బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
– స్టీల్ ప్లాంటు సాధనా సమితి అధ్యక్షుల జివి ప్రవీణ్ కుమార్ రెడ్డి
ప్రొద్దుటూరు మన్సిపాల్టీలో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన సుబ్బరాయుడు కుటుంబాన్ని ఆదుకోకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ఉక్కు సైనికులతో ముట్టడిస్తామని స్టీల్ ప్లాంటు సాధనా సమితి అధ్యక్షులు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి మద్దతు తెలిపారు.
దళితులైన కార్మికుల పట్ల మున్సిపల్ అధికారులు, పాలక మండలి వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండి పడ్డారు. చనిపోయిన కార్మికుని భార్య మేరి తో తొమ్మిదినెలల పాటు రోజూ కూలీగా పనిచేయించుకుని వేతనం ఇవ్వకుండా ఆ కుటుంబానికి అన్యాయం చేయడం అమానుషమన్నారు. అధికారులు ఒక్క రోజు జీతం రాకపోతే ఊరుకోని వారు ఒక నిరుపేద, దళిత కార్మికురాలి జీతం ఇచ్చే విషయంలో వహించిన నిర్లక్ష్యం క్షమించరానిదన్నారు. తొమ్మిది నెలలుగా జీతం ఇవ్వకపోతే ఆ తల్లి ఇద్దరు పసి పిల్లలతో తన కుటుంబాన్ని ఎలా పోషిస్తుంది వారి పిల్లలకు తిండి ఎలా పెడుతుందో ఆలోచన చేయలేని మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్ ఇద్దరూ మానవత్వం లేని మనుషులని దీన్ని స్టీల్ ప్లాంటు సాధనా సమితి తీవ్రంగా ఖండిస్తోందని, వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించి సుబ్బరాయుడు భార్తకు ఉద్యోగం కల్పించి, బకాయి పడిన తొమ్మిది నెలల వేతనాన్ని చెల్లించి ఆదుకోక పోతే ఉక్కు సైనికులతో మున్సిపాల్టీని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.