అసెంబ్లీ తొలిరోజు రేవంత్ ఏం చేసిండో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగం సమయంలో రచ్చ రంబోలా అయింది. కాంగ్రెస్ సభ్యులు చెలరేగిపోయారు. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తొలిరోజు సభలో హాట్ టాపిక్ అయిండు. ఆయన ఏకంగా హెడ్ ఫోన్ ఇరగ్గొట్టి గవర్నర్ కు సూటి పెట్టి విసిరికొట్టిండు. దీంతో ఆ హెడ్ ఫోన్ కాస్తా గవర్నర్ కు కాకుండా శాసనమండలి ఛైర్మన్ కంటి కింద తలిగింది. దీంతో పెద్ద దుమారం రేగింది. తొలిరోజు ఇంత హడావిడి, హంగామా జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యుడు రేవంత్ రెడ్డి ఎటు పోయిండబ్బా అని కాంగ్రెస్, టిడిపి వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరి ఇంతకూ రేవంత్ తొలిరోజు ఎటు పోయిండు? ఏం చేసిండో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే వేడి పుట్టించాయి. తొలిరోజు వివాదానికి కోమటిరెడ్డి కేంద్ర బిందువయ్యారు. మరి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఉంటే ఇంకెట్ల ఉంటుండెనో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. రేవంత్ రెడ్డి తొలిరోజు అసెంబ్లీకి హాజరైనా ఎక్కడా తాను పల్లెత్తు మాట మాట్లాడలేదు. అది కూడా అసెంబ్లీ ఆవరణలోనే అటు ఇటూ తిరిగిండు తప్ప.. శాసనసభ జరిగే హౌస్ లో కాలు పెట్టలేదు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా బలరాం నాయక్ నామినేషన్ వేసే కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి డైరెక్ట్ గా ఆయన ఇంటికే వెళ్లిపోయారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతోనూ పెద్దగా రేవంత్ మాట్లాడలేదు. చిట్ చాట్ లో కూడా మీడియాతో మాట్లాడలేదు.
మరి రేవంత్ ఎందుకు హౌస్ లోకి వెళ్లలేదు? ఎమ్మెల్యేగానే ఉన్నప్పటికీ హౌస్ లో తన వాణి వినిపించాల్సిన సమయంలో మౌనంగా ఎందుకున్నారు అన్నది హాట్ టాపిక్ అయింది. అయితే టిడిపి ఎమ్మెల్యేగా, టిడిఎల్పీ నేతగా ఉన్న రేవంత్ రెడ్డి గత మూడు నెలల క్రితం టిడిపికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. విజయవాడకు పోయి టిడిపి అధినేత చంద్రబాబుకు రెండు రాజీనామా లేఖలు అందజేశారు. అందులో ఒకటి పార్టీ సభ్యత్వానికి రాజీనామా కాగా.. ఇంకోటి తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాసిన రాజీనామా లేఖ. అయితే ఆ రాజీనామాను చంద్రబాబుకు ఇచ్చి స్పీకర్ కు ఇవ్వకపోవడంతో రేవంత్ మీద పెద్ద దుమారమే రేగుతున్నది. రేవంత్ రాజీనామా ఒక డ్రామా అని అధికార పార్టీ విరుచుకుపడుతున్నది.
రేవంత్ టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవే కావడంతో రేవంత్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి వాదన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ‘‘తాను టిడిపికి రాజీనామా చేశాను.. ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాను.. కాబట్టి నేను అసెంబ్లీకి హాజరు కాను’’ అన్నది రేవంత్ మాటగా చెబుతున్నారు. అందుకే అసెంబ్లీ లాబీల్లోకి వచ్చినప్పటికీ హౌస్ లోకి రేవంత్ వెళ్లలేదని చెబుతున్నారు.
తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరులో అధికార పార్టీ పైచేయి సాధించిందన్న చర్చ మాత్రం జరుగుతున్నది. ఒకవైపు కోమటిరెడ్డి హెడ్ ఫోన్ విసరడం.. దానిపైన అధికార పార్టీని ఇరుకునపెట్టేలా వ్యూహరచన చేయలేకపోయారన్న చర్చ సాగుతోంది. ఇక హరీష్ రావు కూడా కాంగ్రెస్ ను కార్నర్ చేశారు. అధికార పార్టీని సమర్థవంతంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఎదుర్కోలేదన్న చర్చ అయితే సాగుతోంది. అదే రేవంత్ రెడ్డి కూడా ఉండి ఉంటే అధికార పార్టీకి పైచేయి దక్కేది కాదన్న వాదన వస్తోంది. ఎందుకంటే టిడిపిలో బలం, బలగం కొద్దిగొప్ప ఉన్నప్పుడే రేవంత్ అధికార పార్టీకి గట్టి ప్రత్యర్థిగా నిలిచాడన్న వాదనను తెస్తున్నారు.
రేవంత్ రాజీనామా సంగతేంటి?
రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశానని చెబుతున్నా.. ఇందులో నాటకీయత మాత్రం కనబడుతున్నది. ఆయన రాజీనామా ఇప్పటి వరకు స్పీకర్ కు అందలేదని చెబుతున్నారు. మరి రాజీనామా చేశాను కాబట్టి అసెంబ్లీకి రానని చెబుతున్న రేవంత్ రెడ్డి మాత్రం తన నియోజకవర్గమైన కొడంగల్ లో మాత్రం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల కాలంలో కొడంగలో లోని అనేక గ్రామాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డితోపాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తి నియోజకవర్గంలో ఎందుకు పాల్గొంటున్నాడన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
మరి తొలిరోజు మౌనముద్రలో ఉన్న రేవంత్ మిగతా రోజుల్లోనైనా అసెంబ్లీ జరుగుతున్న తీరు తెన్నుల మీద, వ్యవహారాల మీద మాట్లాడతారా? లేదంటే బడ్జెట్ సెషన్స్ మొత్తం మూగనోము తప్పదా అన్నది తేలాల్సి ఉంది.