తెలంగాణ స్వరాష్ట్రంలో మరో నెత్తుటి మరక ఇది. 12 మంది మావోయిస్టులను పోలీసు బలగాలు కాల్చి చంపిన ఘటన. ఎదురుకాల్పుల్లో ఒక కానిస్టేబుల్ కూడా కన్నుమూసిన సందర్భం. రాష్ట్ర భగోళిక స్వరూపం మారినా.. పాలకులు మారినా నెత్తుటి మరకలు మాత్రం అంటుతూనే ఉన్నాయి. ఎన్ కౌంటర్ల పేరుతో రక్తచరిత పునరావృతమవుతూనే ఉన్నది.
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో శుక్రవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స బలగాలు 12 మందిని అంతం చేశాయి. ఈ ఘటనలో ఒక పోలీసు మరణించారు.
మరణించిన వారిలో మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్, కీలక నేత బడే చొక్కారావు మరణించినట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు అజాద్ ఈ కాల్పుల్లో గాయపడి తప్పించుకున్నట్లు చెబుతున్నారు.
చర్ల మండలం తొడపాల్ సమీపంలో మావోయిస్టులు సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వారిని ఏరివేయడానికి గ్రేహౌండ్స్ బలగాలు ఆపరేషన్ మొదు పెట్టారు. ఎదురు కాల్పులు జరిగాయి. 12 మంది మావోయిస్టులు మరణించారు. అందులో సగం మంది అంటే ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలంలో ఆయుధాలు, స్కానర్, ల్యాప్ టాప్, 41వేల నగదు లభించినట్లు పోలీసు అధికారులు చెప్పారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
మరోవైపు ఈ ఎన్ కౌంటర్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని ఈ పిటిషన్ దాఖలైంది. మావోల మృతదేహాలను తరలించే వీడియో కింద ఉంది.