవన్ సభికులకు పిలుపునివ్వటం ఈ సభలో ఒక కొసమెరుపు. ఇలా పిలుపునివ్వటం చట్టవిరుద్ధమన్నదికూడా పవన్ కు తెలియకపోవటం విచారకరం. దీనికిగానూ పవన్ కేసును ఎదుర్కోవలసిఉంటుంది.
-శ్రవణ్ బాబు. సీనియర్ జర్నలిస్టు. ఫోన్ నెం.9948293346