కేంద్ర మాజీ ఇంధన కార్యదర్శి ఇఎ ఎస్ శర్మ కేంద్రం ప్రతిపాదించిన 15వ ఆర్థిక సంఘం తీసుకు రానున్న అనర్థాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాసిన లేఖ ఇది.
గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి
అయ్యా,
కేంద్ర ప్రభుత్వం 27-11-2017 న పదిహేనవ ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ ను ఇక్కడ జత పరిచాను.
పదమూడవ, పధ్నాల్గవ ఆర్ధిక సంఘాలతో పోల్చి చూస్తే, కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్ధిక సంఘము విషయంలో కొన్ని కీలక మార్పులను తెచ్చినమాట మీకు తెలిసి ఉండకపోవచ్చు. అటువంటి మార్పులవలన దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున అన్యాయం జరిగే అవకాశం ఉంది. మీ అధికారులు ఆ నోటిఫికేషన్ ను క్షుణ్ణంగా పరిశీలంచలేదని అర్ధమవుతున్నది. లేకపోతే మీరు ఇప్పటికే ఆ విషయాన్ని ప్రధాన మంత్రి గారికి రాసి ఉండవలసినది.
పదమూడవ, పధ్నాల్గవ ఆర్ధిక సంఘాలు 1971 సంవత్సరం జానాభాలెఖ్ఖలను ఆధారంగా తీసుకోవడం వలన, దక్షిణ రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను పతిష్ఠముగా అమలుచేసినా, అందువలన నిధుల కేటాయింపులో ఎటువంటి త్రగ్గుదల జరగలేదు. ఈ విషయంలో ఎటువంటి మార్పు తెచ్చినా, కేంద్ర ప్రభుత్వం ముందస్తు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపవలసినది. అటువంటి సంప్రదింపులు జరపకుండా, ఏకపాక్షికంగా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కీలక మార్పును లోపాయికారీగా ప్రవేశపెట్టడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మైత్రీ సంబంధాలకు అనుగుణంగా లేదు.
వైర్ అనే ఎలెక్ట్రానిక్ దైనిక పత్రికలో ఈ విషయాన్ని ఒక ఆర్ధిక శాస్త్ర వేత్త (R S Neelakanthan) విపులంగా పరిశీలించి దక్షిణ రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగ గలదో వివరించారు. మీ ఆర్ధిక శాఖ అధికారులు అటువంటి పరిశీలన చేయకపోవచ్చు. ఇప్పుడైనా ఆ అధికారులు క్షుణ్ణంగా ఈ నోటిఫికేషన్ ను తత్క్షణం పరిశీలించి మీకు ఉన్నది ఉన్నట్టు చెప్పవలసి ఉంది. నిజంగా మన రాష్ట్రానికి అన్యాయం అయి ఉంటే మీరు ప్రధాన మంత్రిగారికి రాష్ట్ర ప్రజల తరఫున నిరసన తెలుపుతూ ఒక లేఖ వ్రాసి, ఆ లేఖ నఖలును ప్రజలముందు పెట్టాలి.
మీరు గాని, పార్లమెంటులో ఉన్న మీ పార్టీ ప్రతినిధులు గాని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీ మంత్రులు గాని ఈ విషయాన్ని లేవనెత్తక పోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అప్పుడే మూడు నెలలు అయినా మీ ప్రభుత్వం స్పందించక పోవడం ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది.
నీలకంఠన్ గారు వ్రాసిన విషయాలను పరిశీలిస్తే, గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ వంటి ఉత్తర భారత రాష్ట్రాలకు లాభం కలిగించే విధంగా పదిహేనవ ఆర్ధిక సంఘము లక్ష్యాలను తీర్చి దిద్దారనే సందేహం వస్తుంది.
రాష్ట్ర ప్రజల దీర్ఘ కాల సంక్షేమం విషయంలో అప్రమత్తతతో ఉండే బాధ్యత మీమీద, మీ ప్రభుత్వం మీద ఉందని మీరు గమనించాలి.
ఇప్పుడైనా స్పందించి జాప్యం చేయకుండా కేంద్రానికి నిరసన తెలుపుతారని, పదిహేనవ ఆర్ధిక సంఘం జనాభా లెఖ్ఖల విషయంలో ఎటువంటి మార్పులు చేయకుండా నిధుల కేటాయింపు చేయాలని కేంద్రం మీద ఒత్తిడి తీసుకువస్తారని నమ్ముతున్నాను.
ఇట్లు,
ఈ అ స శర్మ
విశాఖపట్నం
15-2-2018
**15 Finance Commission Gazette